Passengers Killed: పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌లో ఘోరం.. 9 మంది ప్రయాణికులు దారుణ హత్య.. పంజాబీలే టార్గెట్?

అమాయక పౌరులను చంపడం దారుణం. అమాయక ప్రజల రక్తానికి ప్రతీకారం తీర్చుకుంటాము.

Passengers Killed: పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌లో ఘోరం.. 9 మంది ప్రయాణికులు దారుణ హత్య.. పంజాబీలే టార్గెట్?

Updated On : July 11, 2025 / 4:37 PM IST

Passengers Killed: పాకిస్తాన్ లోని బలూచిస్తాన్ లో దారుణం జరిగింది. మారణాయుధాలు ధరించిన దుండగులు రెచ్చిపోయారు. ప్రయాణికులతో వెళ్తున్న బస్సుపై దాడి చేశారు. 9 మంది ప్రయాణికులను కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత వారిని తుపాకులతో కాల్చి చంపారు. ఈ బస్సు బలూచిస్తాన్ నుంచి సెంట్రల్ పంజాబ్ కు వెళ్తోంది. పంజాబీ మూలాలు ఉన్న వారిని దుండగులు టార్గెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్, అంతర్గత మంత్రి మొహ్సిన్ నఖ్వీ ఈ సంఘటనను ధృవీకరించారు. హత్యలను తీవ్రంగా ఖండించారు. “అమాయక పౌరులను చంపడం దారుణం. దీనికి ప్రతీకారం తీర్చుకుంటాము. ఇది ఇండియా స్పాన్సర్డ్ టెర్రరిస్టుల పనే” అని పాక్ ప్రధాని షరీఫ్ ఆరోపించారు. షరీఫ్ ఆరోపణలపై భారత్ స్పందించలేదు. దాడికి ఎవరూ బాధ్యత వహించలేదు.

బలూచిస్తాన్‌లో “ప్రయాణికుల దారుణ హత్య”ను పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ ఖండించారు. నిషేధిత బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) ఈ హత్యలకు బాధ్యత వహిస్తుందన్నారు. “పాకిస్తాన్‌లో గందరగోళం, అస్థిరతను వ్యాప్తి చేయడం” ఆ సంస్థ లక్ష్యం అని ఆయన పేర్కొన్నారు. వేర్పాటువాద బలూచ్ ఫైటర్స్ బృందం BLA గతంలోనూ ఇలాంటి దాడులకు తెగబడింది. తూర్పు పంజాబ్ ప్రావిన్స్ నుండి వచ్చినట్లు గుర్తించబడిన తర్వాత ప్రయాణికులు హత్యకు గురయ్యారు. గత సంవత్సరం బలూచిస్తాన్‌లో BLA 23 మంది ప్రయాణికులను చంపిందని అధికార వర్గాలు తెలిపాయి.

Also Read: రూ.854 కోట్ల ప్యాకేజ్ ఆఫర్.. ట్రపిట్ బన్సాల్ ఎవరు? కుంభస్థలాన్నే కొట్టాడుగా..

అయితే, ప్రయాణికుల హత్యతో తమకు సంబంధం లేదని బలూచ్ ఆర్మీ తెలిపింది. ఆ సమయంలో తాము అక్కడ లేము అని వివరించింది. ప్రయాణికులపై దాడి జరిగిన ప్రాంతానికి దూరంగా ఉన్న బలూచిస్తాన్‌లోని సురాబ్ జిల్లాలోని సైనిక శిబిరంపై దాడిలో తాము పాల్గొన్నట్లు పేర్కొంది.

బలూచ్ లో అనే గ్రూపులు తిరుగుబాటు చేస్తున్నాయి. అందులో బీఎల్ఏ ఒకటి. BLA అత్యంత శక్తివంతమైనది. ఇది సంవత్సరాలుగా ఖనిజ సంపన్న ప్రాంతంలో ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ సరిహద్దుల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. పాకిస్తాన్ అధికారులు తమ ప్రాంతీయ వనరులను పంజాబ్ ప్రావిన్స్‌కు నిధులు సమకూర్చడానికి మళ్లిస్తున్నారని బలూచ్ యోధులు ఆరోపిస్తున్నారు.