Talibans income : కళ్లు చెదిరే తాలిబాన్ల ఆదాయం..అంత ఆర్థిక బలం ఎలా వస్తోందంటే..

ఆఫ్గానిస్థాన్ తాలిబన్ల ఆదాయం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. రెండు దశాబ్దాలు అధికారంలో లేకపోయినా ఆర్థికంగా ఇంత బలాన్ని ఎలా సమకూర్చుకుందంటే..

Talibans income : కళ్లు చెదిరే తాలిబాన్ల ఆదాయం..అంత ఆర్థిక బలం ఎలా వస్తోందంటే..

Subhadra Kumari Afghanistan Talibans Income Sources Chauhan

Updated On : August 16, 2021 / 12:41 PM IST

Afghanistan Talibans income sources : తాలిబాన్లు. తాలిబ‌న్ అనే ప‌దం తాలిబ్ అనే అర‌బిక్ ప‌దం నుంచి వచ్చింది. తాలిబ్ అంటే విద్యార్థి అని అర్థం. పాకిస్తాన్ కి చెందిన మ‌త‌ప‌ర‌మైన స్కూలు విద్యార్థులు దీనిని స్థాపించారు కాబ‌ట్టి ఈ మిలిటెంట్ గ్రూప్‌కు తాలిబ‌న్లు అనే పేరు వ‌చ్చింది. నరరూప రాక్షసుల్లా వ్యవహరించే తాలిబన్ల ఆదాయం ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిదే. ఓ పక్క అధికారం కోసం పోరాడే వీరికి ఇంత భారీ ఆదాయం ఎలా వస్తుంది? ఏఏ మార్గాల ద్వారా వారికి ఆదాయం వస్తుందో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. ఆఫ్ఘనిస్థాన్ మళ్లీ తాలిబాన్ల వశమైన ఈ సమయంలో మరోసారి తాలిబన్ల ఆదాయ మార్గాల ఎలా రెండు దశాబ్దాల పాటు అధికారాన్ని కోల్పోయినా వారికి ఇంతటి భారీ ఆస్తులు ఎలా వచ్చాయి? అనే విషయం మరోసారి తెరపైకి వచ్చింది. ఆఫ్ఘనిస్థాన్ తాలిబాన్ సంస్థ ప్రపంచంలోని టాప్-10 ఉగ్రవాద సంస్థల్లో ఒకటి. అత్యంత సంపన్నమైన ఉగ్రసంస్థల్లో ఐదో స్థానంలో ఉందనే విషయం షాకింగ్ గా అనిపిస్తుంది. మరికి వారికి ఇంత ఆదాయం ఏఏ మార్గాల్లో వస్తుందో తెలుసుకుందాం..

అమెరికా బలగాలు ఆఫ్ఘాన్ ను వదిలి వెళ్లిన రోజుల వ్యవధిలోనే యావత్ దేశాన్ని తాలిబాన్ ముష్కరులు కైవసం చేసుకున్నారు. రాజీనామా చేసిన ఆప్ఘాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ… ఆయన భార్య, ఆర్మీ చీఫ్, దేశ భద్రతా సలహాదారులతో కలిసి దేశాన్ని వదిలి వెళ్లిపోయారు. రాజీనామా తరువాత ఆయన తజకిస్థాన్ కు వెళ్లినట్టు సమాచారం. కానీ దీనిపై స్పష్టతలేదు. కాగా ఆయన కాబూల్ (ఆఫ్గాన్ రాజధాని) వదిలి వెళ్లిపోతూ ఆఫ్ఘాన్ పౌరులను ఉద్దేశించి ‘రక్తపాతాన్ని నివారించటానికే నేను కాబూల్ ను వదిలి వెళుతున్నానని ఫేస్ బుక్ లో ఓ పోస్ట్ పెట్టారు.

ఇదిలా ఉంటే ఆఫ్ఘాన్ ను మళ్లీ చేజిక్కించుకోవడానికి తాలిబాన్లకు రెండు దశాబ్దాల కాలం పట్టింది. అగ్రరాజ్యం అమెరికా శిక్షణలో ఆరితేరిన ఆఫ్ఘాన్ సేనలను ఓడించటానికి తాలిబాన్లు రెండు దశాబ్దాలు పోరాడారు. ఎట్టకేలకు దేశాన్ని చేజిక్కించుకున్నారు. దేశంలో అధికారంలో లేకపోయినా రెండు దశాబ్దాల పాటు పోరాడే శక్తి, ఆర్థిక బలం వారికి ఎలా వచ్చిందనే అనుమానం వస్తుంది. అధికారం లేకపోయాన ఆర్థిక బలాన్ని మాత్రం కోల్పోలేదు తాలిబన్లు. ఆర్థికంగా బలంగా ఉంటే అధికారాన్ని ఎలాగైనా ఎప్పటికైనా చేజిక్కించుకోవచ్చని నమ్మినవారు ఆర్థిక బలాన్ని పెంచుకుంటూ వచ్చారు. అలా వేల కోట్ల ఆస్తుల్ని కూడబెట్టారు.

ఆఫ్ఘనిస్థాన్ తాలిబాన్ సంస్థ ప్రపంచంలోని టాప్-10 ఉగ్రవాద సంస్థల్లో ఒకటి. అత్యంత సంపన్నమైన ఉగ్రసంస్థల్లో ఐదో స్థానంలో ఉంది. 2016లో ఫోర్బ్స్ మేగజీన్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం అప్పట్లో రూ. 14,800 కోట్ల వార్షిక టర్నోవర్ తో ఐసిస్ మొదటి స్థానంలో నిలిచింది. రూ. 2,900 కోట్ల టర్నోవర్ తో తాలిబాన్ సంస్థ ఐదో స్థానంలో ఉంది. మాదకద్రవ్యాల అక్రమ సరఫరా, మైనింగ్ వ్యాపారాల ద్వారానే వీరికి అధిక ఆదాయం భారీగా వచ్చి చేరుతోంది. వారి చేసే పోరాటం అసాంఘీక పోరాటమే అలాగే వారి ఆదాయాలుకూడా అటువంటివే. తాలిబన్ల వార్షిక ఆదాయం రూ.2900 కోట్లు. వీరికొచ్చే ఆదాయంలో సింహభాగం డ్రగ్స్ అక్రమ రవాణా, మైనింగ్‌ వ్యాపారం వల్లే లభిస్తోంది. ఇక, గతేడాది నాటో విడుదల చేసిన నివేదికలోనూ పలు ఆశ్చర్యకరమైన వివరాలు వెల్లడయ్యాయి. 2019-20లో తాలిబన్ల వార్షిక బడ్జెట్‌ దాదాపు రూ.11,829 కోట్లు అని ‘నాటో’ తన నివేదికలో పేర్కొంది. 2016 నాటి ఫోర్బ్స్‌ నివేదికతో పోల్చితే తాలిబన్ల ఆదాయం పెరుగుదల 400 శాతంగా నమోదయ్యింది.

2017-18 సంవత్సరం మొత్తం ఆదాయంలో సగం విదేశాల నుంచి అందుకున్నట్లు నాటో విడుదల చేసిన నివేదిక పేర్కొంది. ఈ ఆదాయం 2020 నాటికి 15 శాతానికి తగ్గిపోయింది. ఇదే సమయంలో అఫ్గన్ సైన్యానికి నిధుల కేటాయింపుల్లో తిరోగమనం కనిపిస్తుంది. ఆ దేశ వార్షిక బడ్జెట్ రూ.40వేల కోట్లలో సైన్యానికి కేవలం రూ.800 కోట్లు మాత్రమే కేటాయించారు. తాలిబన్‌లతో పోరాడటానికి ఆఫ్గన్ సైనికులకు ట్రైనింగ్ ఇవ్వటానికి అమెరికా ఈ 19 ఏళ్లలో దాదాపు ట్రిలియన్ డాలర్లు ఖర్చు చేసింది.

కానీ ఆఫ్గాన్ మీద అమెరికాకు ఇంత అభిమానం ఎందుకు? వారి కోసం ఇంత ఖర్చుచేసి ఏం సాధించిందంటే? సమాధానం లేదనే చెప్పాలి. ఇప్పుడు ఆఫ్గాన్ ను అమెరికా వదిలేసి పోయింది. దీంతో తాలిబన్లు రెచ్చిపోయారు.దేశాన్ని హస్తగతం చేసుకున్నారు. వారి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో తాలిబన్ల ఆదాయం మరింత పెరుగుతుంది కచ్చితంగా. అధికారం లేప్పుడే భారీ ఆదాయాల్ని సమకూర్చుకున్న తాలిబన్లు ఇక అధికారంలోకి వస్తే ఆగుతారా?చెలరేగిపోరూ..అదే జరుగనుంది. పూర్తిగా ఆర్థిక కోణం నుంచి చూస్తే, తాలిబాన్ల పెట్టుబడిపై రాబడి రోజురోజుకు పెరుగుతోంది. అలా తాలిబన్ల ఆదాయం గురించి తెలిస్తే కళ్లు చెదిరిపోవాల్సిందే.

2019-20లో తాలిబాన్ల ఆదాయం, ఆదాయ వనరుల వివరాలు ఇలా..

మొత్తం ఆదాయం – 1.6 బిలియన్ డాలర్లు అంటే రూ. 11,829 కోట్లు
రియలెస్టేట్ ద్వారా – రూ. 593 కోట్లు.
విదేశీ విరాళాలు – 1,781 కోట్లు
మైనింగ్ ద్వారా – 3,400 కోట్లు
మాదకద్రవ్యాలు – రూ. 3,087 కోట్లు
పన్నులు (నిర్భంధ వసూళ్లు) – రూ. 1,187 కోట్లు
విదేశీ ఎగుమతులు – రూ. 1,781 కోట్లు