Elon Musk: మళ్లీ తండ్రైన ఎలాన్ మస్క్.. స్వయంగా వెల్లడించిన మస్క్ సహజీవన భాగస్వామి షివోన్ జిలిస్

టెస్లా సీఈవో, బిలియనీర్ ఎలాన్ మస్క్ మరో సారి తండ్రి అయ్యాడు. ఇప్పటికే 13 మంది పిల్లలకు తండ్రి అయిన మస్క్..

Elon Musk: మళ్లీ తండ్రైన ఎలాన్ మస్క్.. స్వయంగా వెల్లడించిన మస్క్ సహజీవన భాగస్వామి షివోన్ జిలిస్

Elon Musk

Updated On : March 1, 2025 / 1:42 PM IST

Elon Musk: టెస్లా సీఈవో, బిలియనీర్ ఎలాన్ మస్క్ మరోసారి తండ్రి అయ్యాడు. ఎలోన్ మస్క్ సహజీవన భాగస్వామి అయిన షివోన్ జిలిస్ మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే, షివోన్, మస్క్‌లకు ఇప్పటికే ముగ్గురు పిల్లలున్నారు. నాల్గో బిడ్డకు సెల్డాన్ లైకుర్గస్ అని పేరు పెట్టారు. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా షివోన్ జిలిస్ తెలిపారు. ఆమె ట్వీట్ కు హార్ట్ సింబల్ తో ఎలాన్ మస్క్ రిప్లయ్ ఇచ్చాడు.

Also Read: Elon Musk: మస్క్‌కు 13 మంది పిల్లలు ఉన్నారు కదా? వారి పోషణ కోసం ఎంతెంత చెల్లించాల్సి ఉంటుందో తెలుసా? ఇంతేనా..

షివోన్ జిలిస్ ఎక్స్ ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడించారు. “మస్క్ తో చర్చించాను. అందమైన ఆర్కాడియా పుట్టినరోజు దృష్ట్యా మా అద్భుతమైన కుమారుడు సెల్డాన్ లైకుర్గస్ గురించి నేరుగా పంచుకోవడం మంచిదని మేము భావించాము’’ అని పేర్కొంది. బంగారు వంటి దృఢమైన హృదయం కలిగిన అతన్ని చాలా ప్రేమిస్తున్నాను అని జిలిస్ పేర్కొంది. ఇదిలాఉంటే.. 2021లో మస్క్ జిలిస్ తో కవలలకు తండ్రి అయ్యాడు. 2024లో జిలిస్ మూడవ బిడ్డకు జన్మనిచ్చింది. తాజాగా జిలిస్ నాల్గో బిడ్డకు జన్మనిచ్చింది.

 

షెల్టన్ జననంతో మస్క్ మొత్తం సంతానం సంఖ్య 14కు చేరింది. మస్క్ మొదటి భార్య జస్టిన్ కు జన్మించిన తొలిబిడ్డ అనారోగ్య కారణాలతో 10వారాలకే మృతిచెందింది. ఆ తరువాత ఆ జంట ఐవీఎఫ్ పద్దతిలో ఐదుగురు పిల్లలకు జన్మనిచ్చింది. వీరు జస్టిన్ విల్సన్, వీవియన్, గ్రిఫిన్, కాయ్ సాక్సన్, డేమియన్. 2008లో మస్క్, జస్టిన్ విడిపోయారు. ఆ తరువాత బ్రిటన్ నటి తాలులాహ్ రిలేను మస్క్ పెండ్లి చేసుకున్నాడు. అయితే, వారికి సంతానం లేదు.

గ్రిమ్స్ అనే మ్యూజీషియన్‌‌తో మస్క్ కొంతకాలం పాటు రిలేషన్‌షిప్‌లో ఉన్నాడు. వారికి ఎక్స్, టెక్నోమెకానికస్ అనే కుమారులు, ఎక్సా డార్క్ అనే కుమార్తె జన్మించారు. అంతేకాక.. తన ప్రతిష్టాత్మక సంస్థ బ్రెయిన్ టెక్నాలజీ స్టార్టప్ న్యూరాలింక్ లో ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్న జిలిస్ తో మస్క్ సహజీవనం చేస్తున్నాడు. వీరికి ఇప్పటికే ముగ్గురు పిల్లలు ఉండగా.. తాజాగా.. ఈ జంట నాలుగో బిడ్డకు జన్మనిచ్చింది.

ఇటీవల తన బిడ్డకు తండ్రి మస్క్ అంటూ రచయిత్రి ఆష్టీ సెయింట్ క్లెయిర్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఐదు నెలల క్రితమే తానో బిడ్డకు జన్మనిచ్చానని, గోప్యత, భద్రతా కారణాల వల్ల ఈ విషయం బహిర్గతం చేయలేదని ఆమె తెలిపింది. దీనిపై ఇప్పటి వరకు మస్క్ ఎలాంటి స్పష్టమైన ప్రకటనా చేయలేదు.