మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల బరిలోకి టీఆర్ఎస్

తెలంగాణలో అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) మొట్టమొదటి సారి మరో రాష్ట్రంలోని ఎన్నికలకు సిద్ధం అవుతుంది. త్వరలో మహారాష్ట్రలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేసేందుకు గులాబీ బాస్ కేసీఆర్ అనుమతి కోరారు అక్కడి రైతులు.
నాందేడ్ జిల్లాలోని 6 నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ తరపున పోటీ చేయబోతున్నారు. మహారాష్ట్రకు చెందిన పలువురు నాందేడ్ జిల్లా రైతులు ఈ మేరకు సీఎం కేసీఆర్‌ను కలిసి అడగగా.. ఆయన అనుమతి ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా రైతులు తమ సమస్యలను సీఎం కేసిఆర్ దృష్టికి తీసుకుని వచ్చారు. తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అద్భుతంగా అమలవుతున్నాయని గతంలో జిల్లా వాసులు తమను తెలంగాణలో కలపని కూడా ఉద్యమించారు. ఈ క్రమంలోనే అక్కడ టీఆర్ఎస్ బలం కూడా పెరిగింది. తమ రాష్ట్రంలోనూ తెలంగాణ తరహా పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ఉద్యమాలు చేశారు.
ఈ క్రమంలో తమ పోరాటానికి మద్దతివ్వాలని సీఎం కేసీఆర్‌ను కోరిన రైతులు.. టీఆర్‌ఎస్ పార్టీ టికెట్లపై పోటీ చేయడానికి సిద్ధమని ప్రకటించారు. దీనిపై స్పందించిన సీఎం త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని రైతులకు చెప్పారు.