వారెవ్వా.. పురుషులకు వీర్య నిరోధక మాత్రలు.. సక్సెస్‌ అయిన శాస్త్రవేత్తలు

పురుషుల్లో ప్రతిరోజు కోట్లాది వీర్యకణాలు ఉత్పత్తి అవుతాయి.

వారెవ్వా.. పురుషులకు వీర్య నిరోధక మాత్రలు.. సక్సెస్‌ అయిన శాస్త్రవేత్తలు

Updated On : April 8, 2025 / 10:10 AM IST

గర్భనిరోధక మాత్రలు అనగానే అవి మహిళలు తీసుకునే ట్యాబ్లెట్లని భావిస్తాం. భవిష్యత్తులో మాత్రం ఆ మాత్రలను పురుషులు కూడా వేసుకునే అవకాశం ఉంటుంది. గర్భనిరోధకత కోసం పురుషులు ప్రస్తుతం కండోమ్స్‌ వాడుతున్నారు. అలాగే, వ్యాసెక్టమీ ఆపరేషన్‌ చేయించుకుంటున్నారు.

భవిష్యత్తులో మాత్రం పిల్లలు ఇప్పట్లో వద్దనుకుని భావించే పురుషులు మాత్రలు వేసుకోవచ్చు. మేల్‌ బర్త్‌ కంట్రోల్‌ పిల్స్‌ను యూనివర్సిటీ ఆఫ్‌ మిన్నెసొటా పరిశోధకులు అభివృద్ధి చేశారు.

కొలంబియా వర్సిటీతో పాటు శాన్‌ఫ్రాన్సిస్కోకు సంబంధించిన యువర్‌ ఛాయిస్‌ థెరప్యూటిక్స్‌ పరిశోధకులతో కలిసి యూనివర్సిటీ ఆఫ్‌ మిన్నెసొటా పరిశోధకులు వైసీటీ 529 అనే హార్మోన్‌ రహిత గర్భనిరోధక ట్యాబ్లెట్‌ను అభివృద్ధి చేశారు.

ఇప్పటికే ఎలుకలతో పాటు సైనోమోల్గస్‌ కోతులపై ఆ మాత్రలు 99 శాతం పనిచేశాయని పరిశోధకులు తాజాగా తెలిపారు. ఈ మాత్రలు పురుషులలో వీర్యకణాల తయారీకి అవసరమయ్యే విటమిన్‌ ఏను వృషణాలకు అందకుండా చేస్తాయి.

Also Read: శాంసంగ్ నుంచి కేక పెట్టించే ఫీచర్లతో వస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ అయ్యే తేదీ ఇదే!

దీంతో వీర్యం ఉత్పత్తి ఆగుతుంది. ఈ ట్యాబ్లెట్‌ టెస్టోస్టిరాన్‌ స్థాయులపై ప్రభావం చూపదు. ఈ ప్రయోగాలకు చెందిన ఫలితాల రిపోర్టును కమ్యూనికేషన్స్‌ మెడిసిన్‌ జర్నల్‌లో ప్రచురించారు. ప్రయోగాల్లో భాగంగా ఎలుకల్లో ఈ ఔషధం ఆపేసిన 6 వారాల్లో తిరిగి వీర్య కణాల సంఖ్య గత స్థాయికి చేరుకుంది.

ఇందుకు కోతుల్లో దాదాపు 15 వారాలు పడుతోంది. ఈ ఔషధం వల్ల అతి తక్కువ దుష్ప్రభావాలే వచ్చాయని పరిశోధకులు గుర్తించారు. ఈ ఫలితాల తర్వాత మనుషులపై మొదటి దశ ప్రయోగాలు నిర్వహించారు. ఈ మాత్రలు మనుషులు తీసుకోవడం కూడా సురక్షితమేనని గుర్తించామని పరిశోధకులు అన్నారు.

మనుషుల మీద జరపనున్న రెండో దశ ప్రయోగాలను న్యూజిలాండ్‌లో నిర్వహించనున్నారు. పురుషుల్లో ప్రతిరోజు కోట్లాది వీర్యకణాలు ఉత్పత్తి అవుతాయి. దీంతో ఇన్నాళ్లు పురుషులు వేసుకునే గర్భనిరోధకత మాత్రలను తీసుకురావడంలో పరిశోధకులు సక్సెస్ సాధించలేకపోయారు. ఇప్పుడు ఈ విషయంలో సక్సెస్‌ అవుతున్నారు.