India Pakistan Tensions: పాకిస్తాన్‌పై భారత్ బాంబుల వర్షం..

భారత్ దాడులతో ఇస్లామాబాద్, సియాల్ కోట్, లాహోర్, బహవల్ పూర్ లో అంధకారం నెలకొంది.

India Pakistan Tensions: పాకిస్తాన్‌పై భారత్ బాంబుల వర్షం..

Updated On : May 8, 2025 / 11:45 PM IST

India Pakistan Tensions: పాకిస్తాన్ దాడులతో భారత్ ప్రతీకార దాడులకు దిగింది. పాకిస్తాన్ పై బాంబుల వర్షం కురిపిస్తోంది. పాకిస్తాన్ లోకి చొచ్చుకెళ్లి మరీ భీకర దాడులు చేస్తోంది. ఇస్లామాబాద్, లాహోర్, సియాల్ కోట్, బహవల్ పూర్ లో భారత్ దాడులకు దిగింది. ఇస్లామాబాద్ పై డ్రోన్లతో అటాక్ చేస్తోంది. భారత ఆర్మీ స్టేషన్లపై అటాక్ కు యత్నించిన పాకిస్తాన్ విఫలమైంది.

అటు.. పాక్ దాడులపై భారత రక్షణశాఖ స్టేట్ మెంట్ ఇచ్చింది. పాక్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టామని చెప్పింది. పాక్ దాడులతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదంది. భారత్ దాడులతో ఇస్లామాబాద్, సియాల్ కోట్, లాహోర్, బహవల్ పూర్ లో అంధకారం నెలకొంది. పాకిస్తాన్ కు చెందిన మూడు ఫైటర్ జెట్లను భారత ఆర్మీ కూల్చేసింది. అంతేకాదు పాకిస్తాన్ ఎయిర్ వార్నింగ్ సిస్టమ్ ను కూడా ధ్వంసం చేసింది.

పాకిస్తాన్ బరి తెగించింది. ఓవైపు సరిహద్దు గ్రామాల్లో కాల్పులు జరుపుతున్న పాక్.. అనూహ్యంగా భారత్ పై దాడులకు తెగబడింది. జమ్మూలోని ఎయిర్ పోర్ట్ సహా అనేక ప్రదేశాలపై మిస్సైల్స్, డ్రోన్లతో దాడి చేసింది. గురువారం రాత్రి అంతర్జాతీయ సరిహద్దు మీదుగా జమ్మూపై రాకెట్లు ప్రయోగించింది. వెంటనే భారత ఆర్మీ అలర్ట్ అయ్యింది.

దీనికి ప్రతిస్పందనగా భారత ఫైటర్ జెట్లు దూసుకెళ్లాయి. భారత్ తన వైమానిక రక్షణ వ్యవస్థలను యాక్టివేట్ చేసింది. ఇది వచ్చే రాకెట్లను విజయవంతంగా అడ్డుకుంది. పాక్ డ్రోన్లు, జెట్లు, మిస్సైల్స్ ను భారత్ కూల్చేసింది. గురువారం సాయంత్రం జమ్మూ కాశ్మీర్‌లోని కుప్వారా, బారాముల్లా, పూంచ్, సాంబా, ఉరి జిల్లాల్లో నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ దళాలు కవ్వింపు చర్యలకు దిగాయి.

జమ్మూ కాశ్మీర్‌లోని అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలో ఉన్న జమ్మూ, పఠాన్‌కోట్, ఉధంపూర్ సైనిక స్థావరాలను పాక్ లక్ష్యంగా చేసుకుంది. క్షిపణులు, డ్రోన్‌లను ప్రయోగించింది. అయితే భారత్ పాక్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టింది. పాక్ మిస్సైల్స్, డ్రోన్లను కూల్చేసింది.

పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని భారత్ ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించిన 48 గంటలలోపు పాకిస్తాన్ భారత్ పై దాడులకు దిగింది.