Pakistan Cricket: భారత్ తలచుకుంటే పాకిస్తాన్ క్రికెట్ కుప్పకూలిపోతుంది

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ రమీజ్ రాజా చేసిన ఒక ప్రకటన సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

Pakistan Cricket: భారత్ తలచుకుంటే పాకిస్తాన్ క్రికెట్ కుప్పకూలిపోతుంది

Pakistan

Updated On : October 9, 2021 / 7:43 AM IST

Pakistan Cricket: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ రమీజ్ రాజా చేసిన ఒక ప్రకటన సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI)ని ప్రశంసిస్తూ.. పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు(PCB) పేదరికం గురించి మాట్లాడుతూ రమీజ్ రాజా చేసిన ప్రకటన ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్‌ను అమిత్ మాళవ్య పోస్ట్ చేసారు.

సెనేట్ స్టాండింగ్ కమిటీతో జరిగిన సమావేశంలో, రమీజ్ రాజా మాట్లాడుతూ.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పరిస్థితి ఏమిటో ప్రపంచమంతా చూస్తుందని, పాకిస్తాన్ వెళ్లి క్రికెట్ ఆడాలని ఏ దేశమూ కోరుకోవట్లేదని, ఇటీవల న్యూజిలాండ్, ఇంగ్లాండ్ కూడా తమ పాకిస్తాన్ పర్యటనను రద్దు చేసుకున్నాయని చెప్పారు.

న్యూజిలాండ్ జట్టు పాకిస్తాన్ చేరుకుని కూడా వెనక్కి వచ్చేసిందని, ఆ తర్వాత పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చాలా నష్టపోయిందని చెప్పారు. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌ మొత్తం భారత్‌ గుప్పెట్లో ఉందని, భారత్ తలుచుకుంటే పాకి క్రికెట్ కుప్పకూలిపోతుందని అభిప్రాయపడ్డారు. ఆదాయపరంగా ఐసీసీ భారత్‌ మీదే ఎక్కువగా ఆధారపడి ఉందని, అందువల్ల ఐసీసీ కూడా ఆ దేశాన్ని ఏమీ చేయలేదన్నాడు.

‘‘ఐసీసీలో రాజకీయ పరంగా ఆసియా, పాశ్చాత్య దేశాల వర్గాలు విడిపోయాయి. దాని ఆదాయంలో 90శాతం భారత్‌ నుంచే వస్తుంది. ఇది భయపెట్టే విషయం. పీసీబీ ఆదాయంలో 50 శాతం ఐసీసీ ఇస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే పాకిస్తాన్ క్రికెట్‌ను నడిపిస్తోంది భారత వ్యాపార సంస్థలే.” అని రమీజ్ చెప్పుకొచ్చారు.

భారత్‌లో ప్రభుత్వాలు గట్టిగా పట్టుబట్టి, ప్రధాని జోక్యం చేసుకుని పాకిస్తాన్‌కు నిధులు ఆపేయమంటే పీసీబీ కుప్పకూలిపోతుందని అన్నాడు.

భారత్-పాకిస్తాన్ టీ20 ప్రపంచకప్:
భారత్-పాకిస్తాన్ మధ్య పోటీ అంటేనే క్రికెట్ స్టేడియంలో అత్యధిక వోల్టేజ్ కనిపిస్తుంది. ఈ మ్యాచ్‌ను క్రికెట్‌పై పెద్దగా ఆసక్తి లేని వారు కూడా చూస్తారు. ఈ రెండు జట్ల మధ్య అక్టోబర్ 24న టీ20 వరల్డ్ కప్‌లో మ్యాచ్ జరగబోతుంది. ఈ మ్యాచ్‌లను యూఏఈలో నిర్వహిస్తోంది బీసీసీఐ.