ఎలాన్ మస్క్‌కు బిగ్‌షాక్.. ట్రంప్‌తో విభేదాల ఎఫెక్ట్.. టెస్లా షేర్లు ఢమాల్.. 13లక్షల కోట్లు నష్టం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ల మధ్య విబేధాలు రోజురోజుకు ముందురుతున్నాయి.

Donald Trump Elon Musk
Musk-Trump:
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ల మధ్య విభేదాలు రోజురోజుకు ముదురుతున్నాయి. ఇరువురు పరస్పరం సంచలన ఆరోపణలు చేసుకుంటున్నారు. తాజాగా.. మస్క్ డొనాల్డ్ ట్రంప్ పై సంచలన ఆరోపణలు చేశారు. పెద్ద బాంబు లాంటి విషయాన్ని చెప్పాల్సిన సమయం వచ్చింది. ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో ట్రంప్ పేరు ఉంది. అందుకే ఆ ఫైల్స్ వివరాలను బయటపెట్డడం లేదంటూ ఓ పోస్టు చేశాడు. బిగ్ బ్యూటీఫుల్ బిల్ వ్యవహారంలో మస్క్ తీరునుతో తాను విసిగిపోయానంటూ ట్రంప్ మీడియా ముఖంగా చెప్పిన గంటలోపే మస్క్ ఈ ట్వీట్ చేయడం గమనార్హం.
ఇటీవల డోజ్ శాఖ నుంచి ఎలాన్ మస్క్ వైదొలిగిన విషయం తెలిసిందే. డోజ్ శాఖ నుంచి వైదొలిగిన తరువాత నా వల్లే ట్రంప్ గెలిచారంటూ ఎలాన్ మస్క్ వ్యాఖ్యానించాడు. ఆయన లేకున్నా గెలిచేవాడిని అంటూ ట్రంప్ కౌంటర్ ఇచ్చారు. వీరిద్దరి మధ్య విబేధాల నేపథ్యంలో తాజాగా.. ఎలాన్ మస్క్ కు బిగ్ షాక్ తగిలింది. ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తిన నేపథ్యంలో 14శాతం మేర టెస్లా షేర్లు పడిపోయాయి. దీంతో 153 బిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో 13లక్షల కోట్లు)కుపైగా నష్టం వాటిల్లింది. గత ఐదు ట్రేడింగ్ సెషన్లలో నాలుగింటిలో ఈ స్టాక్ క్షీణించింది.
దీంతో కంపెనీ మార్కెటల్ విలువ 1 ట్రిలియన్ డాలర్ల మార్కు కంటే దిగువకు పడిపోయి, 916 బిలియన్ డాలర్ల వద్ద ముగిసింది. టెస్లా సంపద ఒక్కరోజులోనే ఈ స్థాయిలో తరిగిపోవడం సంస్థ చరిత్రలోనే ఇదే తొలిసారి కావడం గమనార్హం.
మే నెలలో టెస్లా షేర్లు 22శాతం పెరిగాయి. అయినప్పటికీ కంపెనీ బలహీనమైన అమ్మకాల సంఖ్యలను నివేదించింది. కానీ, మస్క్, ట్రంప్ మధ్య బహిరంగ విభేదాలు ప్రారంభమైనప్పటి నుంచి ఈ వారంలోనే స్టాక్ దాదాపు 18శాతం నష్టపోయింది. ఈ సంవత్సరం ఇప్పటి వరకు టెస్లా షేర్లు దాదాపు 30శాతం తగ్గాయి. డిసెంబర్ 18న చూసిన గరిష్ట స్థాయి 488.54డాలర్లు హై నుంచి ఇది చాలా తక్కువ.