Danish Kaneria: భారత్ నా మాతృభూమి.. ఇండియా ఒక దేవాలయం.. పాకిస్తాన్ మాజీ క్రికెటర్..

క్రికెట్ ఆడుతున్న రోజుల్లో మతపరమైన వివక్షను, బలవంత మతమార్పిడి ప్రయత్నాలను కూడా ఎదుర్కొన్నాను.

Danish Kaneria: భారత్ నా మాతృభూమి.. ఇండియా ఒక దేవాలయం.. పాకిస్తాన్ మాజీ క్రికెటర్..

Updated On : October 4, 2025 / 11:36 PM IST

Danish Kaneria: తాను ఇండియన్ సిటిజన్ షిప్ కోసం ప్రయత్నిస్తున్నట్లు వస్తున్న ఆరోపణలపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా తీవ్రంగా స్పందించారు. ఆ ఆరోపణలను ఆయన ఖండించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. భారత్ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

పాకిస్తాన్ ప్రభుత్వం, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తనపై ఎంత వివక్ష చూపించినా.. పాక్ ప్రజలు మాత్రం తనను ఎంతో ప్రేమించారని కనేరియా తెలిపారు. పాకిస్తాన్ తన జన్మభూమి అయితే, భారత్ మాతృభూమి అని ఆయన అన్నారు. అంతేకాదు ఇండియా ఒక దేవాలయం అని అభివర్ణించారు. భవిష్యత్తులో ఇండియన్ సిటిజన్ షిప్ కావాలనుకుంటే అందుకోసం సీఏఏ అమల్లో ఉందని డానిష్ కనేరియా గుర్తు చేశారు.

నేను పాక్ ప్రజల నుండి ప్రేమను పొందినప్పటికీ, క్రికెట్ ఆడుతున్న రోజుల్లో మతపరమైన వివక్షను, బలవంత మతమార్పిడి ప్రయత్నాలను కూడా ఎదుర్కొన్నాను అని కనేరియా వాపోయారు. వికెట్ కీపర్ అనిల్ దల్పత్ తర్వాత పాకిస్తాన్ తరపున ఆడిన రెండవ హిందువు డానిష్ కనేరియా. 44 ఏళ్ల కనేరియా 61 టెస్టులు, 18 వన్డేల్లో ఆడారు. దశాబ్దానికి పైగా సాగిన కెరీర్‌లో 276 వికెట్లు తీసుకున్నారు.

”ఇటీవల, చాలా మంది నన్ను ప్రశ్నించడం.. నేను పాకిస్తాన్ గురించి ఎందుకు మాట్లాడటం లేదు.. భారత్ అంతర్గత విషయాలపై ఎందుకు వ్యాఖ్యానిస్తున్నాను? కొందరు నేను భారతీయ పౌరసత్వం కోసం ఇదంతా చేస్తున్నానని కూడా ఆరోపిస్తున్నారు. ఆరోపణలను సరిదిద్దడం ముఖ్యమని నేను భావిస్తున్నాను. పాకిస్తాన్ ప్రజల నుండి నేను ప్రేమను పొందాను. కానీ ఆ ప్రేమతో పాటు పాకిస్తాన్ అధికారులు, PCB నుండి కూడా నేను తీవ్ర వివక్షను ఎదుర్కొన్నాను. బలవంతపు మతమార్పిడి ప్రయత్నాలతో సహా” అని కనేరియా తన పోస్టులో రాసుకొచ్చారు.

Also Read: అందుకే రోహిత్ శ‌ర్మ‌ను కెప్టెన్సీ నుంచి త‌ప్పించాం.. అజిత్ అగార్క‌ర్ కామెంట్స్‌..