భారత యువతిని పెళ్లాడిన పాక్ యువతి

ప్రేమకు కులాలు, మతాలు భాషా, ప్రాంతాలు లేవంటారు. ఇండో-పాక్ మధ్య యుధ్ధమేఘాలు ఆవరించిన సమయంలో భారత్ పాక్ లకు చెందిన యువతులు పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచారు. ప్రపంచం వ్యాప్తంగా భారత్ పాక్ ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్ధితులను అందరూ ఆసక్తిగా గమనిస్తూ ఉన్నారు. మరోవైపు అమెరికాలోని కాలిఫోర్నియాలో ఇటీవల ఇద్దరు యువతుల పెళ్లి చేసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇద్దరు మహిళలు పెళ్లి చేసుకోవటం కొత్తేమి కాకపోయినా రెండు వైరి దేశాల యువతులు ఈ సమయంలో పెళ్లి చేసుకోవటం విశేషంగా చెప్పుకుంటున్నారు.
కొలంబియాలో స్ధిరపడిన భారత సంతతికి చెందిన యువతి బియాంక మయేలి…పాకిస్తాన్ కు చెందిన యువతి సైమా ఇటీవల వివాహం చేసుకుని ఒక్కటయ్యారు. అమెరికాలో జరిగిన ఒక కార్యక్రమంలో పరిచయమైన వీరిద్దరికి స్నేహం మరింత ముదిరి ప్రేమగా మారింది. ఒకరిని ఒకరు విడిచి ఉండలేని వీరు ఇద్దరు పెళ్ళిచేసుకోవాలని నిర్ణయించుకున్నారు.బియాంక క్రిస్టియన్ కాగా… సైమా ముస్లిం కావటం, ఇద్దరు విభిన్నసంస్కృతులు, సంప్రదాయాలవారు కావటంతో ఎటువంటి లోటు రాకుండా రెండు కుటుంబాల వారు, వారి వారి కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య వీరి పెళ్లి ఘనంగా నిర్వహించారు. పెళ్లిలో బియాంక భారతీయ సాంప్రదాయ పద్దతిలో శారీ, నెక్లెస్, నుదుటిన బొట్టు, చేతి నిండా గాజులతో మెహందీ పెట్టుకుని అలంకరించుకుంటే…. సైమా నల్లని షెర్వాణిలో పెళ్లికొడుకు గెటప్ లో అలంకరించుకుంది.
వైభవంగా జరిగిన ఈ జంట పెళ్ళి ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో అవి కాస్తా వైరల్ గా మారాయి. నెటిజన్లు ఈ జంటకు శుభాకాంక్షలు చెపుతున్నారు. ఆగస్టులోనే ఒక్కటైన మరో ఇండో-పాక్ జంట (వారు కూడా యువతులే) అంజలి చక్ర, సుందాస్ మాలిక్ కూడా ప్రేమ వివాహాం చేసుకున్నారు. వారి బాటలోనే వీరు పెళ్లి చేసుకోవటం విశేషం.