ఆర్టీసీ సమ్మె ఆరో రోజు : మరోసారి అఖిలపక్ష నేతలతో జేఏసీ మీటింగ్

ఆర్టీసీ కార్మికుల సమ్మె ఆరో రోజుకు చేరింది. 2019, అక్టోబర్ 10వ తేదీ గురువారం మరోసారి అఖిలపక్ష నేతలతో.. జేఏసీ సమావేశం కానుంది. బహిరంగ సభ, తెలంగాణ బంద్ చేపట్టే తేదీలను నేడు ప్రకటించనున్నారు. సమ్మెను ఉద్ధృతం చేయడంలో భాగంగా.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల దగ్గర ధర్నాలు చేయాలని ఆర్టీసీ కార్మికులకు జేఏసీ పిలుపునిచ్చింది. అన్ని మండలాల్లో తహశీల్దార్లకు వినతిపత్రాలు అందజేయాలని తెలిపింది. విపక్ష పార్టీల మద్దతుతో.. సమ్మెను ఉద్ధృతం చేయాలని ఆర్టీసీ కార్మికులు డిసైడ్ అయ్యారు.
సమ్మెకు దిగిన కార్మికుల తొలగింపు, ఆర్టీసీ జేఏసీ భవిష్యత్ కార్యాచరణపై.. అఖిలపక్ష సమావేశంలో చర్చించారు. ఆర్టీసీ ఉద్యోగులను తొలగిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని 2019, అక్టోబర్ 09వ తేదీ బుధవారం జరిగిన అఖిలపక్ష సమావేశానికి హాజరైన సీపీఐ డిమాండ్ చేసింది. లేకపోతే హుజూర్‌నగర్ ఉపఎన్నికలో టీఆర్‌ఎస్‌కు మద్దతుపై పునరాలోచన చేయాల్సి ఉంటుందని చాడ వెంకట్ రెడ్డి హెచ్చరించారు. మరోవైపు ఆర్టీసీ సమ్మెను సకల జనుల సమ్మెగా మార్చాల్సిన అవరసం ఉందన్నారు టీజేఎస్ అధినేత కోదండరాం. ఆర్టీసీ సమ్మెకు తెలంగాణ ఎన్జీవోల మద్దతు కూడగట్టాలని అఖిలపక్ష సమావేశంలో నిర్ణయించారు.
సమ్మెను ఉద్ధృతం చేసేందుకు.. ఆర్టీసీ జేఏసీ, అఖిలపక్షం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్న దానిపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది. మరోవైపు.. సమ్మెకు సంబంధించి ఆర్టీసీ యాజమాన్యం, ప్రభుత్వం.. గురువారం హైకోర్టులో కౌంటర్ దాఖలు చేయనున్నాయి. వాటిపైనా.. గురువారం విచారణ జరిగే అవకాశముంది. కార్మికుల సమ్మె, ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై.. కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందోనన్న దానిపైనా ఆసక్తి నెలకొంది.
Read More : ఆగిన చక్రాలు : ఐదో రోజు..ప్రయాణీకుల ఇక్కట్లు