1,306 Legged Millipede : కళ్లు లేని..1,306 కాళ్లున్న అరుదైన జీవిని గుర్తించిన పరిశోధకులు

కళ్లు లేని..1,306 కాళ్లున్న అత్యంత అరుదైన జీవిని పరిశోధకులు గుర్తించారు. భూమిలో లోతుల్లో ఏకంగా 60 మీటర్ల దిగువలో ఈ వింత జీవి కనిపించింది.

1,306 Legged Millipede : కళ్లు లేని..1,306 కాళ్లున్న అరుదైన జీవిని గుర్తించిన పరిశోధకులు

1,306 Legged Millipede

Updated On : December 17, 2021 / 6:29 PM IST

Researchers identifies more thousand more legged millipede  కాళ్ల జెర్రి, గాజు పురుగు, రాకలిబండ వంటి జీవులకు జతల కొద్దీ కాళ్లు ఉంటాయనే విషయం తెలిసిందే. వాటికి మహా అయితే 100 లేదా 200 కాళ్లు ఉంటాయేమో. కానీ ప్రపంచంలోనే అత్యంత భారీ సంఖ్యలో కాళ్లున్న అత్యంత అరుదైన జీవిని పరిశోధకలు కనుగొన్నారు. ఆ జీవికి ఏకంగా 1,306 కాళ్లున్నాయని గుర్తించారు. మిలపీడ్స్ గా పిలిచే కొన్ని జీవుల్లో అంతకంటే కొంచెం ఎక్కువ సంఖ్యలోనే కాళ్లు ఉంటాయి. కానీ పశ్చిమ ఆస్ట్రేలియాలోని బంగారు గనుల్లో పరిశోధకులు కొత్తగా కనుగొన్న ఓ జీవికి వెయ్యికి పైగా కాళ్లు ఉండటం గమనించాల్సిన విషయం.

కేవలం 95 మిల్లీమీటర్లున్న ఈ వింత జీవికి 1,306 కాళ్లు ఉండడం చూసిన పరిశోధకులు ఆశ్చర్యపోయారు. భూమిపై ఇప్పటివరకు గుర్తించిన ఇన్ని కాళ్లు ఉన్న జీవి ఇదేనంటున్నారు పరిశోధకులు. ఓ గనిలో తవ్వకాలు జరుపుతుండగా కార్మికులు దాన్ని చూశారు. వారికి అదేదో వింతగా కనిపించింది. దీంతో ఈ జీవి గురించి అధికారులకు తెలియజేయగా అదికాస్తా పరిశోధకుల దృష్టికి వెళ్లింది.

భూమ్మీద కాకుండా భూమిలో లోతుల్లో ఏకంగా 60 మీటర్ల దిగువలో కనిపించింది. గ్రీకు పాతాళ దేవ పెర్సెఫోన్ పేరు కలిసేలా ‘యుమిల్లిప్స్ పెర్సెఫోన్’అని దీనికి పేరుపెట్టారు పరిశోధకులు. ఈ వింత జీవి విషయంలో మరో విచిత్రమైన విషయం ఏమిటంటే.. దీనికి కళ్లు లేవట. కేవలం వాసన, స్పర్శ ద్వారా పరిసరాలను గుర్తించి జీవిస్తుందట. శిలీంధ్రాలను ఆహారంగా తీసుకుంటుందని ఆస్ట్రేలియా పరిశోధకులు వివరించారు.