ఉదయగిరిలో ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే ఫైట్.. అధికార పార్టీలో హాట్ టాపిక్‌గా అంతర్గత విభేదాలు.. మహిళ ఎంట్రీ..

కొందరు తనను రెండున్నరేళ్లలో తిరిగి అమెరికా పంపుతానని వాట్సప్ స్టేటస్‌ పెట్టుకుంటున్నారని.. అది వాళ్ల వల్ల సాధ్యం కాదంటున్నారు కాకర్ల సురేష్.

ఉదయగిరిలో ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే ఫైట్.. అధికార పార్టీలో హాట్ టాపిక్‌గా అంతర్గత విభేదాలు.. మహిళ ఎంట్రీ..

MLA Kakarla Suresh (Image Credit To Original Source)

Updated On : January 5, 2026 / 10:04 PM IST
  • నెల్లూరు జిల్లా ఉదయగిరి టీడీపీలో అంతర్గత విభేదాలు
  • ఎమ్మెల్యే కాకర్ల సురేష్ VS మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు 
  • వెన్నుపోటు రాజకీయాలకు భయపడేది లేదన్న ఎమ్మెల్యే

Udayagiri TDP: నెల్లూరు జిల్లా ఉదయగిరి టీడీపీలో అంతర్గత విభేదాలు పీక్ లెవల్‌కు చేరాయి. ఎమ్మెల్యే కాకర్ల సురేష్..మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు ఎన్నికలప్పటి నుంచే ఉప్పు-నిప్పుగా ఉంటున్నారట. తనను బద్నామ్‌ చేయాలన్నదే బొల్లినేని టార్గెట్‌ అంటూ ఎమ్మెల్యే రగిలిపోతున్నారు.

అవకాశం దొరికితే అడ్డంగా బుక్ చేసి తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు కాసుకొని కూర్చున్నారని మండిపడుతున్నారు. గత ఎన్నికల్లో తనకు టికెట్ రాకుండా కుట్ర చేసిన నేతతో కలిసి బొల్లినేని..కొత్త జమ్మిక్కులకు తెరలేపారన్నది ఎమ్మెల్యే అలిగేషన్. అయితే ఇలాంటి వెన్నుపోటు రాజకీయాలకు భయపడేది లేదంటూ గట్టి రియాక్ట్ అవుతున్నారు ఎమ్మెల్యే.

Also Read: గూడెం మహిపాల్‌రెడ్డి మళ్లీ బీఆర్ఎస్ వైపు చూస్తున్నారా?

కుట్రలు చేస్తున్నదెవరైనా దూల తీరుస్తానంటూ వార్నింగ్‌లు ఇస్తున్నారు. మీ జాతకాలు తీసుకెళ్లి అధిష్టానం దగ్గర పెడతానంటూ హెచ్చరిస్తున్నారు. ఇలా ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే పొలిటికల్ ఫైట్ నడుస్తుండగానే..రీసెంట్‌గా ఈ ఎపిసోడ్‌లోకి ఓ లేడీ ఎంట్రీ ఇవ్వడం మరింత హాట్ టాపిక్‌గా మారింది. దీంతో ఇటు ఎమ్మెల్యే..ఇటు మాజీ ఎమ్మెల్యే..మధ్యలో లేడీ అన్నట్లుగా ఆసక్తికరంగా మారింది ఇష్యూ.

గత ఎన్నికల్లో బొల్లినేని రామారావుకు నో టికెట్
గత ఎన్నికల్లో బొల్లినేని రామారావు ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడగా.. టికెట్ తెచ్చుకున్న కాకర్ల సురేష్ ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పటి నుంచి ఎమ్మెల్యే కాకర్ల సురేష్, బొల్లినేని రామారావు మధ్య అంతర్గతంగా గ్యాప్ నడుస్తూనే ఉందట. ఏదో ఒక ఘటనతో ఇద్దరి మధ్య అంతర్గత విభేదాలు అప్పుడప్పుడు బయటపడుతూనే ఉన్నాయట.

ఇటీవల ఉదయగిరి నియోజకవర్గంలో కోట్ల రూపాయల నిధులతో రోడ్ల నిర్మాణ పనులు చేపట్టారు. ఆ పనులను ఇతర ప్రాంతాలకు చెందిన కాంట్రాక్టర్లకు అప్పగించారు ఎమ్మెల్యే. ఆ కాంట్రాక్టర్లను బొల్లినేని రామారావు వర్గం బెదిరించిందనే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల అభివృద్ధిని అడ్డుకుంటే..తాట‌తీస్తా..! తొక్కుకుంటూ వెళ్తా..అంటూ..ఎమ్మెల్యే కాక‌ర్ల సురేష్ కామెంట్స్ చేశారట.

బొల్లినేని రామారావును ఉద్దేశించే ఎమ్మెల్యేలా ఇలా మాట్లాడారన్న చర్చ ఉండనే ఉంది. అంతేకాదు గత ఎన్నికల్లో తనకు టికెట్ రాకుండా వ్యతిరేకంగా పనిచేసిన బొబ్బూరు వెంగళరావును..బొల్లినేని దగ్గర చేర్చుకుని కుట్రలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు ఎమ్మెల్యే.

ఈ ఎపిసోడ్‌లోకి మహిళ ఎంట్రీ
అయితే ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య విభేదాలు రచ్చకెక్కి చర్చకు దారితీస్తున్న వేళ..ఈ ఎపిసోడ్‌లోకి వెంగమాంబ అనే మహిళ ఎంట్రీ ఇచ్చింది. ఎమ్మెల్యే కాకర్ల సురేష్‌పై ఆమె ఆరోపణలు చేసిన వీడియో వైరల్ అయింది. కాకర్ల సురేష్‌ను సాఫ్ట్‌ వేర్ ఉద్యోగం ఇప్పించుమని అడిగితే..నీకు ఉద్యోగం కంటే రాజకీయాలే బాగా సూట్ అవుతాయని ఆశ కల్పించారని చెప్పింది.

ఇప్పుడేమో పాలిటిక్స్ నీకెందుకు హ్యాపీగా వ్యాపారం చేసుకో అంటూ మోసం చేశారని వెంగమాంబ ఆరోపించింది. ఆమె ఆరోపణలను ఎమ్మెల్యే కాకర్ల సురేష్..కొట్టి పారేశారు. కొందరు టీడీపీ నేతలే తనపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మహిళలను పురమాయించి వీడియోలు చేయించి కుట్ర చేస్తున్నారని ఫైరయ్యారు. తనపై సొంత పార్టీ నేతలు చేస్తున్న కుట్రలను చంద్రబాబు, లోకేశ్ దృష్టికి తీసుకెళ్తానంటున్నారు.

అంతేకాదు కొందరు తనను రెండున్నరేళ్లలో తిరిగి అమెరికా పంపుతానని వాట్సప్ స్టేటస్‌ పెట్టుకుంటున్నారని.. అది వాళ్ల వల్ల సాధ్యం కాదంటున్నారు కాకర్ల సురేష్. ఇక్కడే ఉంటా..కుట్రలు చేస్తున్న ఒక్కొక్కరి దూల తీరుస్తా..అంటూ హెచ్చరించారు. అయితే వెంగమాంబ అనే మహిళ ఆరోపణల వెనక మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు, టీడీపీ నేత వెంగళరావులు ఉన్నారన్న గుసగుసలు కాక రేపుతున్నాయి. ఉదయగిరిలో తమ్ముళ్ల తగువకు అధిష్టానం ఎలా చెక్ పెడుతుందో చూడాలి మరి.