United States : భారీ వర్షం.. వందేళ్లలో ఇదే తొలిసారి!

అమెరికాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత వందేళ్లలో ఇంత భారీ వర్షం కురవలేదని అక్కడి అధికారులు చెబుతున్నారు.

United States :  భారీ వర్షం.. వందేళ్లలో ఇదే తొలిసారి!

United States

Updated On : August 23, 2021 / 4:53 PM IST

United States : ఈ ఏడాది ఏ దేశంలో చూసినా విపత్తులు, విధ్వంసాలే కనిపిస్తున్నాయి. గత నెలలో వరదలతో చైనా కకావికలమైతే, తాజాగా ఇదే తరహాలో వరదలు అమెరికాను ముంచెత్తుతున్నాయి. గత 100 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా వర్షపాతం నమోదు కావడంతో అమెరికాలోని పలు ప్రాంతాలు నీటమునిగాయి. టెన్నెస్సీ భారీ వర్షం ధాటికి అతలాకుతలమవుతోంది. భారీ వర్షాలు, వరదల కారణంగా ఇప్పటి వరకు 22 మంది మృతి చెందినట్లు సమాచారం.

ఇక వరదల్లో వందలాది కార్లు, వాహనాలు కొట్టుకుపోయాయి. డజన్ల సంఖ్యలో మనుషులు గల్లంతయ్యారని.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు అధికారులు. గల్లంతైన వారికోసం సహాయక చర్యలు చేపట్టారు అధికారులు.. మరోవైపు ముంపు ప్రాంతాల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. వందేళ్లలో అమెరికా చూసిన అత్యంత భారీ వర్షం ఇదే అంటున్నారు అధికారులు. టెన్నిస్సీలోని హంప్రీ కౌంటీలో 24 గంటల్లో 43 సెంటీమీటర్ల వాన కురిసిందని వాతావరణ శాఖ తెలిపింది.

ఆ ప్రాంతంలో ప్రజలు ఇబ్బంది పడకుండా సహాయక చర్యలు ముమ్మరం చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టులలోని నీటిని ఎప్పటికప్పుడు దిగువకు విడుదల చేస్తున్నట్లు తెలిపారు.