సునీతా విలియమ్స్‌ను భూమిపైకి తీసుకురండి.. ఎలాన్ మస్క్ సాయం కోరిన డొనాల్డ్ ట్రంప్..

గతేడాది జూన్ నుంచి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుష్ విల్మోర్ ను సాధ్యమైనంత త్వరగా భూమిపైకి తీసుకొచ్చేలా..

Sunita Williams

Sunita Williams : భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్, బుష్ విల్మోర్ గతేడాది జూన్ నెలలో బోయింగ్ స్టార్‌లైన్‌ స్పేస్‌షిప్‌లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లోకి వెళ్లారు. వారంరోజుల్లో తిరిగిరావాల్సిన వారు.. ఎనిమిది నెలలుగా అక్కడే ఉంటున్నారు. వీరిని తీసుకెళ్లిన బోయింగ్ స్టార్‌లైన్‌ స్పేస్‌షిప్‌ లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వారు అక్కడే చిక్కుకుపోయారు. వీరిని భూమిపైకి తీసుకొచ్చేందుకు నాసా స్పేస్ఎక్స్ తో కలిసి పనిచేస్తోంది. వచ్చేనెల వారిని భూమిపైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. నాసా ప్రకటన ప్రకారం.. వారు మార్చి చివర్లో లేదా ఏప్రిల్ తొలి వారంలో భూమిపైకి చేరుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పేస్ ఎక్స్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కు కీలక విజ్ఞప్తి చేశారు. వ్యోమగాములను త్వరగా భూమిపైకి తీసుకొచ్చేలా చర్యలు వేగవంతం చేయాలని కోరారు.

Also Read: Union Budget 2025: ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్.. సామాన్యులు ఏం ఆశిస్తున్నారో తెలుసా? మీరూ ఇవే కావాలనుకుంటున్నారా?

గత కొన్ని నెలలుగా ఐఎస్ఎస్ లో చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుష్ విల్మోర్ ను సాధ్యమైనంత త్వరగా భూమిపైకి తీసుకొచ్చేలా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్యలు చేపట్టారు. ఈ మేరకు సహాయం చేయాలని ట్రూత్ సోషల్ మీడియా ద్వారా ఎలాన్ మస్క్ సహాయం కోరారు. అయితే, మస్క్ ఈ విషయంపై స్పందిస్తూ.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన ఇద్దరు వ్యోమగాములను త్వరగా భూమిపైకి తీసుకొచ్చేలా చర్యలు మొదలు పెట్టాలని ట్రంప్ కోరారని చెప్పారు.

వ్యోమగాములను భూమిపైకి తీసుకొచ్చే విషయంలో గత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఎలాన్ మస్క్ విమర్శించారు. బైడెన్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే కొన్ని నెలలుగా వారు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయారని ఆరోపించారు. ఇద్దరు వ్యోమగాములను భూమిపైకి తీసుకొచ్చేలా ట్రంప్ ప్రయత్నాలు చేస్తున్నారని, ఇందుకోసం స్పేస్ఎక్స్ సాయాన్ని  కోరారని మస్క్ చెప్పారు. ట్రంప్ అభ్యర్ధన మేరకు త్వరలో ఆ పని పూర్తి చేస్తామని ఈ సందర్భంగా మస్క్ తెలిపారు. మస్క్ తాజా ప్రకటనతో వ్యోమగాములను భూమికి తీసుకు వచ్చేందుకు స్పేస్ఎక్స్ చేపట్టిన చర్యలను వేగవంతం చేయనున్నట్లు తెలుస్తోంది.