గుడ్ న్యూస్ : 13, 16 తేదీల్లో టోల్ ఛార్జీలు రద్దు

  • Published By: veegamteam ,Published On : January 13, 2019 / 03:55 AM IST
గుడ్ న్యూస్ : 13, 16 తేదీల్లో టోల్ ఛార్జీలు రద్దు

Updated On : January 13, 2019 / 3:55 AM IST

హైదరాబాద్ : సంక్రాంతి సందర్భంగా ప్రయాణీకులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రజల ప్రయాణాలను దృష్టిలోఉంచుకొని జనవరి 13, 16 తేదీల్లో రాష్ట్రంలోని జాతీయ రహదారులపై టోల్ గేట్ల వద్ద ఛార్జీల వసూళ్లను రద్దు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ సీఎస్ ఎస్ కే జోషి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు, జాతీయ రహదారుల అధికారులతో మాట్లాడి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

హైదరాబాద్ లో ఉంటున్న వారు సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్తున్నారు. సంక్రాంతికి హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళ్లే వారి సంఖ్య 35 లక్షలకు పైగా ఉంటుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఏపీ, తెలంగాణ గ్రామాలను నుంచి వచ్చి హైదరాబాద్ లో ఉంటూ ఉద్యోగం చేసుకుంటున్న వారు కుటుంబ సమేతంగా సొంతూళ్లకు వెళ్తున్నారు. బస్సులు, కార్లతోపాటు వివిధ వాహనాల్లో బయలుదేరుతున్నారు.

నగరం నుంచి గ్రామలకు భారీగా వాహనాలు వెళ్తుండటంతో టోగ్ గేట్ల వద్ద కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్నాయి. ఒక్కో వాహనానికి టోల్ ఛార్జీ వసూళ్లుకు 2 నుంచి 3 నిమిషాల సమయం పడుతుంది. దీంతో వాహనాలు భారీగా నిలిచిపోతున్నాయి. తీవ్రంగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. టోల్ గేట్ లను దాటి వాహనాలు బయటికి వెళ్లేందుకు చాలా సమయం పడుతుంది. అధిక సమయం టోల్ గేట్ వద్దే గడిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు, అసహనానికి గురవుతున్నారు. అయితే ప్రయాణానికి ఎలాంటి ఇబ్బంది కల్గకుండ ఉండేందుకు, త్వరగా వెళ్లేందుకు రాష్ట్రంలోని జాతీయ రహదారులపై టోల్ గేట్ ఛార్జీలను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో వాహనాలు త్వరగా బయల్దేరుతున్నాయి. పండుగకు వెళ్లే వారి ప్రయాణం సాఫీగా సాగుతోంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రయాణీకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.