ఈ దంపతులకు 20 ఏళ్లుగా పిల్లలు పుట్టలేదు.. వైద్యులు చూపలేని పరిష్కారాన్ని చూపిన ఏఐ.. ఇక IVF అవసరం లేదా?

ఆమె భర్తకు అజూస్పెర్మియా ఉన్నా, ఏఐ STAR సిస్టమ్‌తో స్కాన్ చేసి గంటలో 8 మిలియన్ చిత్రాలు తీశారు. ఏఐ ఆల్గారిథమ్స్‌ ద్వారా మూడు పనికివచ్చే స్పెర్మ్‌లను గుర్తించారు. సంప్రదాయ పద్ధతిలో ఆ స్పెర్ప్‌ను తీస్తే నష్టం జరుగుతుందని, రోబో సాయంతో స్పెర్మ్‌ను సురక్షితంగా తీశారు.

ఈ దంపతులకు 20 ఏళ్లుగా పిల్లలు పుట్టలేదు.. వైద్యులు చూపలేని పరిష్కారాన్ని చూపిన ఏఐ.. ఇక IVF అవసరం లేదా?

Updated On : July 6, 2025 / 8:15 PM IST

కృత్రిమ మేధ అనేక రంగాల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతోంది. వైద్య రంగంలోనూ దీన్ని బాగా వాడుతున్నారు. పిల్లలులేని ఓ దంపతులకు 20 ఏళ్లుగా వైద్యులు చూపలేని పరిష్కారాన్ని తాజాగా ఏఐ చూపింది.

ఓ వ్యక్తి అజూస్పెర్మియా (వీర్యకణాల లేమి)తో బాధపడుతున్నాడు. దీంతో అతడు జీవితాకాలం మొత్తం వంధ్యత్వంతో బాధపడాల్సిందేనని వైద్యులు భావించారు. పెళ్లై 20 ఏళ్లు అవుతున్నా అతడి భార్య గర్భం దాల్చలేదు. వారు ఎన్ని ఆసుపత్రుల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది.

చివరికి న్యూయార్క్‌లోని కొలంబియా యూనివర్సిటీ ఫెర్టిలిటీ సెంటర్ అభివృద్ధి చేసిన ఏఐ బేస్డ్‌ టెక్నాలజీతో ఆ దంపతుల సమస్యకు పరిష్కారం దొరికింది. దీంతో ఇప్పుడు ఆ దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారు.

Also Read: శ్రీశైలం డ్యామ్‌కు ఎలాంటి ముప్పు లేదు.. కొన్ని గేట్లు మాత్రం రస్టు పట్టి ఉన్నాయి: డ్యామ్‌ల ఎక్స్‌పర్ట్ కన్నయ్య 

పరిష్కారం ఏంటి? ఎలా సాధ్యమైంది?
కొలంబియా వర్సిటీ ఫెర్టిలిటీ సెంటర్ అభివృద్ధి చేసిన ఏఐ బేస్డ్‌ టెక్నాలజీ “STAR సిస్టమ్‌” (Sperm Tracking and Recovery) ద్వారా ఆ పురుషుడిలో ఆరోగ్యవంతమైన, పనికివచ్చే స్మెర్ప్‌ను వైద్యులు గుర్తించారు.

దీనిపై ఫెర్టిలిటీ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ జెవ్ విలియమ్స్ మాట్లాడుతూ.. “అతడి వీర్యం నమూనాలను సాధారణంగా చూస్తే అందులో ఎటువంటి తేడా కనిపించలేదు. కానీ, మైక్రోస్కోప్‌లో చూసినప్పుడు సెల్యులర్ డిబ్రీస్‌ (మృతకణాలు, వ్యర్థ పదార్థాలు) మాత్రమే కనపడ్డాయి, స్పెర్మ్‌ కనపడలేదు” అని అన్నారు.

అజూస్పెర్మియా అనే సమస్య దాదాపు 15 శాతం మందిలో కనిపిస్తుందని కొలంబియా పరిశోధనలు చెబుతున్నాయి. “ఇప్పటి వరకు ఇందుకు సంబంధించిన చికిత్సలు చాలా కష్టతరంగా ఉండేవి. డోనర్ స్పెర్మ్ ఉపయోగించడం లేదా శస్త్రచికిత్స ద్వారా వృషణాల్లోని కొంత భాగాన్ని తీసి అక్కడ స్పెర్మ్‌ కోసం వెతకడం వంటివి చేసేవాళ్లం” అని విలియమ్స్ తెలిపారు.

ఖగోళ శాస్త్రజ్ఞులు దూర గ్రహాలు, నక్షత్రాలను గుర్తించేందుకు వాడే సాంకేతికతను ఆధారంగా చేసుకుని ఇప్పుడు తాము STAR సిస్టమ్‌ను అభివృద్ధి చేశామని చెప్పారు. ఏఐ సాయంతో స్కాన్‌ చేసి స్పెర్మ్‌ను గుర్తించే విధంగా ఈ సాంకేతికతను అభివృద్ధి చేసినట్లు తెలిపారు.

విలియమ్స్‌ వెల్లడించిన వివరాల ప్రకారం.. 2025 మార్చిలో ఆ పురుషుడి భార్య రోజీ (38) ఈ STAR పద్ధతి ద్వారా గర్భందాల్చిన తొలి వ్యక్తిగా గుర్తింపు పొందింది.

ఆమె భర్తకు అజూస్పెర్మియా ఉన్నా, STAR సిస్టమ్‌లో స్కాన్ చేసి గంటలో 8 మిలియన్ చిత్రాలు తీశారు. ఏఐ ఆల్గారిథమ్స్‌ ద్వారా మూడు పనికివచ్చే స్పెర్మ్‌ ను గుర్తించారు. సంప్రదాయ పద్ధతిలో ఆ స్పెర్ప్‌ను తీస్తే నష్టం జరుగుతుందని, రోబో సాయంతో స్పెర్మ్‌ను సురక్షితంగా తీశారు.

ఈ స్పెర్మ్‌ సేకరణ తర్వాత రెండు గంటల్లో రోజీ అండాలను ఫెర్టిలైజ్‌ చేశారు. అంబ్రియో ట్రాన్స్‌ఫర్‌ విజయవంతంగా జరిగింది. ప్రస్తుతం రోజీ ఐదు నెలల గర్భిణి. ఆ శిశువు ఈ ఏడాది డిసెంబరులో జన్మించనుంది.

ప్రస్తుతం ఈ STAR సిస్టమ్‌ కేవలం కొలంబియా యూనివర్సిటీ ఫెర్టిలిటీ సెంటర్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. విలియమ్స్‌ తెలిపిన వివరాల ప్రకారం, స్పెర్మ్‌ను గుర్తించడం, విడదీయడం, ఫ్రీజ్‌ చేయడం కోసం ఖర్చు దాదాపు 3 వేల డాలర్లు అయింది. అమెరికాలో సాధారణ IVF చికిత్స ఖర్చు 12,400 నుంచి 15,000 డాలర్ల వరకు ఉంటుంది. మందులు, జన్యుపరీక్షలతో కలిపి మొత్తం ఖర్చు 30,000 డాలర్ల దాకా చేరుతుంది.

STAR సిస్టమ్‌ పై మరిన్ని పరిశోధనలు అవసరమని అమెరికన్ సొసైటీ ఫర్‌ రీప్రొడక్టివ్‌ మెడిసిన్‌ అధ్యక్షుడు డాక్టర్‌ రాబర్ట్‌ బ్రానిగాన్‌ తెలిపారు. కొలంబియా వర్సిటీ పేర్కొన్న అధ్యయనం ప్రకారం.. 1973 నుంచి 2011 వరకు పాశ్చాత్య దేశాల్లో స్పెర్మ్‌ కౌంట్‌ 52.4% తగ్గింది. దానికి కారణాలు పర్యావరణ కాలుష్యం, అధిక బరువు, ఆహార అటవాట్లు, గతితప్పిన జీవనశైలి అని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.