Donald Trump: ట్రంప్ మరో సంచలనం.. ఏకంగా రూ.86 వేల కోట్ల పరువునష్టం దావా..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ మీడియా సంస్థపై పరువు నష్టం దావా వేశాడు.

Donald Trump: ట్రంప్ మరో సంచలనం.. ఏకంగా రూ.86 వేల కోట్ల పరువునష్టం దావా..

Donald Trump

Updated On : July 19, 2025 / 3:48 PM IST

Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ మీడియా సంస్థపై పరువు నష్టం దావా వేశారు. సెక్స్ కుంభకోణంలో నిందితుడైన జెఫ్రీ ఎప్‌స్టైన్‌తో డొనాల్డ్ ట్రంప్‌కు సంబంధాలు ఉన్నాయంటూ కొంతకాలం క్రితం పెద్దెత్తున ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే దీనిపై ప్రముఖ మీడియా సంస్థ వాల్‌స్ట్రీట్ జర్నల్ ఓ కథనాన్ని ప్రచురించింది. అందులో 2003లో జెఫ్రీ ఎప్‌స్టైన్ పుట్టిన రోజు సందర్భంగా శృంగారాత్మక చిత్రాన్ని ట్రంప్ పంపించారని ఆరోపించింది. ఈ కథనంపై ట్రంప్ తీవ్రంగా మండిపడ్డారు. తాను ఏ లేఖనూ పంపించలేదని, అదంతా అవాస్తవమని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే సదరు మీడియా సంస్థపై పరువు నష్టం దావా వేశారు.

వాల్‌స్ట్రీట్ జర్నల్ యాజమాని రూపర్ట్ మార్దోక్, న్యూస్ కార్పొరేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాబర్ట్ థామ్సన్, ఇద్దరు మీడియా సంస్థ రిపోర్టర్లపై డోనాల్డ్ ట్రంప్ రూ.86వేల కోట్ల (10 బిలియన్ డాలర్లు)దావా వేశారు. తన పట్ల దురుద్దేశంతో వ్యవహరించారని, దీని వలన తనకు అపారమైన ఆర్థిక నష్టంతోపాటు.. తన ప్రతిష్ట దెబ్బతింటుందని పేర్కొంటూ.. మియామీ ఫెడరల్‌ కోర్టులో దావా దాఖలు చేశారు. కేసు దాఖలు చేయడానికి ముందు ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్ లో ఇలా రాశారు.. “వాల్ స్ట్రీట్ జర్నల్ ఎప్‌స్టైన్‌కు ఒక నకిలీ లేఖను ముద్రించింది. ఇవి నా మాటలు కావు, నేను మాట్లాడే విధానం కాదు. అలాగే, నేను చిత్రాలు గీయను. ఇది ఒక స్కామ్ అని, ఈ ఫేక్ స్టోరీని ప్రింట్ చేయకూడదని నేను రూపర్ట్ ముర్డోక్‌తో చెప్పాను. కానీ అతను అలా చేశాడు. ఇప్పుడు నేను అతనిపై, అతని థర్డ్ రేట్ వార్తాపత్రికపై దావా వేయబోతున్నాను.” అని పేర్కొన్నాడు.

అమెరికాను కుదిపేసిన సెక్స్ కుంభకోణంలో నిందితుడైన ఎప్‌స్టైన్‌ను 2019లో అరెస్టు చేశారు. అదే ఏడాది ఆగస్టులో అతడు జైల్లో అనుమానాస్పద స్థితిలో మరణించాడు. అయితే, ఎప్‌స్టైన్ పుట్టినరోజు సందర్భంగా ట్రంప్ ఆయనకో కానుక పంపించినట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ తన కథనంలో పేర్కొంది. ఆ బహుమతి ఓ లేఖ అని, అందులో చేతితో గీసిన మహిళ నగ్న చిత్రం ఉందని తెలిపింది. దానిపై ట్రంప్ సంతకంతో పాటు హ్యాపీ బర్త్ డే.. నీ ప్రతిరోజు ఓ అందమైన రహస్యంగా మారాలని ఆకాంక్షిస్తున్నా అని రాశారని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ తమ కథనంలో వెల్లడించింది. దీనిపై ట్రంప్ తీవ్రంగా మండిపడ్డారు. తాను ఏ లేఖనూ పంపించలేదని, అదంతా అవాస్తవమని పేర్కొన్నారు.

ట్రంప్ పరువు నష్టం దావాపై వాల్ స్ట్రీట్ జర్నల్ యాజమాన్యం స్పందించింది. ట్రంప్ చట్టపరమైన చర్యను సమర్ధవంతంగా ఎదుర్కొంటామని, మా రిపోర్టింగ్ కఠినత, ఖచ్చితత్వంపై మాకు పూర్తి నమ్మకం ఉందని పేర్కొంది.