Colin Powell : కరోనాతో తొలి నల్లజాతి అమెరికా విదేశాంగ మంత్రి మృతి

తొలి నల్లజాతి అమెరికా విదేశాంగ శాఖ మాజీ మంత్రి కోలిన్ పావెల్(84) కన్నుమూశారు. కోవిడ్ -19 సంబంధిత సమస్యలతో పావెల్ మరణించినట్లు ఆయన కుటుంబం సోమవారం ప్రకటించింది.

Colin Powell  : కరోనాతో  తొలి నల్లజాతి అమెరికా విదేశాంగ మంత్రి మృతి

Colin

Updated On : October 18, 2021 / 9:08 PM IST

Colin Powell  తొలి నల్లజాతి అమెరికా విదేశాంగ శాఖ మాజీ మంత్రి కోలిన్ పావెల్(84) కన్నుమూశారు. కోవిడ్ -19 సంబంధిత సమస్యలతో పావెల్ మరణించినట్లు ఆయన కుటుంబం సోమవారం ప్రకటించింది. అద్భుతమైన, ప్రేమగల భర్త, తండ్రి, తాతను, గొప్ప అమెరికన్‌ను కోల్పోయామంటూ పావెల్‌ కుటుంబం ఒక ప్రకటనలో పేర్కొంది. పావెల్‌ రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకున్నారని కూడా తెలిపింది.

పావెల్ మరణంపై స్పందించిన అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ ”ఒక కుటుంబ సభ్యుడిని, మంచి స్నేహితుడిని కోల్పోయాను” అంటూ స్పందించారు.

కాగా రిపబ్లికన్ రాజకీయవేత్త అయిన పావెల్‌ టాప్ మిలిటరీ ఆఫీసర్‌గా పనిచేశారు. పావెల్‌.. రిటైర్డ్ ఫోర్-స్టార్ జనరల్ మరియు జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ మాజీ చైర్మన్. 2001-2005 మధ్య జార్జ్ డబ్ల్యూ బుష్ ఆధ్వర్యంలోని రిపబ్లికన్ పార్టీ ప్రభుత్వంలో పావెల్ విదేశాంగ మంత్రిగా పని చేశారు. విదేశాంగ మంత్రి బాధ్యతలు చేపట్టిన తొలి ఆఫ్రికన్-అమెరికన్‌గా రికార్డులకెక్కారు.

సెప్టెంబరు 11 ఉగ్ర దాడుల తరువాత గందరగోళ పరిస్థితుల నిర్వహణలో పావెల్ కీలక భూమికను నిర్వహించారు. అప్పట్లో తనను తాను మోడరేట్ రిపబ్లికన్‌గా చెప్పుకున్న కోలిన్ పావెల్, 2008లో ఒబామాను అధ్యక్షుడిని చేయాలని కోరుతూ తన పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించారు.

అయితే ఇరాక్‌ యుద్ధం సందర్భంగా పావెల్‌ తీవ్ర విమర్శలపాలయ్యారు. ఇరాక్‌లో సామూహిక విధ్వంసక ఆయుధాలు ఉన్నట్లు ఆరోపిస్తూ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఫిబ్రవరి 2003న పావెల్ ప్రసంగించారు. అయితే ఆయన ఆరోపణలు అబద్ధమని తరువాత రుజువైంది. అయితే యూఎస్ లో ఆ ప్రసంగం తన కెరీర్‌పై మాయని మచ్చగా మారిందని తర్వాత పావెల్ వ్యాఖ్యానించారు. అది ఒక మచ్చ … మరియు అది ఎల్లప్పుడూ నా రికార్డులో ఒక భాగం. ఇది బాధాకరమైనది అని 2005 లో ఓ ఇంటర్వ్యూలో పావెల్ చెప్పారు. వియత్నాం యుద్ధంలో పాల్గొన్న పావెల్ అందులో గాయపడ్డారు. ఆ యుద్ధం తర్వాత ఆయన రాజకీయ, మిలటరీ వ్యూహకర్తగా అనుభవం సంపాదించారని చెబుతారు. పలువురు రాజకీయ నేతలకు మిలిటరీ సలహాదారుగా పావెల్ పని చేశారు.

ALSO READ  కరెంట్ బిల్లులు తగులబెట్టిన పంజాబ్ సీఎం