మెడిసిన్‌లో ఇద్దరికి నోబెల్‌ బహుమతి.. ఏం కనుగొన్నారంటే?

విక్టర్ అంబ్రోస్, గ్యారీ రువ్‌కున్‌లకు నోబెల్ బహుమతి అందించనున్నట్లు వివరించారు.

మెడిసిన్‌లో ఇద్దరికి నోబెల్‌ బహుమతి.. ఏం కనుగొన్నారంటే?

Updated On : October 7, 2024 / 3:38 PM IST

మెడిసిన్‌లో నోబెల్ బహుమతి-2024ను అమెరికా శాస్త్రవేత్తలు విక్టర్ అంబ్రోస్, గ్యారీ రువ్‌కున్‌లకు ప్రదానం చేయనున్నట్లు నోబెల్ కమిటీ ప్రకటించింది. మైక్రో ఆర్ఎన్ఎ, పోస్ట్ ట్రాన్స్‌క్రిప్షనల్ జీన్ రెగ్యులేషన్‌లో దాని పాత్రను కనుగొన్నందుకు విక్టర్ అంబ్రోస్, గ్యారీ రువ్‌కున్‌లకు నోబెల్ బహుమతి అందించనున్నట్లు వివరించింది.

జన్యు కార్యకలాపాలు ఎలా నియంత్రించబడతాయో ప్రాథమిక సూత్రాన్ని వారు కనుగొన్నట్లు తెలిపింది. స్వీడన్‌లోని కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్ మెడికల్ యూనివర్సిటీ నోబెల్ అసెంబ్లీ మెడిసిన్ విజేతలను ఎంపిక చేసింది. ఈ నోబెల్ బహుమతి గ్రహీతలు 1.1 మిలియన్ డాలర్లు బహుమతిగా అందుకుంటారు.

ప్రతి ఏడాదిలాగే మెడిసిన్ బహుమతి గ్రహీతల పేర్లను మొదట ప్రకటించారు. ఇకపై వరుసగా ఐదు విభాగాల్లో బహుమతులను ప్రకటిస్తారు. స్వీడిష్ డైనమైట్ ఆవిష్కర్త ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరిట ఈ బహుమతులను 1901 నుంచి ప్రదానం చేస్తున్నారు. మొదట సైన్స్, సాహిత్యం, శాంతి బహుమతిని అందించేవారు. ఆ తర్వాత ఆర్థికశాస్త్రానికి కూడా అందిస్తున్నారు.

గత ఏడాది కరోనా మహమ్మారిని అరికట్టడంలో సహాయపడే వ్యాక్సిన్‌లకు మార్గం సుగమం చేసిన శాస్త్రవేత్తలు కటాలిన్ కారికో (హంగేరియన్ శాస్త్రవేత్త), డ్రూ వీస్‌మాన్‌ (అమెరికా శాస్త్రవేత్త)కు మెడిసిన్‌లో నోబెల్‌ బహుమతి అందించారు.

ఒక్క ఉద్యోగానికి కూడా నోటిఫికేషన్ ఇవ్వకుండా 35,000 ఉద్యోగాలు భర్తీ చేశామని రేవంత్ చెబుతున్నారు: బాల్క సుమన్