మీకు ఓకేనా.. కాదా! : మందు లేకుండా దావత్

మందు లేకుండా దావత్(పార్టీ) ఊహించగలమా? అందులోనూ తెలంగాణలో.. తెలంగాణలో దావత్ అనగానే మందు, ముక్క ఉండాల్సిందే. ఇప్పుడు ఉన్న ట్రెండ్ ఇదే. ఈ ట్రెండ్ మార్చేందుకు ఓ గ్రూపు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఫేస్‌బుక్ వేదికగా ‘జిందగీ ఇమేజెస్’ గ్రూప్ దావత్ వితౌట్ దారు (మందు లేకుండా విందు) అనే వినూత్న ప్రచారం ప్రారంభించింది.
ఈ క్యాంపెయిన్‌ను ఉదృతంగా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకుని వెళ్లిన జిందగీ గ్రూప్.. ఆల్కహాల్ సమాజంపై ఎలాంటి చెడు ప్రభావం చూపుతుంది అనే విషయమై చర్చలు పెడుతుంది. ఊర్లలో ఉండేవారే కాకుండా.. చదువుకుని సిటీల్లో ఉండే వాళ్లు కూడా ఆల్కహాల్ వాడుతుండడంపై ఆవేదన వ్యక్తం చేసిన చేగొండి చంద్రశేఖర్.. ఈ క్యాంపెయిన్‌ను స్టార్ట్ చేసినట్లు చెప్పారు.
ఆల్కహాల్‌ను తీసుకోవడం యువతకు ఎంటర్‌టైన్‌మెంట్‌గా మారిపోయిందని, యువత ఈ చెడు పద్దతికి అలవాటు పడిపోతుందని, ఆల్కహాల్ అటవాటు లేని వారిని ప్రశంసించాలని గ్రూప్ చెబుతుంది. ఆల్కహాల్ ఎంత ప్రమాదమో అందరూ తెలుసుకోవాలని, మనం విపరీతంగా అభిమానించే సినిమా హీరోలు, క్రీడా రంగంలో ఉన్న సెలబ్రిటీలు ఆల్కహాల్‌ని ప్రోత్సహించడం.. అందుకు ప్రచారాలు చేయడం కూడా కరెక్ట్ కాదని చెబుతున్నారు.
ఈ క్రమంలో ‘దావత్ వితౌట్ దారూ’ క్యాంపెయిన్‌లో అన్ని రంగాల వారిని భాగస్వాములు చేయాలని భావించింది. మానసిక వైద్యులు , రైతుల సమస్యలపై పని చేసే కార్యకర్తలు, సృజనాత్మక రంగంలో ఉండేవారిని, వైద్యులను, యువకులు ఇందులో భాగస్వాములు కావాలని పిలుపునిస్తుంది జిందగీ ఇమేజెస్ గ్రూప్.