Imran Khan: ఇమ్రాన్ ఖాన్‌కు కీలక డే.. అవిశ్వాసంలో నెగ్గేనా.. రోడ్లపైకొచ్చి నిరసన తెలపాలంటూ దేశ ప్రజలకు పిలుపు..

పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ‌కు ఆదివారం కీలక రోజు కానుంది. తన రాజకీయ జీవితంలో ఇదో అగ్ని పరీక్షే అని చెప్పొచ్చు. దేశంలో ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణం పెరగడానికి ఇమ్రాన్ ఖాన్ నేతృత్వం.

Imran Khan

Imran Khan: పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ‌కు ఆదివారం కీలక రోజు కానుంది. తన రాజకీయ జీవితంలో ఇదో అగ్ని పరీక్షే అని చెప్పొచ్చు. దేశంలో ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణం పెరగడానికి ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్థాన్ త్రెహిక్ -ఇ-ఇన్సాఫ్ పార్టీ (పీటీఐ) ప్రభుత్వమే కారణమని ఈనెల 28న ఉమ్మడి ప్రతిపక్షం జాతీయ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఈ క్రమంలో తన సంకీర్ణ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు విదేశీ శక్తులు కుట్ర పన్నాయంటూ ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. ఇటీవల జరిగిన మెగా ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. పాకిస్థాన్ లో ప్రభుత్వాన్ని మార్చేందుకు విదేశీ సొమ్ముతో ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. మన వాళ్లని వాడుకుంటున్నారని, మనపై ఒత్తిడి తెచ్చేందుకు ఏయే ప్రదేశాల నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయో మాకు తెలుసంటూ ఇమ్రాన్ వ్యాఖ్యానించారు. అయితే ఇమ్రాన్ వ్యాఖ్యలను ప్రతిపక్షాలు కొట్టిపారేశాయి.

Imran Khan : అవిశ్వాస పరీక్షకు ముందే పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ కు పదవీగండం

మరోవైపు ఆదివారం పాకిస్థాన్ పార్లమెంట్లో జరిగే అవిశ్వాస తీర్మానంలో ఇమ్రాన్ ఓటమి ఖాయమన్న వాదన వినిపిస్తుంది. దీనికి కారణం ఇమ్రాన్ తన ప్రభుత్వంలోని భాగస్వామ్య పక్షాల మద్దతు కోల్పోవటంతో పాటు , పీటీఐ నుండి తిరుగుబాటును కూడా ఇమ్రాన్ ఎదుర్కొంటున్నాడు. అధికార పార్టీకి చెందిన కనీసం 24 మంది శాసన సభ్యులు ఇటీవల విడిపోయి అవిశ్వాస తీర్మానంలో ఇమ్రాన్ ప్రభుత్వానికి వ్యతిరేఖంగా ఓటు వేస్తున్నట్లు ప్రకటించారు. ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ (పీటీఐ) 342 సభ్యుల జాతీయ అసెంబ్లీలో 155 మంది సభ్యులను కలిగి ఉంది. అధికారంలో కొనసాగడానికి దిగువ సభలో కనీసం 172 ఓట్లు అవసరం ఉంటుంది. అయితే పత్రిపక్షాలు మాత్రం తమకు 175 మంది ఎమ్మెల్యే మద్దతు ఉందని పేర్కొంటున్నారు. మరోవైపు ఇమ్రాన్ ఖాన్ కీలకమైన పాక్ ఆర్మీ అవిశ్వాసాన్ని కూడా కోల్పోయినట్లు కనిపిస్తుంది.

Pakistan: 75ఏళ్లలో 21మంది ప్రధానులు.. పూర్తికాలం ఒక్కరు కూడా

ఇమ్రాన్ ఖాన్ ఇప్పటికైన గౌరవ పదంగా అధికార బాధ్యతల నుంచి పక్కకు తప్పుకోవాలని ప్రతిపక్షాలు సూచిస్తుండగా, తాను రాజీనామా చేయనని, చివరి బంతి వరకు పోరాడతానని ఇమ్రాన్ ఇప్పటికే స్పష్టం చేశారు. మరోవైపు అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌కు ఒక రోజు ముందు పాక్ ప్రధాని ఇమ్రాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. అవిశ్వాసానికి ముందు వీధుల్లోకి రావాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. మీరు మౌనంగా కూర్చోవాల్సిన అవసరం లేదని, ఎందుకంటే మీరు నిశ్శబ్దంగా ఉంటే మీరు చెడు వైపు ఉంటారు, మీరు నా కోసం కాదు, మీ భవిష్యత్తు కోసం ఈ కుట్రకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ రోడ్లపైకొచ్చి మాట్లాడాలని ఇమ్రాన్ దేశ ప్రజలను కోరారు. అయితే నిరసనలు శాంతియుతంగా నిర్వహించాలని, ఈ నిరసనల్లో ఆర్మీకి వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దంటూ ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు.