ఢిల్లీలో 4 లక్షలు దాటిన కరోనా కేసులు

Corona cases in Delhi : శీతాకాలం దగ్గర పడుతున్న తరుణంలో ఢిల్లీలో కరోనా వైరస్ కేసుల కలవరం మళ్లీ మొదలైంది. కరోనా కేసులు నాలుగు లక్షలు దాటాయి. గడిచిన 24 గంటల్లో రికార్డుస్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఢిల్లీలో కొత్తగా 6,725 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 48 మంది మృతి చెందారు.
మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,03,096 కు చేరింది. ఇప్పటివరకు కరోనాతో 6,652 మంది మృతి చెందారు. ఢిల్లీలో 36,375 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి కోలుకుని 3,60,069 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
గతంలో అక్టోబర్ 30న అత్యధికంగా 5,891 కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఢిల్లీలో ప్రస్తుతం 3,452 కంటైన్ మెంట్ జోన్లు ఉన్నాయి. 21 వేల మంది కరోనా బాధితులు హోం ఐసోలేషన్ లో ఉన్నారు.
ఆరోగ్య మంత్రి సత్యేంద్రజైన్ మాట్లాడుతూ శీతాకాలంలో ఒక్క రోజులో 14 వేల కేసులు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వం భావిస్తోందని తెలిపారు. ఈ విషయాన్ని నిపుణుల కమిటీ చెప్పినట్లు వెల్లడించారు. అందుకనుగుణంగా ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని డాక్టర్ పాల్ కమిటీ సూచించినట్లు జైన్ తెలిపారు.