మండలానికో 108 అంబులెన్స్

తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి మండలానికో 108 అంబులెన్స్ సమకూర్చాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ప్రణాళిక తయారు చేస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశ పెట్టబడిన 108 అంబులెన్స్ సర్వీసులు ఎంతో మంది రోడ్డు ప్రమాదబాధితుల ప్రాణాలు కాపాడాయి. నేటికి వాటి సేవలు ప్రజలు వినియోగించుకుంటూనే ఉన్నారు. ప్రతి మండలానికి ‘108’ సర్వీసును అందుబాటులోకి తీసుకొస్తే దాని పరిధిలోని సమీప గ్రామాలకు తక్కువ సమయంలో చేరుకోవడానికి వీలు కలుగుతుందని, ప్రాణాపాయం నుంచి అనేక మందిని రక్షించవచ్చనేది ప్రభుత్వ ఆలోచన. ప్రస్తుతం రాష్ట్రంలో 358 వాహనాలు ‘108’ వైద్య సేవలు అందిస్తున్నాయి. వాటిల్లో 333 వాహనాలు ప్రజలకు అందు బాటులో ఉండగా మిగిలినవి రిజర్వులో ఉన్నాయి. పట్టణాలు, నగరాల్లోనూ ఇవే వాహనాలు అత్యవసర సమయాల్లో రోగులను ఆసుపత్రులకు చేరుస్తున్నాయి. ప్రతి లక్ష జనాభాకు ఒకటి చొప్పున ప్రస్తుతం ‘108’ వాహనం ఉండగా మండలానికి ఒకటి ఏర్పాటు చేయడంద్వారా ప్రతి 70 వేల జనాభాకు ఒక వాహనాన్ని అందు బాటులోకి తీసుకు వచ్చినట్టు అవుతుంది. ఆ ప్రకారం రాష్ట్రంలో 589 మండలాలుండగా ఆ మేరకు వాహనాల సంఖ్యను పెంచనున్నారు.
మెరుగైన సేవల కోసం అధ్యయనం
ఒక్కో వాహనం రోజుకు నాలుగు ట్రిప్పులు వెళ్లేలా ఈ పథకాన్ని తీర్చిదిద్దారు. 2007 నుంచి అంబులెన్స్ సర్వీసులను జీవీకే సంస్థ నిర్వహిస్తోంది. వాహనాల నిర్వహణ ఖర్చు, సిబ్బంది వేతనాలు కలిపి ప్రభుత్వం ఆ సంస్థకు ఏటా రూ. 86 కోట్లు చెల్లిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో చేసుకున్న ఒప్పందం ప్రకారమే ఇప్పటికీ ఆ సంస్థ కార్యకలాపాలు చేపడుతోంది. దాని నిర్వహణ ఒప్పందం 2016లో ముగిసినా పొడిగిస్తూ వస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. మూడు నెలల క్రితం టెండర్ల ద్వారా 108 సర్వీసుల నిర్వహణ బాధ్యతను ఒక ప్రతిష్టాత్మక సంస్థకు అప్పగించాలనుకున్నా అది కుదరలేదు. అయితే ‘108’ సేవల్లో మరిన్ని విప్లవాత్మక మార్పులు చేసి కొత్త నిబంధనలతో సేవలను అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. 108 సేవల్లో మరింత విప్లవాత్మక మార్పులు చేసి ప్రజలకు కొత్త నిబంధనలతో సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు ఆరోగ్యశాఖ అధికారులు మహారాష్ట్ర , ఢిల్లీ, తమిళనాడు, ఏపీ తదితర రాష్ట్రాల్లో అధ్యయనం చేసి వచ్చారు. అందుకు సంబంధించిన నివేదికను ఇటీవలే ప్రభుత్వానికి సమర్పించారు.
108 నిర్వహించేందుకు ముందుకు వచ్చిన అరబిందో ఫార్మా
108 సర్వీసుల నిర్వహణ కోసం ప్రభుత్వం ఏటా రూ.86 కోట్లు కేటాయిస్తోంది. 3 నెలలకోసారి ప్రభుత్వం చెల్లింపులు చేస్తోంది. ఇతర సాంకేతిక కారణాల వల్ల నిధులు విడుదల కొన్నిసార్లు అలస్యమవుతోంది. దీంతో సిబ్బంది జీతాలు చెల్లింపు, డీజిల్ కొరతతో వాహన సేవల్లో అంతరాయం ఏర్పడుతోందని వైద్య బృందాలు తమ నివేదికలో పేర్కోన్నాయి. ఈ పరిస్ధితుల్లో 108 అంబులెన్స్ నిర్వహణ బాధ్యతను తమకు అప్పగిస్తే కార్పోరేట్ సామాజిక బాధ్యత కింద రూ.30 కోట్లు కేటాయిస్తామని అరబిందో ఫార్మా ముందుకు వచ్చింది. దీనివల్ల నిధుల కొరత ఉండదని, అంతరాయం ఏర్పడదని, ప్రభత్వంపైనా భారం తగ్గుతుందని భావిస్తున్నారు. ఈసారి టెండర్లకు వెళ్లాలని ప్రభుత్వం భావించినా ఆ ఆలోచనను విరమించుకొని నామినేషన్ పద్ధతిలోనే అప్పగించాలని ఆలోచిస్తోంది. దీనిపై ప్రభుత్వానికి కూడా ప్రతిపాదనలు ఇచ్చినట్లు తెలిసింది. ఈ విషయంపై ప్రభుత్వం తుదినిర్ణయం తీసుకోవాల్సి ఉంది.