ఆర్టీసీ సమ్మె : కార్మికులను విధుల్లోకి తీసుకుంటారా
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె 52వ రోజుకు చేరింది. విధుల్లో చేరేందుకు సిద్ధమని కార్మికులు ప్రకటించినా.. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆర్టీసీ జేఏసీ పోరాటం

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె 52వ రోజుకు చేరింది. విధుల్లో చేరేందుకు సిద్ధమని కార్మికులు ప్రకటించినా.. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆర్టీసీ జేఏసీ పోరాటం
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె 52వ రోజుకు చేరింది. విధుల్లో చేరేందుకు సిద్ధమని కార్మికులు ప్రకటించినా.. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆర్టీసీ జేఏసీ పోరాటం కొనసాగిస్తోంది. సోమవారం(నవంబర్ 25,2019) సేవ్ ఆర్టీసీ పేరిట బస్టాండ్లు, డిపోల ఎదుట నిరసనలకు పిలునిచ్చింది. నేడు మరోసారి సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనుంది. అటు.. ప్రభుత్వం కూడా ఆర్టీసీపై సమీక్ష నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకోబోతోంది.
ఆర్టీసీపై సోమవారం సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఆర్టీసీపై మరోసారి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్న ఆయన… సంస్థ మనుగడ, రూట్ల ప్రైవేటీకరణ, సమ్మెలో ఉన్న కార్మికుల భవితవ్యంపై ఈ భేటీలో నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది. రూట్ల ప్రైవేటీకరణపై హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత అన్ని అంశాలను చర్చించి ఆర్టీసీపై తుది నిర్ణయం తీసుకోవాలని గత సమీక్షలో సీఎం నిర్ణయించారు. 5వేల 100 రూట్ల ప్రైవేటీకరణపై కేబినెట్ నిర్ణయానికి అనుకూలంగా హైకోర్టు వెలువరించిన తీర్పు కాపీ…. ఇవాళ ప్రభుత్వానికి అందనుంది. దీంతో ఇవాళ్టి సమావేశంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణ యాలు తీసుకునే అవకాశం ఉంది.
ఆర్టీసీని నడపడానికి ప్రతి నెలా 640 కోట్ల రూపాయలు కావాలంటున్న ప్రభుత్వం… ఆ మొత్తాన్ని భరించే శక్తి సంస్థకు, తమకు లేదని చెబుతోంది. దానిని కారణంగా చూపుతూ ఆర్టీసీ భవితవ్యంపై ప్రభుత్వం కఠిన నిర్ణయాలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. రూట్ల ప్రైవేటీకరణకు ఇప్పటికే రవాణాశాఖ ముసాయిదా విధివిధానాలను రూపొందించగా… ఇవాళ్టి సమావేశంలో ఈ అంశంపైనే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు… కార్మికులను బేషరతుగా విధుల్లోకి తీసుకుంటే సమ్మె విరమిస్తామని ఆర్టీసీ కార్మిక జేఏసీ చేసిన ప్రకటనపై ఇప్పటివరకు ప్రభుత్వం స్పందించలేదు. ఈ అంశంపై ప్రభుత్వ వైఖరి కోసం సమ్మెలో కొనసాగుతున్న కార్మికులు ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్నారు. ఇవాళ్టి సమావేశం తర్వాత దీనిపైనా ప్రభుత్వం నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.
మరోవైపు…భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు ఆదివారం(నవంబర్ 24,2019)సమావేశమైన ఆర్టీసీ జేఏసీ నేతలు.. సమ్మెను యథావిధిగా కొనసాగించాలని నిర్ణయించారు. సమ్మెలో పాల్గొంటున్న ఆర్టీసీ కార్మికులకు ధన్యవాదాలు తెలిపిన అశ్వత్థామరెడ్డి… అన్ని డిపోలు, బస్టాండ్లు, ప్రధాన కూడళ్ల దగ్గర సేవ్ ఆర్టీసీ పేరుతో నిరసనలకు పిలుపునిచ్చారు. మరి.. కార్మికుల విజ్ఞప్తిని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందా? రూట్ల ప్రైవేటీకరణపై ఎలా ముందుకెళ్తుందనేది ఆసక్తికరంగా మారింది.