ఒకే నంబరు.. రెండు కార్లు.. : పోలీస్ స్టేషన్‌కు డాక్టర్

కారు నంబర్ పోలిన కారు నెంబర్ ఉంటుందా? అవకాశమే లేదు కదా? కానీ ఉంది. అవును హైదరాబాద్‌లో ఉండే ఓ డాక్టర్‌కు సన్‌సెట్ ఆరెంజ్ కలర్ హోండా జాజ్ కారు ఉంది. ఆ కారు నంబరు టీఎస్ 09 ఈఎల్ 5679. అయితే ఇదే నంబర్‌తో చాక్‌లెట్ కలర్‌లో ఓల్వో కారు ఉంది. ఆ చాక్‌లెట్ కలర్ ఓల్వో కారు ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తే ఛలానాలు డాక్టర్ కారుకి పడుతుంది.
వివరాల్లోకి వెళ్తే.. తన కారు నంబర్‌ను గుర్తు తెలియని వ్యక్తి వాడుతున్నారంటూ సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవాలంటూ సోమవారం(17 ఫిబ్రవరి 2020) బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు కె.వనజా రఘునందన్ అనే డాక్టర్. బంజారాహిల్స్ రోడ్ నంబర్– 12లోని ఫార్చున్ ఎన్‌క్లేవ్‌లో నివసించే వనజా రఘునందన్ సన్‌సెట్ ఆరెంజ్ కలర్ హోండా జాజ్ టీఎస్ 09 ఈఎల్ 5679 కారు వాడుతున్నారు. అయితే గత నెల 20వ తేదీన వనజా రఘునందన్‌కు మహబూబ్‌నగర్ జిల్లాలో పోతులమడుగు వద్ద ఓవర్‌స్పీడ్‌గా వెళ్లినట్లు ఛలానా పడింది.
అయితే ఆ సమయంలో తాను అటువైపు వెళ్లలేదని, చలానాలో ఉన్న కారు కూడా తనది కాదంటూ ఆరా తీయగా.. తన కారు నంబర్‌తోనే చాక్లెట్ కలర్ ఓల్వో కారు తిరుగుతోందని మహబూబ్‌నగర్ జిల్లా పోతులమడుగు వద్ద ఓవర్‌స్పీడ్‌లో నిబంధనలు ఉల్లంఘించిన కారు అదేనని కావాలనే ఎవరో తన కారు నంబర్‌ను వాడుతూ తనకు ఇబ్బందులు తెచ్చిపెడుతున్నట్లు చెబుతూ సదరు డాక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తన నంబర్‌తో ఓల్వో కారు నడుపుతున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని భవిష్యత్‌లో తనకు దీని వల్ల ప్రమాదం కూడా తలెత్తే అవకాశం ఉందంటూ బాధితురాలు ఆందోళన వ్యక్తం చేశారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి ఓల్వో కారు కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Read More>> ఆయనకు నలుగురు: చెప్పేవి పాఠాలు.. చేసేవి తప్పుడు పనులు