Rashid Khan: ఆఫ్ఘన్ తాలిబన్ల వశం.. ఫ్యామిలీ కోసం క్రికెటర్ ఆందోళన!

అఫ్ఘనిస్తాన్ తాలిబన్ల హస్తగతమైంది. దీంతో ఆ దేశంలో పరిస్థితులు దారుణంగా మారాయి. తాలిబన్ల అరాచక పాలనలో తాము జీవించలేమని భావిస్తున్న ప్రజలను ప్రాణాలకు తె

Rashid Khan

Rashid Khan: అఫ్ఘనిస్తాన్ తాలిబన్ల హస్తగతమైంది. దీంతో ఆ దేశంలో పరిస్థితులు దారుణంగా మారాయి. తాలిబన్ల అరాచక పాలనలో తాము జీవించలేమని భావిస్తున్న ప్రజలను ప్రాణాలకు తెగించి దేశాన్ని వీడుతున్నారు. ఇతర దేశాలకు వెళ్లే విమానాల్లో వేలాడుతూ ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక ఇప్పుడు ఆ దేశానికి ఇతర దేశాలలో విమాన సంబంధాలు కూడా తెగిపోయాయి. ఆఫ్ఘన్ దేశానికి చెందిన పలువురు సెలబ్రిటీలు తమ దేశాన్ని కాపాడాలని ప్రపంచ దేశాలకు విజ్ఞప్తులు చేస్తున్నాయి. తమ దేశంలో తాలిబన్ల అరాచక పాలనపై ఆ దేశ స్టార్‌ క్రికెటర్‌ రషీద్‌ ఖాన్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు.

ప్రస్తుతం రషీద్‌ ఖాన్‌ ఇంగ్లండ్‌ వేదికగా హండ్రెడ్‌ టోర్నీలో ట్రెంట్‌ రాకెట్స్‌ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. రషీద్‌ ఇంగ్లాండ్లో ఉండిపోగా.. తన కుటుంబసభ్యులు ఆఫ్ఘన్ లో ఉండిపోయారు. దీంతో వారికేమైనా జరుగుతుందేమోనని రషీద్ ఖాన్ కలవరపడుతున్నాడు. ఇదే విషయమై రషీద్‌ ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ కెవిన్‌ పీటర్సన్‌తో చర్చించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కుటుంబానికి అందుబాటులో లేకుండా పోయిన రషీద్‌.. తన కుటుంబాన్ని కాపాడాలంటూ ఆవేదన చెందాడంటూ పీటర్సన్‌ తెలిపాడు.

రషీద్ కు తమ కుటుంబమంటే చాలా ఇష్టమని.. వారికేమైనా జరుగుతుందనే ఆందోళనతో రషీద్ తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాడని పీటర్సన్ తెలిపాడు. తన కుటుంబాన్ని ఆఫ్ఘన్ నుండి తరలించేందుకు రషీద్ ప్రయత్నించినా.. విమానాల రాకపోకలు నిలిచిపోవడంతో ఆ ప్రయత్నం ఫలించలేదని.. దీంతో ఏ క్షణాన ఏ వార్త వినాల్సి వస్తుందోనని రషీద్ భయాందోళనలు వ్యక్తం చేసినట్లు పీటర్సన్ చెప్తున్నాడు. అయితే.. తాలిబన్లకు క్రికెట్ అన్నా.. వారి కుటుంబాలన్నా అమితంగా ఇష్టపడతారని.. దీంతో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్‌ సీఈవో హమీద్‌ షీన్వారీ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.