Hush money case : హుష్ మనీ కేసులో డొనాల్డ్ ట్రంప్‌కు బిగ్ రిలీఫ్.. దోషిగా తేలినా జైలు శిక్ష, జరిమానా విధించని కోర్టు!
Hush money Case : హుష్ మనీ కేసులో ట్రంప్ దోషిగా తేలినా.. ఆయనకు ఎలాంటి జైలు శిక్ష, జరిమానా విధించలేదు. దోషిగా తేలిన తొలి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ నిలువనున్నారు.

Hush money Case
Hush Money Case : హుష్ మనీ కేసులో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌కు భారీ ఊరట లభించింది. ఆయనకు అన్‌కండిషనల్ డిశ్చార్జ్ విధిస్తున్నట్లు కోర్టు ప్రకటించింది. ఈ హుష్ మనీ కేసులో ట్రంప్ దోషిగా తేలినా.. ఆయనకు ఎలాంటి జైలు శిక్ష, జరిమానా విధించలేదు. తద్వారా దోషిగా తేలిన తొలి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ నిలువనున్నారు. ఈ నెల 20న అమెరికా కొత్త అధ్యక్షుడుగా ట్రంప్ బాధ్యతలు చేపట్టనున్నారు. డొనాల్డ్ ట్రంప్‌ను కోర్టు దోషిగా తేల్చింది.
రెండో పర్యాయం ట్రంప్ అధ్యక్ష పదవి చేపట్టనున్న నేపథ్యంలో తీర్పును వెలువరిస్తూ న్యాయమూర్తి మార్చెన్ ఈ కేసును అసాధారణమైన కేసుగా అభివర్ణించారు. ఈ కేసులో పెద్ద వైరుధ్యం ఉందన్నారు. అయినప్పటికీ, ట్రంప్‌కు ఎలాంటి శిక్ష పడదని న్యాయమూర్తి అన్నారు. ఇప్పుడు వైట్‌హౌస్‌కు వెళ్లడంలో ఆయనకు ఎలాంటి అడ్డంకి లేదని తేలిపోయింది. దీంతో ఈ కేసు కూడా ముగిసినట్టే. అయితే, ఒక కేసులో దోషిగా తేలిన తర్వాత కూడా ప్రమాణ స్వీకారం చేయనున్న మొదటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కానున్నారు.
ట్రంప్‌కు జైలుశిక్ష, జరిమానా లేదు :
మాన్‌హట్టన్ క్రిమినల్ కోర్టులో విచారణ సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. జస్టిస్ జువాన్ మార్చన్ ట్రంప్‌కు షరతులు లేకుండానే విడుదల చేశారు. ట్రంప్ కచ్చితంగా దోషిగా తేలినప్పటికీ ఆయనకు ఎలాంటి శిక్ష విధించలేదు. పైగా జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదు. జరిమానా కూడా చెల్లించాల్సినక్కర్లేదు.

Hush money Case ( Image Source : Google )
ఇదే విషయాన్ని కోర్టు హాలులో న్యాయమూర్తి తీర్పు చెప్పారు. 10 రోజుల తర్వాత అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో డొనాల్డ్ ట్రంప్ ఓ అడల్ట్ స్టార్‌కి లక్షా 30 వేల డాలర్లు చెల్లించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.
నేనేం తప్పు చేయలేదు.. నిర్దోషిని :
విచారణ సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ తానేమీ తప్పు చేయలేదని అన్నారు. మళ్లీ అధ్యక్షుడు కాకూడదని ఎన్నికల ముందు తనపై కుట్ర జరిగిందని ట్రంప్ ఆరోపించారు. విచారణ సమయంలో ప్రాసిక్యూటర్ జాషువా స్టెగ్లాస్ ఆయన ప్రవర్తనను తీవ్రంగా ఖండించారు. ఈ విచారణలో చట్టబద్ధతను అణగదొక్కడానికి ట్రంప్ మొత్తం ప్రచారాన్ని నడిపారని ఆయన అన్నారు. ఎన్నికల ప్రచారంలో తాను చేసిన వ్యాఖ్యలను కూడా ఉదహరించారు. అంతకుముందు ట్రంప్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా, ఆయన శిక్షను నిలిపివేయాలని కోరారు. అయితే, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ట్రంప్ అప్పీల్‌ను తిరస్కరించారు.
గతేడాది మే నెలలోనే డొనాల్డ్ ట్రంప్‌కు శిక్ష పడింది. ట్రంప్‌తో తనకు శారీరక సంబంధాలు ఉన్నాయని పోర్న్ స్టార్ డేనియల్స్ ఆరోపించగా, ఆ విషయాన్ని దాచిపెట్టి డబ్బులు చెల్లించాలని ట్రంప్ చూశారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. తాను నిర్దోషిని, ఏ తప్పు చేయలేదని న్యాయమూర్తి ఎదుట ట్రంప్ ప్రస్తావించారు. అధ్యక్ష ఎన్నికల్లో లక్షలాది ఓట్లు వచ్చాయని, తానే విజయం సాధించినట్టు తెలిపారు.
హుష్ మనీ కేసు ఏంటి? :
డొనాల్డ్ ట్రంప్ తనతో దశాబ్దం క్రితం లైంగిక సంబంధాలు పెట్టుకున్నాడని అడల్ట్ స్టార్ స్టార్మీ డేనియల్స్ ఆరోపించారు. 2016లో అధ్యక్ష ఎన్నికలకు ముందు తాను మౌనంగా ఉండేందుకు ట్రంప్ ఆమెకు 1.3 లక్షల డాలర్లు చెల్లించారు. ఆ తర్వాత, చెల్లింపును దాచిపెట్టేందుకు ట్రంప్ వ్యాపార రికార్డులను తప్పుగా మార్చినందుకు దోషిగా తేలింది. మొత్తం 34 అంశాల్లో ట్రంప్‌పై అభియోగాలు నమోదయ్యాయి. 6 వారాల విచారణ తర్వాత ట్రంప్‌పై మోపిన అభియోగాలన్నీ వాస్తవమేనని 12 మంది జడ్జీలతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది.
Read Also : CM Revanth Reddy : రైతు భరోసాలో అలా జరక్కూడదు..! కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు..