భారత్‌తో యుద్ధాన్ని కోరుకోవడం లేదు, చైనా శాంతిమంత్రం

భారత్ వర్సెస్ చైనా.. సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ.. ఈ రెండు దేశాలకు సంబంధించి ప్రతీ విషయం ఆసక్తి కలిగిస్తోంది. ఓవైపు చర్చలంటూ డ్రాగన్ కవ్విస్తుంటే.. అంతే దీటుగా ఆన్సరిస్తోంది భారత్. ఇక.. ఇరు దేశాల మధ్య కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చలు జరిగాయి. 14 గంటపాటు జరిగిన చర్చల్లో భారత్ తన వైఖరేంటో స్పష్టం చేసింది.
భారత్ డిమాండ్లకు చైనా అంగీకారం:
భారత్- చైనా మధ్య కమాండర్ స్థాయి అధికారుల మధ్య ఆరోసారి చర్చలు జరిగాయి. ఈ చర్చలు డ్రాగన్‌లో కొంతమేర సానుకూల కదలికలను తీసుకొచ్చాయి. మోల్దో దగ్గర జరిగిన చర్చల్లో భారత్ తన వైఖరేంటో చైనాకు స్పష్టంగా చెప్పేసింది. భారత్ చేసిన డిమాండ్లలో కొన్నింటిని చైనా అంగీకరించింది.
అక్టోబర్ నుంచి లద్ధాఖ్ ప్రాంతంలో చలి 25 డిగ్రీలు ఉండనుంది. దీంతో వీలైనంత త్వరలో చర్చలు సఫలమయ్యేలా చూడాలని డ్రాగన్‌ను భారత్ కోరింది. ప్రధానంగా ఎల్‌ఏసీకి ఇవతల.. దెప్సాంగ్, ఫాంగాంగ్ ఫింగర్స్ ప్రాంతాల నుంచి చైనా సైన్యం వెనక్కి తగ్గాలని భారత అధికారులు డిమాండ్ చేశారు. ఈ డిమాండ్స్‌ను డ్రాగన్ కంట్రీ అంగీకరించింది.
ఏ దేశంతోనూ యుద్ధాన్ని కోరుకోవడం లేదు:
భారత్ సరిహద్దుల్లో కొనసాగుతోన్న ఉద్రిక్తతలు, అమెరికాతో జరుగుతోన్న ప్రచ్ఛన్న యుద్ధంపై చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. శాంతి వచనాలు వల్లెవేశారు. తాము ఎవరితోనూ యుద్ధాన్ని కోరుకోవడం లేదని, ప్రచ్ఛన్న యుద్ధం, హాట్ వార్.. ఏదీ తమకు అవసరం లేదని అన్నారు. ఐరాస సర్వసభ్య సమావేశంలో రికార్డు చేసిన వీడియో సందేశంలో జిన్‌పింగ్ ఈ విషయాలను వెల్లడించారు. దేశాల మధ్య బేధాభిప్రాయాలు సహజమేనని, అయితే, వాటిని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు.
విస్తరణ, ఆధిపత్య కాంక్ష లేదు:
ప్రపంచంలోనే అభివృద్ధి చెందుతున్న అతిపెద్ద దేశమైన చైనా.. శాంతియుత, సహకార సంబంధ అభివృద్ధికి కట్టుబడి ఉందని జిన్ పింగ్ మరోసారి చెప్పారు. తాము ఎప్పటికీ విస్తరణ, ఆధిపత్యం, ప్రభావితం చేయాలని భావించడం లేదన్నారు. ప్రచ్ఛన్న యుద్ధం లేదా ఏ దేశంతోనైనా పోరాడాలనే ఉద్దేశం కూడా మాకు లేదని స్పష్టం చేశారు. ఇతర దేశాలతో ఉన్న విభేదాలను తగ్గించుకుంటామని, సంభాషణలు, చర్చల ద్వారా వివాదాలను పరిష్కరించుకుంటామని వివరించారు.
ఉద్దేశపూర్వకంగానే పొరుగు దేశాలతో కయ్యం:
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మంగళవారం(సెప్టెంబర్ 22,2020) ప్రారంభమైన ఐక్య రాజ్యసమితి సర్వసభ్య సమావేశాల్లో ఆయా దేశాల అధినేతలు వర్చువల్ విధానంలోనే పాల్గొన్నారు. తొలిరోజు జిన్‌పింగ్ సహా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్స్‌నారో ప్రసంగించారు. కరోనా వైరస్ విషయంలో చైనా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఇదే సమయంలో భారత్ సరిహద్దులు, దక్షిణ చైనా సముద్రంలో ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తోంది. ఉద్దేశపూర్వకంగానే పొరుగు దేశాలతో వివాదాలను రెచ్చగొడుతూ కయ్యానికి కాలుదువ్వుతోందనే వాదన వినబడుతోంది. ఈ నేపథ్యంలో జిన్‌పింగ్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది.
ఇటీవల మాస్కోలో విదేశాంగ మంత్రుల భేటీలో కుదిరిన 5 సూత్రాల ప్రణాళిక ఆధారంగా కార్ప్స్ కమాండర్ చర్చలను నిర్వహించారు. వాస్తవాధీన రేఖ వెంట ఉన్న దళాలను తక్షణమే వెనక్కి పంపాలని ఇండియా ఈ సమావేశాల్లో డిమాండ్ చేసింది. చైనా వెనక్కి తగ్గి యథాతథ స్థితిని పునరుద్ధరించకపోతే భారత సైన్యం సుదీర్ఘకాలం పాటు అక్కడే ఉంటుందని భారత అధికారులు చైనాకు వార్నింగ్ ఇచ్చారు. పాంగాంగ్ సరస్సుతో పాటు హాట్ స్ప్రింగ్స్, డెప్సాంగ్, బ్యాంకాక్ ది చో, సుజౌ, ఫింగర్ సమీపంలో చైనా దళాలు వెంటనే వెనక్కి వెళ్లిపోవాలని భారత్ డిమాండ్ చేసింది.
డ్రాగన్ తోక జాడిస్తే తాట తీసేందుకు భారత్ సిద్ధం:
చైనాతో సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని భారత్ భావిస్తోంది. అయితే… డ్రాగన్ తోక జాడిస్తే.. మాత్రం… తాట తీసేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే లద్ధాఖ్‌వో భారీగా సైన్యాన్ని మోహరించింది. ఇదే విషయాన్ని కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చల్లో భారత్ చైనాకు స్పష్టం చేసింది. చర్చల్లో భారత్ నుంచి ఇండియన్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్, చైనా నుంచి సౌత్ జిన్జియాంగ్ మిలిటరీ కమాండర్ మేజర్ జనరల్ లియు లిన్ హాజరయ్యారు.