సంజీవని HCQ, ప్రపంచాన్ని ఆదుకునేందుకు దేశంలో భారీగా హైడ్రాక్సీక్లోరోక్విన్ మాత్రల ఉత్పత్తి

హైడ్రాక్సీక్లోరోక్విన్(HCQ). యావత్ ప్రపంచాన్ని కరోనా వైరస్ మహమ్మారి గడగడలాడిస్తున్న వేళ.. అన్ని దేశాలు సంజీవనిలా చూస్తున్న మెడిసిన్ హెచ్ సీక్యూ. మలేరియాను కట్టడి చేసే ఈ డ్రగ్.. ఇప్పుడు కరోనా చికిత్సలో ప్రభావవంతంగా పని చేస్తోంది. దీంతో అందరి చూపు దీనిపై పడింది. కరోనా దెబ్బతో కుదేలైన దేశాలు భారత్ వైపు చూస్తున్నాయి. సంజీవని లాంటి హెచ్ సీక్యూని తమకు ఇవ్వాలని వేడుకుంటున్నాయి. ప్రపంచ ఫార్మా మార్కెట్‌లో ‘గేమ్ చేంజర్’గా మారిన హైడ్రాక్సీక్లోరోక్విన్ (హెచ్‌సీక్యూ) మాత్రల తయారీలో భారత్ దూసుకుపోతోంది. కరోనా వైరస్ బారినపడి అల్లాడుతున్న అమెరికా సహా పలు దేశాలకు ఈ మాత్రలను ఎగుమతి చేయడంతోపాటు దేశీయ అవసరాలను సమకూర్చే దిశగా ఉత్పత్తిని గణనీయంగా పెంచింది. అంతర్జాతీయ మ్యాగజైన్ ‘ఫోర్బ్స్’ తన అధికారిక వెబ్‌సైట్‌లో ఈ విషయాలు తెలిపింది.
నెలకు 15-20 లక్షల టన్నులు ఉత్పత్తి:
హైడ్రాక్సీక్లోరోక్విన్ మాత్రల తయారీకి ముడిసరుకు అయిన హైడ్రాక్సీ ఫాస్పేట్ నిల్వలు అధికంగా గల భారత ఫార్మా కంపెనీలు ప్రపంచాన్ని ఆదుకునేందుకు హెచ్‌సీక్యూ మాత్రల తయారీకి నడుం బిగించాయని మ్యాగజైన్ తెలిపింది. దేశీయ ఫార్మా వర్గాల సమాచారం ప్రకారం నెలకు 30 లక్షల మాత్రల డిమాండ్ మాత్రమే ఉన్నా ప్రస్తుత పరిస్థితుల్లో సునాయసంగా నెలకు 15-20 లక్షల టన్నులు ఉత్పత్తి చేయగలమని భారతీయ ఫార్మా వర్గాలు ధీమాగా ఉన్నాయని ఆ మ్యాగజైన్ వెల్లడించింది.
HCQ మాత్రల తయారీకి రంగంలోకి 2 కంపెనీలు:
వాస్తవానికి ప్రపంచ డిమాండ్‌లో 70 శాతం హైడ్రాక్సీక్లోరోక్విన్ మాత్రలు సరఫరా చేయగలిగిన సామర్థ్యంగల మన దేశం ఈ ఏడాది మార్చి 25న ఈ మాత్రల ఎగుమతులపై నిషేధం విధించింది. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విజ్ఞప్తి మేరకు ఏప్రిల్ 8న ఈ మాత్రల ఎగుమతులపై నిషేధం ఎత్తేసింది. దీంతో అమెరికాతోపాటు ప్రపంచంలోని పలు దేశాలు కరోనా చికిత్సలు చేసేందుకు వీలుగా భారత్ ఈ మాత్రలను ఎగుమతి చేస్తోంది. ఫోర్బ్స్ కథనం ప్రకారం ఒక్క అమెరికానే 29 లక్షల డోసుల మాత్రలను భారత్ నుంచి కొనుగోలు చేసింది. దీంతో దేశీయ అవసరాల కోసం ఇబ్బంది రాకుండా ప్రముఖ కంపెనీలైన జైడస్ కాడిలా(zydus cadila), ఇప్‌కాల్యాబ్స్(ipca labs) రంగంలోకి దిగాయి. ఈ రెండు కంపెనీలు ఈ ఏడాది మార్చి 27 నుంచే హైడ్రాక్సీక్లోరోక్విన్ మాత్రల తయారీని ముమ్మరం చేశాయి. దేశంలో జరుగుతున్న ఈ మాత్రల తయారీలో 69 శాతం ఈ రెండు కంపెనీలే ఉత్పత్తి చేస్తున్నాయి. దేశీయంగా హెచ్‌సీక్యూ మాత్రల అవసరాలు తీర్చడమే లక్ష్యంగా ఈ సంస్థలు పనిచేస్తున్నాయని ఫోర్బ్స్ పేర్కొంది.
గతంలో నెలకు 3 టన్నులు.. ఇప్పుడు 50 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి:
ఈ రెండు కంపెనీలు హైడ్రాక్సీక్లోరోక్విన్ తయారీలో దూసుకుపోతున్నాయని ఫోర్బ్స్ ప్రశంసించింది. కాడిలా సంస్థ గతంలో నెలకు 3 టన్నుల హైడ్రాక్సీక్లోరోక్విన్ ట్యాబ్లెట్లు తయారు చేసేదని, ఇప్పుడు 20-30 మెట్రిక్ టన్నులు ఉత్పత్తి చేస్తోందని వెల్లడించింది. భవిష్యత్తులో 40-50 మెట్రిక్ టన్నులైనా ఉత్పత్తికి వెనుకాడేది లేదని, ఈ మాత్రల ఉత్పత్తి తప్ప తమకు ఎలాంటి కర్తవ్యం లేదని ఆ సంస్థ ప్రతినిధి షర్విల్ పటేల్ ఫోర్బ్స్‌కు వెల్లడించారు. ఇక ఇప్‌కాల్యాబ్స్ కూడా క్లోరోక్విన్ మాత్రల తయారీని ముమ్మరం చేసింది. 20 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల ఈ కంపెనీ నెలకు 10 కోట్ల ట్యాబ్లెట్లు తయారు చేయగలదు. కానీ ఇప్పుడు నెలకు 26 మెట్రిక్ టన్నుల తయారీ దిశగా ముందుకెళుతోంది.
కరోనా ట్రీట్ మెంట్ లో కీలకంగా మారిన HCQ:
ఈ రెండు కంపెనీలే కాకుండా గోవాకు చెందిన వ్యాలెస్ లాంటి ఫార్మా కంపెనీలు కూడా హెచ్‌సీక్యూ మాత్రల తయారీకి ఆసక్తిగా ఉన్నాయని, అయితే హైడ్రాక్సీ ఫాస్పేట్ ముడిసరుకును రవాణా చేసుకునే సదుపాయం ఈ కంపెనీలకు లేదని ఫోర్బ్స్ తెలిపింది. ఈ మాత్రలు కరోనాను పూర్తిగా నయం చేయగలవని శాస్త్రీయంగా నిరూపితం కానప్పటికీ మలేరియా మహమ్మరిని కట్టడి చేసిన క్లోరోక్విన్ మాత్రలను విస్తృతంగా తయారు చేయగల శక్తి భారతీయ ఫార్మా రంగానికి ఉందని ఇండియన్ డ్రగ్స్ మ్యానుఫాక్చరర్స్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అశోక్ కుమార్ మదన్ ఫోర్బ్స్‌కు చెప్పారు.