Canada Elections: కెనడా ఎన్నికల్లో కార్నీ గెలుపు.. ప్రధాని మోదీ అభినందనలు..

భారత్‌తో సంబంధాలు తెగిపోవడానికి కారణమైన విభేదాలను పరిష్కరించడానికి కృషి చేస్తామని కార్నీ చెప్పారు.

Canada Elections: కెనడా ఎన్నికల్లో కార్నీ గెలుపు.. ప్రధాని మోదీ అభినందనలు..

Updated On : April 29, 2025 / 7:15 PM IST

Canada Elections: కెనడా ఎన్నికల్లో మార్క్‌ కార్నీ నేతృత్వంలోని లిబరల్ పార్టీ గెలుపొందింది. ప్రధానిగా మార్క్‌ కార్నీ మరోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. కార్నీ విజయంపై భారత ప్రధాని మోదీ స్పందించారు. కార్నీకి ఆయన పార్టీకి అభినందనలు తెలిపారు. ఎంతో కాలంగా భారత్‌, కెనడా ఉమ్మడి ప్రజాస్వామ్య విలువలు, చట్టపరమైన పాలన పట్ల దృఢమైన వైఖరి, నిబద్ధతను ప్రదర్శిస్తున్నాయని మోదీ అన్నారు. కెనడాతో భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవడానకి, ప్రజలకు మరిన్ని అవకాశాలు కల్పించడానికి మీతో కలిసి పని చేయడానికి ఉత్సాహంగా ఎదురు చూస్తున్నా” అంటూ ట్వీట్ చేశారు ప్రధాని మోదీ.

కెనడాలో ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో సొంత పార్టీ నుంచే తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రధాని పదవితో పాటు, పార్టీ నాయకత్వానికి జస్టిన్‌ ట్రూడో రాజీనామా చేశారు. అతడి స్థానంలో ప్రధానిగా మార్క్‌ కార్నీ బాధ్యతలు తీసుకున్నారు. ట్రూడో భారత్‌కు వ్యతిరేకంగా వ్యవహరించినా.. కార్నీ అధికారం చేపట్టినప్పటి నుంచి ఇండియాకు మద్దతుగానే ఉన్నారు. దీంతో కెనడా-భారత్‌ మధ్య విచ్ఛిన్నమైన సంబంధాలు మెరుగయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. భారత్‌తో సంబంధాలు తెగిపోవడానికి కారణమైన విభేదాలను పరిష్కరించడానికి కృషి చేస్తామని కార్నీ చెప్పారు.

Also Read: పాకిస్తాన్‌కు భారత్ మరో బిగ్ షాక్..! పాక్ ఎయిర్‌లైన్స్‌కు గగనతలం మూసివేత?

ఎన్నో దశాబ్దాలుగా భారత్, కెనడా మిత్ర దేశాలుగా ఉన్నాయి. అయితే, 2013 నుంచి ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ట్రూడో అధికారంలో ఉన్న సమయంలో ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్యకు గురయ్యాడు. దీని వెనుక భారత్‌ హస్తం ఉందని ట్రూడో తీవ్ర ఆరోపణలు చేశారు. దాంతో భారత్‌, కెనడాల మధ్య ఉద్రిక్తతలు చెలరేగాయి. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ఇరు దేశాల మధ్య దూరం మరింత పెరిగింది.

మరిన్ని ఇంట్రస్టింగ్ స్టోరీలు, అప్‌డేట్స్ కోసం 10టీవీ వాట్సాప్ చానల్‌ని ఫాలో అవ్వండి.. Click Here