మరో హిందూ యువకుడిని బహిరంగంగా కాల్చి చంపిన బంగ్లాదేశీయులు.. 3 వారాల్లో ఐదో హత్య
అరువా గ్రామానికి చెందిన తుషార్ కాంతి బైరాగి కుమారుడు రాణా ప్రతాప్ (45) ఆందోళనకారుల దాడిలో ఇవాళ మృతి చెందాడని పోలీసులు తెలిపారు.
Rana Pratap (Image Credit To Original Source)
- జెసోర్ జిల్లాలోని మనిరాంపూర్, వార్డు నం.17లో ఘటన
- కోపాలియా బజార్ వద్ద కాల్పులు
- బంగ్లాదేశ్‌లో హిందువులపై కొనసాగుతున్న హింస
Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందువులపై హింస ఆగడం లేదు. సోమవారం సాయంత్రం మరో హిందూ యువకుడిని బహిరంగంగా కాల్చి చంపారు.
జెసోర్ జిల్లాలోని మనిరాంపూర్, వార్డు నం.17లో ఉన్న కోపాలియా బజార్ వద్ద సాయంత్రం 5.45 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. గత 3 వారాల వ్యవధిలో జరిగిన ఐదో హత్య ఇది.
అరువా గ్రామానికి చెందిన తుషార్ కాంతి బైరాగి కుమారుడు రాణా ప్రతాప్ (45) ఆందోళనకారుల దాడిలో ఇవాళ మృతి చెందాడని పోలీసులు తెలిపారు. ప్రత్యక్ష సాక్షులు, పోలీసు వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం.. మార్కెట్‌లో ఉన్న రాణా ప్రతాప్‌పై దుండగులు కాల్పులు జరిపారు. దీతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు.
కాల్పుల అనంతరం ఆ ప్రాంతంలో భయాందోళనలు చెలరేగాయి. మనిరాంపూర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు.
స్టేషన్ ఇన్‌చార్జి రాజియుల్లా ఖాన్ మాట్లాడుతూ.. మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించాల్సి ఉందని తెలిపారు.
దుండగులను గుర్తించి అరెస్టు చేస్తామని పోలీసులు అన్నారు. బంగ్లాదేశ్‌లో నిరసనలు, ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. బంగ్లాదేశ్‌లో ఇంతకుముందు దీపు చంద్ర దాస్, ఖోకన్ చంద్ర దాస్, అమృత్ మండల్, బజేంద్ర బిశ్వాస్ అనే హిందూ వ్యక్తులను ఇదే విధంగా దారుణంగా చంపేశారు.
