Russia-China Tie : అమెరికాకు చెక్‌ చెప్తూ బలపడుతున్న రష్యా, చైనా బంధం

Russia-China Tie : గతంలో ఎన్నడూ లేనంత బలహీనంగా మారిందని రష్యా, చైనా భావిస్తున్నాయా..? పుతిన్ చైనా పర్యటనపై ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న చర్చ గమనిస్తే.. ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానమే వస్తుంది.

Russia-China Tie : అమెరికాకు చెక్‌ చెప్తూ బలపడుతున్న రష్యా, చైనా బంధం

New Chapter Begins With Russia-China Ties

Russia-China Tie : అమెరికా ప్రపంచ పెద్దన్న హోదాకు రష్యా, చైనా చెక్‌పెట్టనున్నాయా..? ఉమ్మడి శత్రువును కలిసికట్టుగా దెబ్బతీసేందుకు రష్యా, చైనా సరికొత్త వ్యూహాలు రచిస్తున్నాయా…? ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత పుతిన్ తొలి విదేశీ పర్యటన చైనాలో చేయడం వ్యూహాత్మకమేనా..? రష్యా, చైనా కలిసి ప్రపంచ క్రమాన్ని మార్చేందుకు వడివడిగా అడుగులేస్తున్నాయా..? ప్రచ్ఛన్నయుద్ధం అనంతరం అగ్రరాజ్యంగా అవతరించిన అమెరికా.. గతంలో ఎన్నడూ లేనంత బలహీనంగా మారిందని రష్యా, చైనా భావిస్తున్నాయా..? పుతిన్ చైనా పర్యటనపై ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న చర్చ గమనిస్తే.. ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానమే వస్తుంది.

రష్యా, చైనా అనుంగు మిత్రదేశాలు.. రెండు దేశాల దౌత్య సంబంధాల 75వ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నాయంటే….ఆధునిక ప్రపంచంలో ఈ కమ్యూనిస్టు దేశాలు ఏ స్థాయి స్నేహబంధం కొనసాగిస్తున్నాయో అర్ధం చేసుకోవచ్చు. ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా.. శతాబ్దకాలంలో మూడో వంతు రెండు దేశాల మధ్య మితృత్వం సాగిందని ఇరుదేశాధినేతలు సంతోషంగా చెప్పుకుంటున్నారు. రష్యా అధ్యక్షునిగా పుతిన్ ఐదోసారి ఎన్నికైన తర్వాత తొలి విదేశీ పర్యటనగా చైనాకు వచ్చారు. ఇప్పుడే కాదు…2022 ఫిబ్రవరిలో యుక్రెయిన్‌పై యుద్ధం ప్రారంభించడానికి ముందు కూడా పుతిన్ వెళ్లింది చైనా పర్యటనకే. యుద్ధం పరిస్థితుల్లో యూరప్ దేశాల ఆంక్షలతో రష్యాను ఏకాకిగా మార్చడానికి అమెరికా చేసిన ప్రయత్నాలను అడ్డుకుంది చైనానే.

చమురు కొంటున్న దేశం కూడా చైనానే :
రష్యా నుంచి అతి ఎక్కువ చమురు కొంటున్న దేశం కూడా చైనానే. ఇలా రష్యా, చైనా మధ్య మైత్రీబంధం గురించి ఎంతయినా చెప్పుకోవచ్చు. దేశీయ అవసరాలు, అంతర్జాతీయ పరిణామాలు, సొంత ప్రజల ఆకాంక్షలు, చారిత్రక నేపథ్యాలకు తగ్గట్గుగా ప్రపంచంలోని ఏ రెండు దేశాల మధ్య అయినా స్నేహం ఉంటుంది. అయితే రష్యా, చైనా మధ్య స్నేహానికి వీటన్నింటితో పాటు…ఇంకా చెప్పాల్సివస్తే..వీటన్నింటికన్నా ప్రధానమైన కారణం…అమెరికా వ్యతిరేకత. రెండు దేశాలు ఈ విషయాన్ని పరోక్షంగా అయినా సరే..బహిరంగంగానే ఈ విషయాన్ని అంగీకరిస్తున్నాయి. పుతిన్ తాజా చైనా పర్యటనలోనూ ఇదే జరిగింది. అమెరికాకు చెక్ పెట్టేలా తమ స్నేహాన్ని కొత్త శకంలోకి నడిపిస్తామని అటు పుతిన్, ఇటు జిన్ పింగ్ వ్యాఖ్యానించారు.

సోవియట్ యూనియన్ పతనానికి ముందు ఆ దేశానికి, అమెరికాకి మధ్య ప్రచ్ఛన్నయుద్ధం నడిచింది. సోవియట్ యూనియన్ కూలిపోయిన తర్వాత అమెరికా అగ్రరాజ్య హోదా పొందింది. ప్రపంచ పెద్దన్నగా మారి అనేక దేశాల అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చింది. పలు దేశాల్లో ప్రజాస్వామ్య ప్రభుత్వాలను కూలదోసి….కీలబొమ్మ ప్రభుత్వాలను ఏర్పరిచింది. తమ మాట వినని నేతలను అధికారం నుంచి తప్పించడమే కాదు….వారిని హత్యలు సైతం చేయించిందని అమెరికాపై ఆరోపణలున్నాయి. మొత్తంగా 1991 నుంచి నిన్నమొన్నటిదాకా అమెరికా ఆడింది ఆట.. పాడింది పాటగా సాగింది.

ఇదే సమయంలో రష్యా మాత్రం రేసులో వెనకపడిపోయింది. ఓ సాధారణ దేశంగా మిగిలిపోయింది. అయితే ఈ 35 ఏళ్ల కాలంలో వచ్చిన మార్పు.. ప్రచ్ఛన్నయుద్ధం సమయంలో రష్యా ఉన్న స్థానంలోకి చైనా వచ్చి చేరడం. మానవవనరులు సమృద్ధిగా ఉండడం, అభివృద్ధే లక్ష్యంగా పాలన సాగడంతో ఈ 35 ఏళ్ల కాలంలో చైనాలో ఊహించని మార్పులొచ్చాయి. క్రీడలు మొదలుకుని, టెక్నాలజీ దాకా అన్ని రంగాల్లో అమెరికాను ఢీ అంటే ఢీ అనే స్థాయికి ఎదిగింది. అప్పట్లో రష్యా, అమెరికా మధ్య జరిగినంత కాకపోయినా.. కొన్నాళ్లగా చైనా, అమెరికా మధ్య ప్రపంచ పెద్దన్న హోదా కోసం చిన్నస్థాయిలో ప్రచ్ఛన్నయుద్ధం జరుగుతోంది.

ప్రపంచ పెద్దన్నగా డ్రాగన్ కంట్రీ ప్రయత్నాలు :
తృతీయ ప్రపంచ దేశాలపై పట్టు పెంచుకోవడం, ప్రాజెక్టులు, పోర్టులు, రోడ్డు నిర్మాణాలు, బెల్ట్ అండ్ రోడ్ ఇనేషియేటివ్ పేరుతో అప్పులిచ్చి ఆయా దేశాలను చెప్పుచేతుల్లోకి తెచ్చుకునే ప్రయత్నం చేయడం ద్వారా ప్రపంచ పెద్దన్నగా మారేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తోంది డ్రాగన్ కంట్రీ. తన ఆధీనంలో నడిచే ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థల నుంచి భారీగా అప్పులు ఇప్పించడం, తాను స్వయంగా అప్పులివ్వడం ద్వారా ఆయా దేశాలపై పెత్తనం చెలాయించే పాత సంస్కృతినే కొనసాగిస్తూ ప్రపంచ పెద్దన్న హోదాను నిలబెట్టుకునేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది. అయితే గతంలోలా అమెరికా శక్తిమంతంగా లేదని, అంతర్జాతీయ వ్యవహారాల్లో అమెరికా ఆటలు సాగడం లేదన్నది ఓ అభిప్రాయం.

అమెరికా చెప్పిందల్లా చేయడానికి ఇప్పుడు ఏ దేశమూ సిద్ధంగా లేదు. అనేక విషయాల్లో అమెరికా వైఫల్యం కొట్టొచ్చినట్టు కనపడుతోంది. 20 ఏళ్ల తర్వాత 2021లో అప్ఘానిస్థాన్‌ నుంచి అమెరికా తన బలగాలను ఉపసంహరించుకోవడమే దీనికి ఉదాహరణ అన్న వాదనలు వినిపించాయి. అప్ఘాన్‌లో తాలిబన్ల రాజ్యం తిరిగి రావడానికి రష్యా, చైనా సహకారం ఉందన్న ఆరోపణలూ వినిపించాయి. ఇది జరిగిన కొన్ని నెలలకే రష్యా యుక్రెయిన్ ఆక్రమణకు దిగింది. చెప్పి మరీ యుక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించింది. ఈ యుద్ధంలో రష్యాను ఓడించేందుకు, ఆ దేశాన్ని అంతర్జాతీయంగా దోషిగా నిరూపించేందుకు అమెరికా చేయని ప్రయత్నం లేదు.

యుక్రెయిన్‌కు భారీగా ఆయుధాలందించింది. నిబంధనలు సవరించి మరీ ఆర్థిక సాయం చేసింది. యూరప్ దేశాలతో కలిసి రష్యాను ఆంక్షల పేరుతో ఉక్కిరి బిక్కిరి చేసింది. అయినా సరే…అమెరికా కోరుకున్నట్టు యుద్ధం తొందరగానూ ముగియలేదు. యుక్రెయిన్ విజయమూ సాధించలేదు. మరోవైపు రష్యా తన చమురును చైనాకు అమ్ముకుంటూ….యథేచ్ఛగా యుద్ధాన్ని కొనసాగిస్తోంది. యుద్దంలో రష్యా విజయం సాధించకపోయినప్పటికీ మిగిలిన ప్రపంచమంతా ఏకమయినా రష్యా ఏకాకి కాకపోవడానికి కారణం చైనా అండదండలే. ఇలా రష్యా, చైనా రెండూ ఉమ్మడి శత్రువుకు చెక్‌పెట్టేందుకు, ప్రపంచ క్రమాన్ని మార్చేందుకు కలిసికట్టుగా పనిచేస్తున్నాయి. దేశాధినేతలుగానే కాకుండా పుతిన్, జిన్‌పింగ్ మధ్య వ్యక్తిగత స్నేహం కూడా ఉంది. ఇరువురు నేతలు మొత్తంగా తమ పదవీకాలాల్లో 40 సార్లు సమావేశమయ్యారు.

Read Also : North Election Campaign : అందరి చూపు అటువైపే.. అన్నీ ఉత్తర భారత్‌లోని స్థానాలకే ఎన్నికలు!