‘గగనం’ గుర్తుకు తెచ్చింది : బంగ్లాదేశ్ విమానం హైజాక్ సుఖాంతం

  • Publish Date - February 24, 2019 / 03:06 PM IST

బంగ్లాదేశ్ విమానం హైజాక్. ప్రయాణీకులతో పాటు హైజాక్ చేసిన వ్యక్తులు ఎంతమంది ఉన్నారో తెలియదు. అందరిలోనూ ఉత్కంఠ. లోన ఉగ్రవాది ఉన్నాడా ? అనే అనుమానాలు. ఎలాగైనా ప్రయాణీకులను సేఫ్‌గా తీసుకరావాలని, హైజాక్ చేసిన వ్యక్తిని పట్టుకోవాలని భద్రతా సిబ్బంది ఆలోచన. తమ వారికి ఏమైందోనని ఫ్యామిలీ మెంబర్స్ ఆలోచన. మొత్తానికి సుఖాంతం కావడం అందరూ ఊపిరిపీల్చుకున్నారు. టాలీవుడ్‌‌లో వచ్చిన ‘గగనం’ సినిమాను గుర్తుకు తెచ్చింది. 

ఢాకా నుండి దుబాయ్ వెళుతున్న (బీజీ 147) విమానాన్ని ఓ వ్యక్తి హైజాక్ చేసేందుకు ట్రై చేయడంతో తీవ్ర కలకలం రేపింది. ఫిబ్రవరి 24వ తేదీ ఆదివారం సాయంత్రం ఇది జరిగింది. గన్‌తో బెదిరించినట్లు, కాల్పులు కూడా చేసినట్లు తెలుస్తోంది. అనుమతి తీసుకుని అత్యవసరంగా చిట్టగ్యాంగ్‌లోని షా అమానత్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో విమానాన్ని దింపేశాడు పైలెట్. అప్పటికే సమాచారం అందుకున్న కమెండాలు ప్లేన్‌ని చుట్టుముట్టారు. 

విమానంలో 150మంది ప్రయాణీకులున్నట్లు గుర్తించారు. హైజాక్ చేసిన వ్యక్తితో భద్రతా సిబ్బంది మాట్లాడారు. తాను బంగ్లాదేశ్ ప్రధాన మంత్రితో మాట్లాడాలని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. భద్రతా సిబ్బంది పక్కా స్కెచ్ వేశారు. ఆ వ్యక్తిని మాటల్లో దింపారు. మరోవైపు ప్రయాణీకులను సేఫ్‌గా కిందకు దిగే విధంగా చూశారు. విమానంలోకి వెళ్లి హైజాక్ చేసిన వ్యక్తి అదుపులోకి తీసుకుని విమాన సిబ్బందిని క్షేమంగా రక్షించారు. హైజాక్ కథ సుఖాంతం కావడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. హైజాక్ చేసింది ఎవరు ? ఎందుకు చేశారు ? ఏ దేశానికి చెందిన వారో తెలియాల్సి ఉంది.