Al Qaeda : కశ్మీర్ కి స్వేచ్ఛ కల్పించండి..తాలిబన్ ని కోరిన అల్ ఖైదా
అప్ఘానిస్తాన్ లో మరోసారి తాలిబన్ అధికారం చేపట్టేందుకు సిద్ధమైన నేపథ్యంలో అల్ ఖైదా ఉగ్రసంస్థ మళ్లీ యాక్టివ్ అయింది.

Kashmir (4) (1)
Al Qaeda అప్ఘానిస్తాన్ లో మరోసారి తాలిబన్ అధికారం చేపట్టేందుకు సిద్ధమైన నేపథ్యంలో అల్ ఖైదా ఉగ్రసంస్థ మళ్లీ యాక్టివ్ అయింది. కొన్నాళ్లుగా తెరవెనుక ఉండి సైలెంట్ గా ఉగ్ర కార్యకలాపాలు కొనసాగిస్తున్న అల్ ఖైదా ఇప్పుడు అప్ఘాన్ లో తాలిబన్ అధికారంలోకి రావడంతో బయటికొచ్చి ఊపిరిపీల్చుకుంటుంది. ఒసామా బిన్ లాడెన్ కి అత్యంత సన్నిహితుడు మరియు ప్రస్తుతం అల్ ఖైదాలో అగ్రనేతగా ఉన్న అమిన్ ఉల్ హక్ రెండు రోజుల క్రితం అప్ఘానిస్తాన్ లోని తన సొంత ఊరుకి తిరిగి చేరుకున్న విషయం తెలిసిందే.
అయితే ముందుగా పెట్టుకున్న డెడ్ లైన్ ప్రకారం సోమవారం అర్థరాత్రి నాటికి అమెరికా సైన్యం అప్ఘానిస్తాన్ ని పూర్తిగా వదిలి వెళ్లిపోయిన నేపథ్యంలో ఓ వైపు తాలిబన్ నేతలు,మరోవైపు అల్ ఖైదా నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. అమెరికా బలగాలు ఉపసంహరణ తర్వాత తాలిబాన్లు పూర్తి స్వాతంత్ర్యాన్ని పొందినట్టు తాలిబాన్లు ప్రకటించుకున్నారు.
కాగా, 20 ఏళ్ల తర్వాత అప్ఘానిస్తాన్ ను వదిలి అమెరికా దళాలు తిరిగి వెళ్లిపోవడంపై తాజాగా అల్ ఖైదా స్పందించింది. ఇది తాలిబన్ల విజయంగా పేర్కొంటూ వారికి శుభాకాంక్షలు తెలిపింది. ఈ మేరకు రెండు పేజీల ప్రకటనను విడుదల చేసింది అల్ ఖైదా నాయకత్వం. తమ హృదయాలు ఆనందంతో ఉప్పొంగుతున్నాయని ప్రకటనలో అల్ ఖైదా తెలిపింది.
ఈ చారిత్రక సందర్భంలో ఇస్లామిక్ ఎమిరేట్ నాయకత్వానికి ముఖ్యంగా హైబతుల్లా అఖున్ జదాకు మా శుభాకాంక్షలు. ఇది సాధించడానికి మహిళలు, చిన్నారులు సహా మీరు చేసిన త్యాగాలు ఫలించాయి. ఇస్లామిక్ ఎమిరేట్ నాయకత్వంలోఅప్ఘానిస్తాన్ ఐకమత్యంగా ముందుకు వెళ్తుందని ఆశిస్తున్నాం. ఈ ప్రాంత ప్రజల మతం, జీవితాలను కాపాడేందుకు ఎన్నో సంవత్సరాలుగా తాలిబన్లు కృషి చేస్తున్నారు. వారి ఆదేశాలకు, షరియా ఆధారిత పాలసీలకు కట్టుబడి అఫ్ఘాన్ ప్రజలు నుడుచుకుంటారని ఆశిస్తున్నాం .అమెరికా నుంచి అఫ్గాన్ కు స్వేచ్ఛ ప్రసాదించిన అల్లాహ్ కు కృతజ్ఞతలు. ఇష్టారాజ్యంగా నడుచుకుందామనుకున్న అమెరికాకు ఇది ఘోర పరాభావం అని ఆ ప్రకటనలో అల్ ఖైదా పేర్కొంది.
అయితే అంతటితో ఆగకుండా.. కశ్మీర్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఇస్లాం శత్రువుల చేతుల్లో ఉన్న ప్రాంతాలకూ విముక్తి కల్పించాలని తాలిబన్లకు.. అల్ ఖైదా పిలుపునిచ్చింది. కశ్మీర్ తో పాటు పాలస్తీనా, లెవాంట్, సోమాలియా, యెమన్ కూడా విముక్తి కల్పించాలని తాలిబన్లకు అల్ ఖైదా ఆ ప్రకటనలో పిలుపునిచ్చింది. అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా బందీలుగా ఉన్న ముస్లింలకూ విముక్తి కల్పించాలని అల్లాహ్ ను ప్రార్ధిస్తున్నట్లు తెలిపింది.
కాగా, 1996-2001 మధ్య ఆప్ఘానిస్తాన్ లో తాలిబన్లు అధికారంలో ఉన్న సమయంలోనే అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై అల్ ఖైదా ఉగ్రదాడి చేసిన విషయం తెలిసిందే. సెప్టెంబర్-11,2001న అమెరికా విమానాలతోనే వారి దేశంలోని డబ్ల్యూటీసీ టవర్లపై అల్ ఖైదా దాడి చేసింది. అమెరికాతో పాటు ప్రపంచాన్నే గడగడలాడించిన ఈ ఘటన తర్వాత అగ్రరాజ్యం అల్ ఖైదాపై విరుచుకుపడటం మొదలుపెట్టింది. ఇదే క్రమంలో అల్ ఖైదా స్ధావరంగా ఉన్న అప్ఘనిస్తాన్ పైనా దాడులకు దిగింది. పర్యవసానంగా తాలిబన్లు అధికారం కోల్పోవడంతో అక్కడ పాశ్చాత్యదేశాల కన్నుసన్నల్లో ఉండే ప్రజా ప్రభుత్వం ఏర్పాటైంది.
ఆ తర్వాత భారత్ వంటి దేశాలు కూడా అప్ఘానిస్తాన్ లో భారీగా పెట్టుబడులు పెట్టడంతో పాటు మౌలిక సదుపాయాలు అభినృద్ధి చేశాయి. తిరిగి ఇన్నాళ్లకు మళ్లీ తాలిబన్లకు అధికారం దక్కింది. అయితే ఆప్ఘానిస్తాన్ లో దాదాపు రెండు దశాబ్దాల తర్వాత తిరిగి అధికారం చేపట్టబోతున్న తాలిబన్లను రెచ్చగొట్టేందుకే అల్ ఖైదా ఇలాంటి ప్రకటనలు చేస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం మారిన పరిస్దితుల్లో తాలిబన్లు అంతర్జాతీయంగా మద్దతు కూడగట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అదే జరిగితే తాలిబన్ ప్రభుత్వానికీ, ఆయా దేశాలకూ మధ్య సంబంధాలు కూడా మెరుగుపడతాయి. అది అల్ ఖైదాకు ఇష్టం లేదు. అలా జరిగితే అల్ ఖైదా ప్రాబల్యం భారీగా తగ్గిపోతుంది. దీంతో అనుకూల పరిస్ధితుల్ని సద్వినియోగం చేసుకునేందుకు అప్ఘన్ గడ్డపై నుంచి ఉగ్ర కార్యకలాపాలను పెంచేందుకు అల్ ఖైదా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
READIndia-Taliban Meeting : భారత్-తాలిబన్ మధ్య తొలి దౌత్య సమావేశం..కీలక అంశాలపై చర్చ
READAfghanistan : మళ్లీ అప్ఘానిస్తాన్ చేరుకున్న బిన్ లాడెన్ సన్నిహితుడు