తెలంగాణకు ఏపీ రాజధానుల సెగ : ఆదిలాబాద్‌లో అసెంబ్లీ డిమాండ్!

  • Published By: sreehari ,Published On : December 20, 2019 / 11:00 AM IST
తెలంగాణకు ఏపీ రాజధానుల సెగ : ఆదిలాబాద్‌లో అసెంబ్లీ డిమాండ్!

Updated On : December 20, 2019 / 11:00 AM IST

ఆదిలాబాద్ వేదికగా అసెంబ్లీ నిర్వహించాలనే డిమాండ్ కొందరి నేతల నుంచి వినిపిస్తోంది. దీనిపై వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలనే చర్చకు కూడా తెర లేపారని అనుకుంంటున్నారు. చూస్తుంటే..ఏపీలో మూడు రాజధానుల సెగ తెలంగాణ‌ను తాకేలా ఉందంటున్నారు.

అక్కడ మూడు రాజ‌ధానుల కోసం ప్రభుత్వం అడుగులు వేస్తుంటే.. ఇక్కడ మాత్రం కేవ‌లం హైద‌రాబాద్ కేంద్రంగానే పాల‌న, శాస‌నాలు చేయ‌డం ఏంట‌న్న ప్రశ్నలు త‌లెత్తుతున్నాయి. పాల‌న‌ను ఆదివాసీ గిరిజ‌నులకు చేరువ చేసేందుకు అదిలాబాద్‌లో స‌మావేశాలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని బీజేపీ నేతలు అంటున్నారట.

అభివృద్ధి చెందిన న‌గ‌రాల్లోనే కాకుండా ఆదివాసీ ప్రాంతాల్లో కూడా స‌మావేశాలు నిర్వహించాల‌ని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి చ‌ర్యల ద్వారా ప్రజ‌ల‌కు పాల‌న‌పై అవ‌గాహ‌న రావ‌డ‌మే కాకుండా.. శాస‌నస‌భ నిర్వహ‌ణ తీరు కూడా ప్రత్యక్షంగా తెలుసుకునే అవ‌కాశం ఉందంటున్నారు స్థానిక‌ బీజేపీ నేత‌లు.

మహారాష్ట్రలా రెండు ప్రాంతాల్లోనూ :
స‌రిగ్గా ఇదే అంశాన్ని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు తెర‌పైకి తేవ‌డంతో మ‌రోసారి హాట్ టాపిక్ అయ్యారు. గ‌తంలో ఆదీవాసీ, లంబాడీల పోరులో ఆదివాసీల‌కు నేతృత్వం వ‌హించిన బాపూరావ్.. ఇప్పుడు ఆదిలాబాద్‌లో అసెంబ్లీ స‌మావేశాలు నిర్వహించాల‌న్న అంశాన్ని తెర‌పైకి తెచ్చారు. తెలంగాణ‌లో కేవ‌లం హైద‌రాబాద్ కేంద్రంగా అభివృద్ధి సాగుతోంద‌ని, మిగ‌తా జిల్లాలు అభివృద్ధికి నోచుకోవ‌డం లేద‌న్న అభిప్రాయాన్ని ఆయ‌న‌ వ్యక్తం చేస్తున్నారు.

మ‌హారాష్ట్ర త‌ర‌హాలో రెండు ప్రాంతాల్లో అసెంబ్లీ స‌మావేశాలు నిర్వహిస్తే త‌ప్పేంటి అని అంటున్నారు. ఈ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకువెళ్తాన‌ని, అవ‌స‌ర‌మైతే సాధ్యాసాధ్యాలు ప‌రిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వ స‌హ‌కారం తీసుకుంటాన‌ని చెబుతున్నారు. దీంతో ఏపీలో రగిలిన యవ్వారం ఇప్పుడు తెలంగాణకు కూడా పాకిందంటున్నారు జనాలు.

ఒంటరిగానే సోయం పోరాడతారా?:
ఆదీవాసీల అంశంపై సోయం బాపూరావ్‌ ఢిల్లీ వెళ్లి ఉద్యమం చేశారు. ఈ అంశంపై మాట్లాడేందుకు పార్టీ కార్యాల‌యంలో మీడియా స‌మావేశానికి కూడా అప్పట్లో అనుమ‌తి ఇవ్వ లేదు రాష్ట్ర బీజేపీ నేత‌లు. కానీ ఆయ‌న ఎక్కడా వెన‌క్కు త‌గ్గకుండా జాతీయ నాయ‌క‌త్వ అనుమ‌తితో ఢిల్లీలో ఆదివాసీ ఉద్యమానికి నాయ‌క‌త్వం వ‌హించారు. దేశ వ్యాప్తంగా ఉన్న ఆదీవాసీల‌ను ఏకం చేశారు.

ఇలాంటి ప‌రిస్థితుల్లో ఆదిలాబాద్‌లో అసెంబ్లీ స‌మావేశాల నిర్వహించాల‌న్న సోయం డిమాండ్‌కు రాష్ట్ర నాయ‌క‌త్వం ఏ మేర‌కు స‌హ‌క‌రిస్తుందా అన్నది చ‌ర్చనీయాంశం అయ్యింది. రాష్ట్ర నాయ‌క‌త్వం అంగీకారం రాక‌పోతే ఒంటరిగానే ఈ అంశంపై బాపూరావు ఢిల్లీ స్థాయిలో పోరాటం చేస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది.