తప్పుడు లెక్కలే భారత్‌లో కరోనా వినాశనానికి కారణం- అమెరికా

తప్పుడు లెక్కలే భారత్‌లో కరోనా వినాశనానికి కారణం- అమెరికా

Americas Top Expert Dr Fauci Said India Relaxed The Corona Restrictions Ahead Of Time

Updated On : May 12, 2021 / 12:17 PM IST

భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ దారుణంగా ఉంది. ఫస్ట్ వేవ్‌లో మరణాల కంటే ఎక్కువగా ఇప్పుడు కరోనా మరణాలు ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితికి కారణం తప్పుడు లెక్కలే అని విమర్శించారు అమెరికా అధ్యక్షుడి ముఖ్య వైద్య సలహాదారుడు, అంటు వ్యాధుల నిపుణుడు డాక్టర్‌ ఆంటోని ఫౌసీ. భారతదేశంలో కరోనా ప్రస్తుత సంక్షోభాన్ని అధిగమించడానికి ప్రజలందరికీ టీకాలు వేయడం మాత్రమే మార్గం అని అభిప్రాయపడ్డారు ఫౌసీ. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ప్రతి ఒక్కరికీ దేశంలో వ్యాక్సిన్ వెయ్యాలని సూచించాడు.

భారతదేశంలో కరోనావైరస్ వినాశనం గురించి అమెరికా ఉన్నత ఆరోగ్య నిపుణుడు డాక్టర్ ఆంథోనీ ఫౌసీ ప్రకటనలో.. COVID-19 లెక్కల కారణంగా.. కరోనా ముగిసిందనే తప్పుడు అభిప్రాయంతో ప్రజలు ప్రవర్తించడం.. నాయకులు సరైన దిశానిర్ధేశం చెయ్యకపోవడం.. అన్ని కార్యకలాపాలకు అనుమతి ఇవ్వడంతోనే చెత్త పరిస్థితులు ఎదురైనట్లు చెప్పుకొచ్చారు ఫౌసీ.

కరోనా ముగియకుండానే ఆంక్షలను సడలించి, ప్రజలకు కరోనా వైరస్ మీద భయం లేకుండా చేశారని, ఈ కారణంగానే కరోనా సెకండ్ వేవ్‌ని భారత్ ఎదుర్కొంటుందని వెల్లడించారు. సంక్రమణ కేసులలో స్వల్ప తగ్గుదల కనిపించినా.. ప్రమాదం ఇంకా ఉందని, ఇప్పట్లో భారత్‌ని కరోనా విడిచిపెట్టదని అన్నారు.

COVID-19 విచారణ సందర్భంగా, డాక్టర్ ఫౌసీ (ఆంథోనీ ఫౌసీ) పార్లమెంటు ఆరోగ్యం, విద్య, కార్మిక మరియు పెన్షన్ల కమిటీ ముందు మాట్లాడుతూ, భారతదేశం ప్రస్తుత తీవ్రమైన పరిస్థితికి కారణం ఫస్ట్ వేవ్ ఉండగానే ఆంక్షలు సడలించి తప్పు చేయడం అని అభిప్రాయపడ్డారు. భారతదేశం ఆంక్షలను సడలించిన వెంటనే.. కేసులు పెరిగి, విధ్వంసం మొదలైందని చెప్పుకొచ్చారు.

భారతదేశంలో కరోనావైరస్ సెకండ్ వేవ్ వారం, పదిరోజుల్లో బలహీనంగా ఉన్నట్లు అనిపిస్తుందని, అయినప్పటికీ, ఈ వేవ్ పూర్తి కావడానికి సమయం పడుతుందని నిపుణులు అంటున్నారు. భారతదేశంలో కోవిడ్ -19 కేసులు తగ్గుతున్నట్లు అనిపించినప్పటికీ, సెకండ్ వేవ్ పూర్తి కావడానికి కొన్ని నెలలు పడుతుందని, జూలై వరకు ఉంటుందని అంటు వ్యాధుల నిపుణుడు మరియు వైరాలజిస్ట్ షాహిద్ జమీల్ అన్నారు.

రాబోయే రోజుల్లో ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో అంటువ్యాధులను ఎదుర్కోవలసి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ప్రపంచ దేశాలన్ని ఏకమై బాధ్యత తీసుకుని అంటువ్యాధులపై పోరాటం చెయ్యాలని సూచించారు.