సరిహద్దు భద్రతే కీలకం : భారత్ తో కలిసి పని చేస్తాం

భారత్ తో కలిసి పని చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. భారత్, అమెరికాలకు సరిహద్దు భద్రతే కీలకమని తెలిపారు. సరిహద్దు భద్రత విషయంలో నిరంతరం భారత్ కు సహకరిస్తామని చెప్పారు. హౌడీ మోడీ కార్యక్రమంలో ట్రంప్ ప్రసంగించారు. ఇరు దేశాల్లో ప్రజల రక్షణకే అధిక ప్రాధాన్యమిస్తామని చెప్పారు. సురక్షితంగా ఉండేందుకు కఠిన చర్యలు తప్పవన్నారు. ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేసేందుకు భారత్ తో కలిసి పని చేస్తామన్నారు. అక్రమ వలసదారుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. చట్టబద్ధమైన వలసదారులకు ఎల్లప్పుడూ స్వాగతం అన్నారు. చట్టబద్ధంగా ఉద్యోగాలు సంపాదించే పన్నులు కట్టేవారిని గౌరవిస్తామని చెప్పారు.
భారత్, అమెరికా స్వప్నాల సాకారానికి కృషి చేస్తామని చెప్పారు. రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలు ఇరు దేశాలను నూతన పథంలోకి నడిపిస్తున్నాయని అన్నారు. ఇరుదేశాల ప్రజాస్వామ్యం ప్రపంచానికి మార్గదర్శకాలు అని చెప్పారు. అమెరికా-భారత్ మధ్య సంబంధాలు మరింత బలోపేతమయ్యాయని చెప్పారు. అమెరికా-భారత్ ల మైత్రికి ఈ కార్యక్రమమే నిదర్శనం అన్నారు. ఈ సభకు 50 వేల మంది రావడం స్ఫూర్తిదాయకం అన్నారు.
మోడీ తనకు నమ్మకమైన మిత్రుడు అన్నారు. కొన్ని నెలల క్రితమే మోడీ గెలుపొందారని తెలిపారు. భారత ప్రధాని మోడీ చాలా బాగా పని చేస్తున్నారని చెప్పారు. మోడీ నాయకత్వంలో భారత్ అభివృద్ధిలో దూసుకుపోతోందన్నారు. మోడీ ప్రభుత్వం 30 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తెచ్చిందన్నారు. భారత్ కు, ప్రపంచానికి మోడీ గొప్ప సేవ చేస్తున్నారని ప్రశంసించారు. చరిత్రాత్మక సమావేశానికి రావడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ఈ రోజు హృదయం ఉప్పొంగే రోజు అన్నారు.
భారత విలువలు, సంస్కృతితో అమెరికా విలువలు కలిసిపోతాయన్నారు. 40 కోట్ల మంది మధ్య తరగతి ప్రజలే భారత్ ఆస్తి అన్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ తర్వాత మరిన్ని ఉద్యోగాలు కల్పించామని చెప్పారు. ఉద్యోగాల కల్పనలో కొద్ది రోజుల్లో చరిత్ర సృష్టించబోతున్నామని తెలిపారు. భారత సంతతి అమెరికన్లు అమెరికా అభివృద్ధికి కృషి చేస్తున్నారని చెప్పారు. గతంలో ఎప్పుడూ లేనంత విధంగా అమెరికాలో భారత్ పెట్టుబడులు పెడుతోందన్నారు.
ముడిచమురు ఉత్పత్తులు అమెరికా నుంచి భారత్ కు వెళ్తాయన్నారు. అమెరికా అత్యున్నత వస్తువులు భారత్ కు అందుబాటులో ఉంటాయన్నారు. అనేక రకాల రక్షణ ఉత్పత్తుల వాణిజ్యం ఇరుదేశాల మధ్య జరుగుతోందన్నారు. సరిహద్దుల రక్షణకు ఇరు దేశాలు పరస్పరం సహకరించుకుంటున్నాయన్నారు. సరిహద్దు భద్రత అనేది భారత్, అమెరికాకు ప్రధాని అంశం అన్నారు. అమెరికాలోని ప్రతి కుటుంబ సురక్షితంగా జీవించాలని కోరుకుంటున్నాని తెలిపారు. అందరినీ సంపన్నులను చేయడమే తమ లక్ష్యమన్నారు.