Andrew Symonds: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్ మృతి
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్ మృతి చెందాడు. క్విన్స్ లాండ్‌లోని టౌన్స్‌విల్లేలో ఆయన నివాసం ఉంటున్న ప్రాంతంలో శనివారం రాత్రి కారు ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో సైమండ్స్ అక్కడికక్కడే ...

Symonds
Andrew Symonds: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్ మృతి చెందాడు. క్విన్స్ లాండ్‌లోని టౌన్స్‌విల్లేలో ఆయన నివాసం ఉంటున్న ప్రాంతంలో శనివారం రాత్రి కారు ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో సైమండ్స్ అక్కడికక్కడే మృతిచెందినట్లు అక్కడి పోలీసులు తెలిపారు. ఆండ్రూ సైమండ్స్ వయస్సు 46ఏళ్లు. సైమండ్స్ మృతితో క్రీడాలోకం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. సైమండ్స్ మృతిపట్ల ప్రముఖులు, మాజీ ఆటగాళ్లు, క్రీడాభిమానులు సంతాపం తెలుపుతున్నారు.
1998లో పాకిస్థాన్ పై వన్డేల్లో సైమండ్స్ అరంగ్రేటం చేశాడు. మొత్తం 198 వన్డేల్లో 5,088 పరుగులు చేశాడు. ఇందులో 30 హాఫ్ సెంచరీలు, ఆరు సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్ లో 133 వికెట్లు తీశాడు. వన్డే కెరీర్‌లో అత్యుత్తమ ప్రతిభను కనబర్చి పలు సందర్భాల్లో ఆస్ట్రేలియా జట్టును విజయతీరాలకు చేర్చాడు. 18 పరుగులిచ్చి ఐదు వికెట్లు తీసి బౌలింగ్ లో సైమండ్స్ అత్యుత్తమ ప్రతిభను కనబర్చారు.
2004 సంవత్సరంలో శ్రీలంకపై టెస్ట్ కెరీర్ ప్రారంభించిన సైమండ్స్ 26 మ్యాచ్‌లలో 1,463 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, 10 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 14 టీ20 మ్యాచ్ లు ఆడిన సైమండ్స్ 337 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్‌లో హైదరాబాద్, ముంబయి ఇండియన్స్ జంట్ల తరుపున సైమండ్స్ ఆడాడు.

Andrew Symonds 1
హర్భజన్ వర్సెస్ సైమండ్స్ మధ్య జరిగిన వివాదం క్రికెట్ చరిత్రలో మరిచిపోలేనిది. మంకీ గేట్ వివాదం సమయంలో ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ ఘటన సైమండ్స్‌తో పాటు హర్భజన్ కెరీర్‌పై ప్రభావం చూపింది. 2008లో సిడ్నీ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్‌లో సైమండ్స్‌ను హర్భజన్ సింగ్ కోతితో పోల్చడం అప్పట్లో తీవ్ర దుమారాన్ని రేపింది. జాత్యహంకార వ్యాఖ్యలు చేశాడని హర్భజన్ సింగ్ పై క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) మూడు మ్యాచ్‌ల నిషేధం విధించింది.
అయితే ఈ నిషేధాన్ని ఎత్తివేయకపోతే.. మొత్తం సిరీస్‌నే బహిష్కరిస్తామని టీమిండియా ఆటగాళ్లు హెచ్చరించడంతో సీఏ దిగివచ్చింది. అయితే క్రికెట్ కెరియర్ లో ఈ ఘటన తనను ఎంతో బాధించిందని సైమండ్స్ పలు సందర్భాల్లో వెల్లడించాడు. ఆ వివాదమే తన కెరీర్ ను నాశనం చేసిందని పలుసార్లు తన ఆవేదనను వెలిబుచ్చాడు. ఈ ఘటన తరువాత నేను ఆల్కహాల్ తీసుకోవడం కూడా ప్రారంభించానని అన్నాడు.
Tragic news surrounding the former Australia all-rounder and our thoughts are with his friends and family.https://t.co/6eXiz8Mb5O
— ICC (@ICC) May 14, 2022