ఆర్టీసీలో అద్దె బస్సులకు టెండర్ నోటిఫికేషన్

తెలంగాణ ఆర్టీసీ ప్రక్షాళనకు అడుగు పడింది. ఆర్టీసీలోకి మరికొన్ని అద్దె బస్సులకు టెంటర్ నోటిఫికేషన్ జారీ అయింది. ఆర్టీసీ వెట్ సైట్ లో నోటిఫికేషన్ పెట్టారు. అక్టోబర్ 21 మధ్యాహ్నం 2 గంటలకు వరకు గడువు విధించారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు టెంటర్లు ఓపెన్ చేసి సెలెక్షన్ కమిటీ ఖరారు చేయనుంది. ఇందులో 760 బస్సులు జీహెచ్ ఎంసీ పరిధిలో తిరుగనున్నాయి. ఇప్పటికే ఆర్టీసీలో 2100 అద్దె బస్సులు ఉన్నాయి. కొత్త బస్సులతో కలుపుకొని ఆర్టీసీలో మొత్తం 3 వేల 135 అద్దె బస్సులు కానున్నాయి.
ప్రయాణికులు సౌకర్యార్థం టీఎస్ ఆర్టీసీ ఇప్పటికే 2100 అద్దె బస్సులు తిప్పుతోంది. ఇప్పుడు వీటికి అదనంగా 9 శాతం బస్సులను తీసుకొచ్చేందుకు ఆర్టీసీ టెండర్ నోటీఫికేషన్ జారీ చేసింది. మొత్తం 1035 అదనపు బస్సులను అద్దె ప్రాతిపదికన తీసుకోవాలని ఆర్టీసీ ఉన్నతాధికారుల నిర్ణయించారు.
ఆదిలాబాద్ రీజియన్ లో 18, నిజామాబాద్ రీజియన్ లో 25, కరీంనగర్ లో 43, వరంగల్ లో 47, ఖమ్మంలో 25, మహబూబ్ నగర్ లో 51, మెదక్ లో 39, నల్గొండలో 5, రంగారెడ్డిలో 22, హైదరాబాద్ లో 423, సికింద్రాబాద్ లో 337 బస్సులను అద్దే ప్రాతిపదికన తీసుకోనున్నారు.
ఇక పల్లె వెలుగుకు కిలో మీటరుకు రూ. 5.25 పైసలు , ఎక్స్ ప్రెస్ కు రూ. 5.43 పైసలు,
సిటీ ఆర్డీనరీ బస్సుకు రూ. 4.81 పైసలు, సిటీ సబర్బన్ బస్సుకు రూ.4.95 పైసలు, మెట్రో బస్సుకు రూ.4.86 సైసలు చెల్లించాలని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఆసక్తి గల వారు అక్టోబర్ 21వ తేదీ లోపు ఆయా రీజియన్లలో టెండర్లు దాఖలు చేయాలని వెల్లడించారు.
అక్టోబర్ 5 నుంచి ప్రారంభమైన ఆర్టీసీ కార్మికుల సమ్మె 13 వ రోజుకు చేరుకుంది. కార్మికులు సమ్మె విరమించి ప్రభుత్వంతో చర్చలు జరపాలని హైకోర్టు సూచించింది. అలాగే యుద్ధ ప్రాతిపదికన సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉందని హైకోర్టు తెలిపింది. సోమవారం లోగా కార్మికులకు జీతాలు చెల్లించాలని హైకోర్టు ఆదేశించిన క్రమంలో ఆర్టీసీ ప్రక్షాళన దిశగా అడుగు పడింది. కొత్తగా మరికొన్ని బస్సులను తీసుకోవాలని ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.