Mexico : ప్రారంభించిన కొద్ది సేపట్లోనే కూలిన వంతెన

పర్యాటక ప్రాంతాల అభివృధ్దిలో భాగంగా నిర్మించిన చెక్క వంతెన ప్రారంభించిన కొద్దినిమిషాల్లోనే కూలిపోయిన ఘటన మెక్సికోలో చోటు చేసుకుంది. 

Mexico

Mexico : పర్యాటక ప్రాంతాల అభివృధ్దిలో భాగంగా నిర్మించిన చెక్క వంతెన ప్రారంభించిన కొద్దినిమిషాల్లోనే కూలిపోయిన ఘటన మెక్సికోలో చోటు చేసుకుంది.  ఈఘటనలో  ఆనగర మేయర్ ఆయన భార్య, అధికారులతో సహా సుమారు 25 మంది గాయపడ్డారు.

వివరాల్లోకి వెళితే  మెక్సికో నగరానికి దక్షిణాన ఉన్న కుర్నావాకాలోని సహజ, ప్రకృతి అందాలతో నిండి ఉంటుంది. రాజధాని ప్రాంత వాసులకు చాలాకాలంగా అది  వారాంతపు సెలవు విడిదిగా ఉంటోంది. ప్రాంతాలను  అభివృద్ధి చేయడంలో భాగంగా  అక్కడ ఉన్న  ఒక నది మీద నడక కోసం ఒక వంతెనను నిర్మించారు.  నీటి ప్రవాహాల మీదుగా వేలాడేటట్లుగా చెక్క, మెటల్‌తో ఈ వంతెనను ఏర్పాటు చేశారు. మేయర్ జోస్ లూయిస్ ఉరియోస్టెగుయ్ దీనిని ఇటీవల  ప్రారంభించారు. అనంతరం తన భార్య, నగర పాలక మండలి సభ్యులు, అధికారులు, విలేకరులతో కలిసి దానిపై నడిచుకుంటూ  వెళ్లారు.

ఇంతలో కాలువ మీదుగా ఏర్పాటు చేసిన ఆ వేలాడే వంతెన భాగం తెగిపోయింది. దీంతో మేయర్‌, ఆయన భార్యతో సహా 25 మందికి  పైగా వ్యక్తులు పదడుగుల ఎత్తు నుంచి కింద ఉన్న కొండ రాళ్లమీద  కాలువ సమీపంలో పడ్డారు.

నలుగురు సిటీ కౌన్సిల్‌ సభ్యులు, ఇద్దరు అధికారులు, ఒక స్థానిక రిపోర్టర్‌ సహా పలువురు తీవ్రంగా గాయపడినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. కాళ్లు, చేతులు, నడుము విరిగిన ఎనిమిది మందిని స్ట్రెచర్ల సహాయంతో ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.

కాగా, వంతెన ప్రారంభానికి ముందే కొందరు ఆ వేలాడే చోట జంప్‌ చేసి ఉంటారని, అలాగే సామర్థ్యానికి మించి ఒకేసారి ఎక్కువ మంది దానిపై నడవడం వల్ల ఇలా జరిగి ఉంటుందని మేయర్‌ తెలిపారు. మరోవైపు ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.