100 Rupees House: జస్ట్ 100 రూపాయలకే ఇల్లు.. ప్రభుత్వం బంపర్ ఆఫర్.. కండీషన్స్ అప్లయ్.. ఇంకా..
ఒక ఇల్లు కొనాలన్నా లేదా నిర్మించాలన్నా లక్షలు, కోట్ల రూపాయలు ఉండాల్సిందే.

100 Rupees House: సొంతిల్లు ప్రతి మనిషి కల. ప్రతీ వ్యక్తి తన కంటూ సొంతంగా ఇల్లు ఉండాలని ఆశిస్తాడు. సొంతంగా ఇల్లు ఉందంటే దాని వల్ల వచ్చే భరోసానే వేరుగా ఉంటుంది. ఇక జీవితం అంతా హ్యాపీగా నడిచిపోతుందనే నమ్మకం కలుగుతుంది. అందుకే, సంపాదించిన డబ్బులో కొంత మొత్తాన్ని పొదుపు చేసి మరీ తమ తాహతుకు తగ్గ ఇంటిని కొనుగోలు చేస్తారు, లేదా నిర్మించుకుంటారు. అయితే.. ఒక ఇల్లు కొనాలన్నా లేదా నిర్మించాలన్నా లక్షలు, కోట్ల రూపాయలు ఉండాల్సిందే. అది అందరికీ సాధ్యమయ్యే పని కాదు.
అంత డబ్బు అందరి దగ్గర ఉండదు. ఇల్లు అనేది డబ్బుతో కూడుకున్న వ్యవహారమే. అలాంటి ఈ రోజుల్లో కేవలం 100 రూపాయలకే ఇల్లు వస్తుందంటే మీరు నమ్ముతారా? ఏంటి షాకయ్యారా? వంద రూపాయలకు ఇల్లేంటి? జోక్ చేశారా? అనే సందేహం కలిగి ఉండొచ్చు. కానీ, ఇది నిజమే.. జస్ట్ 100 రూపాయలకు ఇల్లు కొనుగోలు చేయొచ్చు. అయితే ఈ బంపర్ ఆఫర్ మన దగ్గర కాదు.. ఫ్రాన్స్ లో..
సొంతింటి కోసం కలలు కంటున్న వారి కోసం ఫ్రాన్స్ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. అక్కడ అంబర్ట్ అనే పట్టణంలో కేవలం 100 రూపాయలు చెల్లించి ఇల్లు కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పించింది. ఈ బంపర్ ఆఫర్ వెనక పెద్ద కారణమే ఉంది. ఆ వివరాల్లోకి వెళితే..
అంబర్ట్ ఓ ప్రశాంతమైన పట్టణం. అయితే అక్కడ రోజురోజుకు జనాభా తగ్గిపోతోంది. దీంతో అధికారులు రంగంలోకి దిగారు. జనాభాను పెంచడానికి ఏం చేయాలా అని ఆలోచన చేశారు. అలా పుట్టుకొచ్చిందే ఈ అదిరిపోయే ఆఫర్.
మెరుగైన మౌలిక సదుపాయాల కోసం ప్రజలు నగరాల వైపు తరలి వెళ్లడంతో 19వ శతాబ్దం నుంచి ఈ ప్రాంతంలో జనాభా తగ్గుతూ వస్తోందట. ప్రస్తుతం ఈ పట్టణంలో 6వేల 500 మంది నివాసం ఉంటున్నారు. జనాభాను మరింత పెంచడానికి అక్కడి అధికారులు ఐదేళ్ల ప్రణాళికను రూపొందించారు. ఇందులో భాగంగానే ప్రజలకు 100 రూపాయలకే ఇల్లు కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తున్నారు. జనాభాను పునరుద్ధరించడం, స్థానిక పాఠశాలలు, వ్యాపారాలు వంటి వాటిని అభివృద్ధి చేయడం వంటి లక్ష్యాలతో ఈ ఆలోచన చేశారట.
ఇంటి కొనుగోలుకు 100 రూపాయలు మాత్రమే అవుతున్నా.. శతాబ్దాల నాటి అక్కడి భవనాలను పునరుద్ధరించడానికి దాదాపు 20 లక్షల నుంచి 50 లక్షలు ఖర్చయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. ఇంటిని కొనుగోలు చేసే సమయంలోనే కొనుగోలుదారులు కొన్ని హామీలు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ఇంటి పునరుద్ధరణకు కట్టుబడి ఉంటామని తెలపాలి.
ఇక భవనాల పునరుద్ధరణకు డబ్బు కావాలనుకుంటే అక్కడి అధికారులు సాయం చేస్తారు. తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తారు. గ్రాంట్ల రూపంలో ఆర్థిక సాయం చేస్తారు. ఇక ఇంటిని కొన్నాక కనీసం మూడేళ్ల పాటు అక్కడే నివాసం ఉండాలి. ఈ ప్రాజెక్ట్‌ను అంబర్ట్స్ టౌన్ హాల్ పర్యవేక్షిస్తోంది. ఇల్లు కొనాలి అనుకునే వారు వారి ద్వారా అప్లయ్ చేసుకోవాలి. ఇక పోతే.. ఫ్రాన్స్ ప్రజలు మాత్రమే కాదు విదేశీయులు కూడా అంబర్ట్‌లో ఇళ్లను కొనుగోలు చేసే అవకాశం కల్పించారు.
అంబర్ట్ పట్టణంలోని ఇళ్లు చాలా చాలా పెద్దవి. అంతేకాదు చాలా పాతవి కూడా. అవి పేలవమైన స్థితిలో ఉన్నాయి. వాటికి పెద్ద ఎత్తున పునరుద్ధరణ అవసరం. పైకప్పు మరమ్మతులు, విద్యుత్ వ్యవస్థలను తిరిగి వైరింగ్ చేయడం నుండి గోడలను సరిచేయడం వరకు ఇలా చాలా పనులను చేపట్టాల్సి ఉంటుంది. ఆ ఇంటిని నివాసయోగ్యంగా మార్చడానికి అయ్యే మొత్తం ఖర్చు గణనీయంగా ఉండొచ్చు.
కండీషన్స్ అప్లయ్..
* ఈ ఇళ్లు మొదటిసారి కొనుగోలు చేసే వారి కోసం మాత్రమే ఉద్దేశించబడ్డాయి. (అంటే గతంలో ఇల్లు లేని వారు మాత్రమే ఇక్కడ ఇళ్ళు కొనడానికి అర్హులు).
* ఇప్పటికే ఇల్లు కలిగి ఉన్న వారు లేదా రెండవసారి కొనుగోలు చేస్తున్న వ్యక్తులు ఈ పథకానికి అనర్హులు.
* మరో ముఖ్యమైన షరతు ఏమిటంటే, కొనుగోలుదారులు ఆ ఇంటిని నివాసయోగ్యంగా మార్చిన తర్వాత కనీసం మూడు సంవత్సరాలు ఇంట్లో నివాసం ఉండాలి.
* ఇంటిని అద్దెకు ఇవ్వకూడదు.
* కొనుగోలుదారులు ఈ నియమాలను పాటించడంలో విఫలమైతే ప్రభుత్వం గ్రాంట్‌ను రద్దు చేయొచ్చు. అంతేకాదు జరిమానా కూడా విధించొచ్చు.
100 రూపాయలకే ఇల్లు.. ఇది బంపర్ ఆఫరే కావొచ్చు. అయితే, అక్కడ ఇళ్లను కొనుగోలు చేయడం కొనుగోలుదారులకు లాభదాయకం కాకపోవచ్చే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎందుకంటే పైకప్పు, గోడలు, విద్యుత్ వ్యవస్థలను మెరుగుపరచడం వంటి వాటి పునరుద్ధరణ, మరమ్మత్తు పనులకు వారు భారీగా డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుందట.