India Pakistan Talks: DGMOల చర్చలు.. పాకిస్తాన్‌కు భారత్ మాస్ వార్నింగ్..! పాక్‌కి పెట్టిన కండీషన్స్ ఇవే..
భారత భూభాగంలోకి డ్రోన్లు అనుమతించమని ఇండియా తేల్చి చెప్పింది.

India Pakistan Talks : భారత్ పాకిస్తాన్ డీజీఎంవోల మధ్య చర్చలు ముగిశాయి. హాట్ లైన్ ద్వారా చర్చలు జరిగాయి. పాకిస్తాన్ కు మాస్ వార్నింగ్ ఇచ్చింది భారత్. పాక్ ముందు పలు కండీషన్స్ పెట్టింది.
కాల్పుల విరమణ ఉల్లంఘనకు సంబంధించి పాక్ ను ప్రశ్నించింది భారత్. ఉగ్రవాదాన్ని అరికట్టడానికి భారత్ కు సహకరించాలని డీజీఎంవో కోరారు. భారత పౌరులను లక్ష్యంగా చేసుకొని కాల్పులకు పాల్పడొద్దని పాక్ కు తేల్చి చెప్పారు. భారత భూభాగంలోకి డ్రోన్లు అనుమతించమని ఇండియా తేల్చి చెప్పింది. తొలి రౌండ్ చర్చలు దాదాపు గంట సేపు సాగాయి.
ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇరు దేశాలు కాల్పుల విరమణ ప్రకటించిన 2 రోజులకు.. భారత్ పాక్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMOలు) స్థాయి చర్చలు సోమవారం సాయంత్రం జరిగాయి. ముందుగా.. డీజీఎంవోలు ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు చర్చలు జరపాల్సి ఉండగా అది వాయిదా పడింది.
భారత సైన్యం డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్, పాకిస్తాన్ సైన్యం డీజీఎంఓ మేజర్ జనరల్ కాషిఫ్ అబ్దుల్లా మధ్య హాట్‌లైన్ ద్వారా చర్చలు జరిగాయి. పాకిస్తాన్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించదని పాకిస్తాన్ డీజీఎంఓ తెలియజేసినట్లు సమాచారం.
చర్చల సమయంలో పాకిస్తాన్ బాడీ లాంగ్వేజ్ రక్షణాత్మకంగానే ఉందని సమాచారం. సంఘర్షణను పాకిస్తాన్ మరింత తీవ్రతరం చేసేలా లేదా కాల్పుల విరమణను ఉల్లంఘించే అవకాశం లేదని వర్గాలు తెలిపాయి. భూమి, వాయు, సముద్రంపై జరిగే అన్ని కాల్పులు, సైనిక చర్యలను తక్షణమే నిలిపివేయడానికి ఒక అవగాహనకు వస్తున్నట్లు భారత్, పాకిస్తాన్ శనివారం ప్రకటించిన సంగతి తెలిసిందే.