పాకిస్తాన్‌లో ‘Sputnik V’ వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్‌పై కన్నేసిన రష్యా

Russia eyes Sputnik V’s registration in Pakistan : పాకిస్తాన్‌లో స్పుత్నిక్-వి కరోనా వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్లపై రష్యా కన్నేసింది. పాక్‌లో తమ కోవిడ్-19 వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ల కోసం ర‌ష్య‌న్ డైర‌క్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ సీఈవో కిరిల్ దిమిత్రివ్ ఆసక్తి కనబర్చినట్టు జియో న్యూస్ నివేదించింది. ప్రధానికి ప్రత్యేక వైద్యసాయకుడు డాక్టర్ ఫైశాల్ సుల్తాన్ కు రష్యా అధికారి దిమిత్రివ్ లేఖ రాశారు. పాకిస్తాన్ లో రష్యా స్పుత్నిక్-వి వ్యాక్సిన్ల నమోదు కోసం వివరాలను లేఖలో దిమిత్రివ్ కోరారు.

ప్రపంచంలోనే మొట్టమొదటిగా ఆమోదం పొందిన కరోనా వ్యాక్సిన్లలో రష్యా స్పుత్నిక్-వి టీకా ఒకటిగా ఆయన పేర్కొన్నారు. ఈ టీకాకు అత్యవసర వినియోగం కోసం ఆమోదం లభించిందని తెలిపారు. రష్యా కరోనా వ్యాక్సిన్‌ 91.4 శాతం సమర్థవంతంగా పనిచేస్తుందని, ఫిబ్రవరి 2021 నుంచి సాధారణ ప్రజలందరికి ఈ టీకా అందుబాటులోకి రానుందని దిమిత్రివ్ లేఖలో వెల్లడించారు. రష్యా వ్యాక్సిన్ ధర కూడా భారీగా తగ్గించినట్టు తెలిపారు.

ఒక్కో టీకా డోస్ 22 డాలర్ల నుంచి 10 డాలర్లకు ధర తగ్గించినట్టు పేర్కొన్నారు. ఇతర వ్యాక్సిన్లతో పోలిస్తే.. స్పుత్నిక్-వి వ్యాక్సిన్ చాలా చౌకైనదిగా తెలిపారు. స్పుత్నిక్-వి వ్యాక్సిన్ -2 డిగ్రీల సెల్సియస్ నుంచి -8డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత మధ్య స్టోర్ చేయొచ్చునని లేఖలో తెలిపారు.

ఇతర వ్యాక్సిన్ల కంటే సులభంగా స్టోర్ చేయొచ్చునన్నారు. ట్రయల్స్ ఫలితాల్లో రష్యా వ్యాక్సిన్ 92శాతం ప్రభావంతమని గత ఏడాది నవంబర్ నెలలోనే రుజువైంది. ఆగస్టు 2019లో రష్యా ప్రజల కోసం ఈ స్పుత్నిక్-వి వ్యాక్సిన్ నమోదు చేసిన మొదటి దేశంగా నిలిచింది.