దేశవ్యాప్తంగా నిరవధిక సమ్మెకు దిగిన HAL ఉద్యోగులు

దాదాపు 20వేల మంది HAL(హిందుస్తాన్ ఎరోనాటిక్స్ లిమిటెడ్)ఉద్యోగులు ఇవాళ(అక్టోబర్-14,2019)నుంచి నిరవధిక నిరాహార దీక్షకు దిగారు. వేతనాల సవరణ,ఇతర డిమాండ్లతో హాల్ ఉద్యోగులు ఈ సమ్మెకు దిగినట్లు యూనియన్ అధికారి తెలిపారు.
55 ఏళ్ల హెచ్ఏఎల్… బెంగళూరు, హైదరాబాద్, ఒడిశాలోని కోరాపుట్, లక్నో, మహారాష్ట్రలోని నాసిక్ లోని మొత్తం 5 ప్రొడక్షన్ కాంప్లెక్స్ లు,దేశవ్యాప్తంగా 4 రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్(R&D)సెంటర్స్ లో కలిపి మొత్తం 20 వేల మంది ఉద్యోగులు ఉన్నారు.
సమ్మెపై HAL యొక్క 9ట్రేడ్ యూనియన్స్ జనరల్ సెక్రటరీ ఎస్ చంద్రశేఖర్ మాట్లాడుతూ…మా డిమాండ్లపై, ముఖ్యంగా వేతన సవరణపై మేనేజ్ మెంట్ తో చర్చలు, సయోధ్య ప్రయత్నాలు విఫలమైనందున కార్మిక చట్టాలకు అనుగుణంగా మేము సెప్టెంబర్-30,2019న ఇచ్చిన నోటీసు ప్రకారం సోమవారం నుండి నిరవధిక సమ్మెతో ముందుకు వెళ్తున్నాము. సమ్మెలో పాల్గొనమని మా కార్మికులు మరియు సభ్యులందరికీ మేము విజ్ఞప్తి చేసాము అని ఆయన తెలిపారు. దేశవ్యాప్తంగా 9 లొకేషన్స్ లో సమ్మెకు దిగుతున్నట్లు చంద్రశేఖర్ తెలిపారు. అన్ని లొకేషన్స్ లో సయోధ్య చర్యలు ప్రారంభమయ్యాయని, సమ్మె నుండి ఉద్యోగులు వైదొలగాలని, యాజమాన్యంతో సంప్రదించి పరిష్కారానికి అంగీకరించాలని లేబర్ అధికారులు యూనియన్లకు సూచించారు.