Donald Trump: చైనా, అమెరికా టారిఫ్ వార్.. జిన్‌పింగ్ పై డొనాల్డ్ ట్రంప్ ప్రశంసలు..
అమెరికా, చైనా దేశాల మధ్య టారిఫ్ వార్ జరుగుతున్న వేళ చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ పై డొనాల్డ్ ట్రంప్ ప్రశంసల జల్లు కురిపించాడు.

Donald Trump compliments Xi Jinping
Donald Trump: అమెరికా, చైనా మధ్య టారిఫ్ వార్ తీవ్రరూపం దాల్చుతోంది. నువ్వెంత సుంకాలు పెంచితే.. నేనూ అంతే స్థాయిలో పెంచేస్తా అంటూ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ సై అంటే సై అంటున్నారు. ఇరుదేశాల మధ్య సుంకాల వార్ ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారినవేళ డొనాల్డ్ ట్రంప్ చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ పై ప్రశంసల జల్లు కురిపించారు.
ప్రపంచ దేశాల నుంచి అమెరికాకు దిగుమతి అవుతున్న ఉత్పత్తులపై ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాలను విధించిన విషయం తెలిసిందే. భారత్, చైనా సహా అనేక దేశాలు ట్రంప్ ప్రతీకార సుంకాల జాబితాలో ఉన్నాయి. ట్రంప్ నిర్ణయంపై చైనా మండిపడింది. చైనా ఉత్పత్తులపై ట్రంప్ 34శాతం ప్రతీకార సుంకాలు విధించగా.. చైనా సైతం అదే స్థాయిలో అమెరికా నుంచి దిగుమతి అవుతున్న వస్తువులపై టారిఫ్ లను విధించింది. చైనా నిర్ణయంపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేయడంతోపాటు.. టారిఫ్ ల పెంపు నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలంటూ డెడ్ లైన్ విధించాడు. చైనా వెనక్కు తగ్గకపోవటంతో ఆదేశ ఉత్పత్తులపై 104శాతం టారిఫ్ లు విధిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. దీంతో చైనా సైతం అమెరికా ఉత్పత్తులపై 84శాతం టారిఫ్ విధిస్తున్నట్లు ప్రకటించింది.
Also Read: ట్రంప్ సంచలన నిర్ణయం.. టారిఫ్ లకు బ్రేక్.. స్టాక్ మార్కెట్లు రయ్..
ప్రపంచ దేశాలపై విధించిన ప్రతీకార సుంకాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనక్కు తగ్గాడు. ప్రతీకార సుంకాలను 90రోజులు పాటు తాత్కాలికంగా నిలుపుదల చేశాడు. అయితే, చైనా నుంచి అమెరికాకు దిగుమతి అవుతున్న ఉత్పత్తులపై మాత్రం సుంకాలను 125శాతంకు పెంచుతున్నట్లు ట్రంప్ ప్రకటించాడు. ట్రంప్ నిర్ణయంతో చైనా, అమెరికా మధ్య టారిఫ్ వార్ తీవ్రరూపం దాల్చినట్లయింది. అయితే, తాజాగా.. ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ.. చైనా అధ్యక్షుడిపై ప్రశంసల జల్లు కురిపించాడు.
ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కు ఎప్పుడు ఏం చేయాలో బాగా తెలుసు. ఆయన ప్రపంచంలోనే తెలివైన దేశాధ్యక్షుల్లో ఒకరు. దేశం అంటే ఆయనకు ఎంతో ప్రేమ. ఆ విషయం నాకు బాగా తెలుసు. జిన్ పింగ్ గురించి కూడా తెలుసు. ఈ సుంకాలపై ఒక ఒప్పందం కుదుర్చుకుంటారని నేను అనుకుంటున్నా. త్వరలోనే దీనిపై చర్చించేందుకు చైనా నుంచి మాకు ఫోన్ వస్తోందని భావిస్తున్నా. దానికి మేం సిద్ధంగా ఉన్నాం. వారు ముందుకొస్తే సుంకాలపై చర్చించేందుకు మేము సిద్ధంగానే ఉన్నాం’’ అంటూ ట్రంప్ పేర్కొన్నారు.