టీవీ షో మాదిరిగా చేయాలని బ్రిడ్జ్ పై నుంచి నదిలోకి దూకేసిన యువకులు

Vidyasagar Setu: వెస్ట్ బెంగాల్‌లోని కోల్‌కతాలో విద్యాసాగర్ సేతు బ్రిడ్జ్ పై నుంచి ఇద్దరు యువకులు హుగ్లీ నదిలోకి దూకేశారు. కతరావోన్ కీ కిలాడీ అనే పాపులర్ టీవీ షో మాదిరిగా పాపులర్ టీవీ రియాలిటీ షోను అనుకరించాలనే ప్రయత్నంలో ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. వారిలో ఒకరు మాత్రమే ప్రాణాలతో బయటపడగా.. మరొకరి ఆచూకీ ఇంకా తెలియరాలేదు.
ఘటనకు సంబంధించిన వీడియోలో ఐదుగురు కుర్రాళ్లు కేబుల్ తో నిర్మించిన బ్రిడ్జ్ పై నుంచి వేలాడుతూ కనిపించారు. నిజానికి ఆ బ్రిడ్జ్ పై పాదచారులను నిషేదించారు అధికారులు. ఆ వీడియోలో ఒక వ్యక్తి వెల్కమ్ టూ కతరావోన్ కీ కిలాడీ అంటుండగా.. రాజా గో ఫాస్ట్.. లేదంటే మామలు వచ్చేస్తారని ఇంకొకరు అంటున్నాడు. ఆ మాటలు జరుగుతుండగానే ఓ కుర్రాడు నదిలోకి దూకేశాడు.
వీడియో రికార్డు చేస్తున్న అతని ఫ్రెండ్ వారిని ఛీర్ చేసేలా అరిచాడు. సెకన్ల వ్యవధిలోనే వెనుక నుంచి మరొక వ్యక్తి దూకేశాడు. ముందు వ్యక్తి నిటారుగా దూకి కాసేపటికి పైకి తేలాడు కానీ, అతణ్ని అనుసరించిన యువకుడు మాత్రం పైకి రాలేదు. .
కోల్ కతాలోని రివర్ పోలీసులు ఘటన గురించి తెలిసి.. ఇద్దరిపై రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టారు. తిజాలా ప్రాంతానికి చెందిన వారిద్దరిలో ఒకరిని మాత్రమే గుర్తించారు. 24గంటల పాటు వెదికినా సమాచారం దొరకలేదు. అతని సమాచారం కోసం కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు.