Trump tariff: దెబ్బకు దెబ్బ.. అమెరికా మీద చైనా టారిఫ్… ఇప్పుడు ఉన్నదానికంటే అదనంగా..
తమ నిర్ణయం ఏప్రిల్ 10 నుంచి అమల్లోకి వస్తుందని చెప్పింది.

చైనాతో పాటు అనేక దేశాలపై సుంకాలు విధిస్తామని చెప్పిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పని చేసిన విషయం తెలిసిందే. దీంతో ప్రతీకార సుంకాలు విధిస్తామని నిన్న చైనా ప్రకటించింది.
ఇప్పుడు చైనా కూడా అన్నంత పని చేసింది. అమెరికా ఉత్పత్తులపై అదనంగా 34 శాతం సుంకాలు విధించాలని నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 10 నుంచి తమ నిర్ణయం అమల్లోకి వస్తుందని చెప్పింది.
మరోవైపు, చైనా నుంచి దిగుమతి చేసుకునే ఉత్పత్తులపై అమెరికా విధించిన సుంకాలపై డ్రాగన్ కంట్రీ ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO)లో దావా వేసింది. దేశాల మధ్య న్యాయపరంగా వ్యాపారాలు జరగడానికి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ సహాయపడుతుంది.
Also Read: మరో కొత్త ఫీచర్.. ఈ స్మార్ట్‌ఫోన్ కొనండి.. మీ చుట్టూ సువాసనలు వెదజల్లొచ్చు.. ఎలాగంటే?
అమెరికాలో చైనా ఉత్పత్తులపై సుంకాలు విధించడంతో యూఎస్‌లో ఆయా వస్తువులు ఖరీదవుతాయి. ఈ పన్నులు అన్యాయమని, అంతర్జాతీయ వాణిజ్య నియమాలను ఉల్లంఘించడమేనని చైనా అంటోంది. సమస్యను పరిష్కరించడంలో సహాయపడాలని డబ్ల్యూటీవోను కోరింది.
మరోవైపు, ఏప్రిల్ 4 నుంచి కొన్ని ప్రత్యేక మెటీరియల్స్‌ను ఇతర దేశాలకు ఎగుమతి చేయడాన్ని కూడా తగ్గిస్తామని చైనా తెలిపింది. కంప్యూటర్ చిప్స్, ఎలక్ట్రిక్ కార్లు వంటి వాటిని తయారు చేయడానికి ఈ మెటీరియల్స్ చాలా ముఖ్యం. ఇప్పుడు వాటి ఎగుమతులను తగ్గిస్తామని చైనా అంటోంది.
చట్టంలోని నిబంధనలు తాము పాటిస్తున్నామని చైనా చెప్పింది. “సంబంధిత వస్తువుల ఎగుమతులపై చైనా ప్రభుత్వం ఈ నియంత్రణలను అమలు చేయడం వెనుక తమ ఉద్దేశం జాతీయ భద్రత, ప్రయోజనాలను కాపాడటం, ప్రమాదకర ఆయుధాలను (అణ్వాయుధాలు వంటివి) దేశాలు మరింత పెంచుకోకుండా చేయడమే” అని చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అంతర్జాతీయ నిబంధనలను పాటిస్తూ ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు చెప్పింది.
ఇంతకు ముందు ఉన్న సుంకాలు ఎంత?
అమెరికా నుంచి వచ్చే అన్ని దిగుమతులపై చైనా అదనంగా 34 శాతం సుంకాన్ని ఇవాళ ప్రకటించింది. అయితే, ఈ ప్రకటన చేయడానికి ముందుకు వరకు ఆ టారిఫ్ ఎంత ఉందో తెలుసా? అమెరికా నుంచి దిగుమతి అయ్యే ఉత్పత్తులపై చైనా వసూలు చేస్తున్న సగటు సుంకం రేటు ఆయా ఉత్పత్తులను బట్టి మారుతూ ఉంటుంది.
సాధారణంగా ఈ సగటు సుంకం రేటు ఇప్పటివరకు 21 శాతం నుంచి 25 శాతం మధ్య ఉంది. ఇప్పుడు చైనా అదనంగా 34 శాతం విధించడంతో అమెరికా ఉత్పత్తులు ఇప్పుడు చైనాలోకి దిగుమతి అయ్యే సమయంలో దాదాపు 55 శాతం నుంచి 60 శాతం మధ్య సుంకాలను చెల్లించాల్సి ఉంటుంది.
కాగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై అదనంగా 34 శాతం సుంకాలను విధించిన విషయం తెలిసిందే. దీంతో ఈ సుంకాల శాతం ఇప్పుడు 54కి చేరింది.