గూడెం మహిపాల్‌రెడ్డి మళ్లీ బీఆర్ఎస్ వైపు చూస్తున్నారా?

మహిపాల్ రెడ్డి అనుచరుల్లో చాలామంది తిరిగి బీఆర్ఎస్‌లోకి వెళ్తేనే బాగుంటుందని అభిప్రాయపడినట్టు సమాచారం.

గూడెం మహిపాల్‌రెడ్డి మళ్లీ బీఆర్ఎస్ వైపు చూస్తున్నారా?

Gudem Mahipal Reddy (Image Credit To Original Source)

Updated On : January 5, 2026 / 8:42 PM IST
  • కాంగ్రెస్‌లో ఇమడలేక ఇబ్బంది పడుతున్నారా?
  • మంత్రి దామోదరతో గూడెంకు పొసగడం లేదా?
  • త్వరలో కారెక్కేందుకు రెడీ అవుతున్నారా?

Gudem Mahipal Reddy: ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందన్న సిచ్యవేషన్‌లో ఉన్నారట ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి. పటాన్‌చెరు ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ కొట్టిన గూడెం..గో విత్ ది ఫ్లో అంటూ హస్తం పార్టీ గూటికి చేరి ఆగమాగం అవుతున్నారట. 2014, 2018, 2023 ఎన్నికల్లో వరుసగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచారాయన.

అయితే 2023లో బీఆర్ఎస్ అధికారంలోకి రాకపోయే సరికి కారు దిగి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. అక్రమ మైనింగ్ కేసులు ఓ వైపు, ఈడీ కేసులు మరోవైపు, తమ్ముడు మధుసూదన్ రెడ్డి జైలుకు వెళ్లడం ఇంకోవైపు..ఇలా అన్ని సమస్యలు ఒక్కసారిగా చుట్టుముట్టడంతో సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు మహిపాల్‌ రెడ్డి.

Also Read: అసెంబ్లీలోనే సర్కార్‌పై అటాక్ చేస్తే బాగుండేదంటున్న బీఆర్ఎస్‌ నేతలు.. ఎందుకంటే?

కేసుల బాధ నుంచి ఉపశమనం పొందుదామని కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే అక్కడ మహిపాల్ రెడ్డికి కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇంచార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్‌తో రాజకీయ విబేధాలు ఒక వైపు, పార్టీ ఫిరాయింపుల కేసు మరోవైపు ఆయనను ఆందోళనకు గురిచేస్తున్నాయట.

స్థానిక కాంగ్రెస్ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత?
దీంతో పటాన్‌చెరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నప్పటికీ.. కాంగ్రెస్‌ పార్టీ కార్యక్రమాలకు మాత్రం దూరంగా ఉంటున్నారు మహిపాల్ రెడ్డి. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు వెళ్దామని ఆయన అనుకున్నా.. స్థానిక కాంగ్రెస్ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోందట.

పటాన్‌చెరు నియోజవర్గంలోని కాంగ్రెస్ నేతలు కాట శ్రీనివాస్, నీలం మధుతో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి ఏ మాత్రం పడటం లేదు. అంతే కాకుండా మంత్రి దామోదర రాజనర్సింహకు, మహిపాల్ రెడ్డికి మధ్య విబేధాలు తారాస్థాయికి చేరినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి నుంచి కూడా అంతగా సహకారం అందడం లేదని మహిపాల్ రెడ్డి తన సన్నిహితుల దగ్గర వాపోతున్నారట.

ఏదో అనుకుని కాంగ్రెస్ పార్టీలోకి వస్తే మరెదో జరుగుతోందని ఆయన తెగ మధనపడిపోతున్నాట. అందుకే సర్పంచ్ ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వకుండా సైలెంట్‌గా ఉన్నారని, ప్రచారం కూడా చేయలేదని చెబుతున్నారు. ఇంకొన్ని రోజులు పరిస్థితి ఇలానే ఉంటే అసలుకే మోసం వస్తుందని ఆందోళన చెందుతున్నారట.

అనవసరంగా కాంగ్రెస్ పార్టీలో చేరానని ఫీల్ అవుతున్నారట మహిపాల్ రెడ్డి. త్వరలోనే ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవడాలని భావిస్తున్నారట. ఈ మధ్యే తన అనుచరులతో కీలక సమావేశం నిర్వహించిన మహిపాల్ రెడ్డి కాంగ్రెస్‌లో కొనసాగాలా..తిరిగి బీఆర్ఎస్ గూటికి వెళ్లాలా అన్నదానిపైనే చర్చించారని తెలుస్తోంది.

మహిపాల్ రెడ్డి అనుచరుల అభిప్రాయం ఏంటి?
మహిపాల్ రెడ్డి అనుచరుల్లో చాలామంది తిరిగి బీఆర్ఎస్‌లోకి వెళ్తేనే బాగుంటుందని అభిప్రాయపడినట్టు సమాచారం. ఆయన కూడా అనుచరుల అభిప్రాయంతో ఏకీభవించినట్లు చెబుతున్నారు. అయితే తాను కారెక్కే కంటే ముందు తన అనుచరులను బీఆర్ఎస్ పార్టీలోకి పంపించాలని డిసైడ్ అయ్యారట గూడెం.

ఈ ప్లాన్‌లో భాగంగానే పలువురు మాజీ ప్రజా ప్రతినిధులకు హరీశ్‌రావు సమక్షంలో గులాబీ కండువాలు కప్పించారనే ప్రచారం జరుగుతోంది. పార్టీ ఫిరాయింపుల కేసులో తనకు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చినా..ఇంకా సుప్రీంకోర్టులో కేసు ఉంది పెండింగ్‌లో ఉండటంతో ఏమైనా ఇబ్బందులు వస్తాయా అన్నది తేలాక మహిపాల్ రెడ్డి తిరిగి గులాబీ పార్టీలోకి వెళ్తారన్న ప్రచారం జరుగుతోంది.

ఇప్పటికే మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ ముఖ్యనేతలకు టచ్‌లో ఉన్నారని అంటున్నారు. ఈ క్రమంలోనే తన అనుచరులను ఒక్కొక్కరిని కారెక్కిస్తున్నారని టాక్. త్వరలోనే గూడెం మహిపాల్‌రెడ్డి కూడా గులాబీ కండువా కప్పుకోవడం ఖాయమనే గుసగుసలు వినిపిస్తున్నాయి.