జాబిలిపై జలం.. నాసా పరిశోధనల్లో ఆశ్చర్యకరమైన అంశాలు!

  • Published By: sreehari ,Published On : October 27, 2020 / 07:00 PM IST
జాబిలిపై జలం.. నాసా పరిశోధనల్లో ఆశ్చర్యకరమైన అంశాలు!

Updated On : October 27, 2020 / 10:26 PM IST

Water on Moon : భూగోళంపై ఉన్న అనుకూల పరిస్థితుల కారణంగానే ఇక్కడ జీవకోటి మనుగడ సాధ్యమయ్యింది. ఇక్కడ నీటి లభ్యత ప్రధానమైంది. అందుకే నీటిని జీవజలం అన్నారు.

విశ్వంలో మరెక్కడన్నా జీవుల మనుగడ సాధ్యమా? ఈ ప్రశ్నకు జవాబు వెదుకుతూ మనిషి గ్రహాల వెంట పరుగులు తీస్తున్నాడు. నీటి జాడలు ఏ గ్రహంపై దొరుకుతాయో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడు.



ఆ ప్రయత్నాలు ఇప్పుడు సఫలీకృతం అయ్యే సందర్భం వచ్చినట్లే కన్పిస్తోంది. చంద్రుడిపై నీటి జాడలకు సంబంధించి నాసా పరిశోధనల్లో ఆశ్చర్యకరమైన అంశాలు వెల్లడయ్యాయి.

ఇప్పుడా సమాచారంపై మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉంది. నాసా శాస్త్రవేత్తలు ఆ పని మీదే ఉన్నారు. త్వరలో చంద్రుడిపై నీటి మిస్టరీ తొలగిపోనుంది.



చంద్రుడిపై నీటి లభ్యత స్పష్టమైతే విశ్వంపై మనిషి మరింత ఆధిపత్యం సాధించినట్లే. భూమండలం జలమయం. భూమ్మీద మూడొంతులు నీళ్ళున్నాయి.

ఉప్పునీటి సముద్రాలూ, మంచి నీటి సరస్సులూ, హిమనీ నదాలూ భూమండలాన్ని పరుచుకున్నాయి. చంద్రుడిపై కూడా నీరుందని ఇప్పుడు శాస్త్రవేత్తలు పసిగట్టారు.

కాకపోతే భూమ్మీద ఉన్నట్లు అక్కడ సరస్సులూ, సముద్రాలూ లేవు. గతంలో అనుకున్న దానికన్నా ఎక్కువ నీరు చంద్రుడిఫై ఉందని శాస్త్రవేత్తలు ప్రకటించారు.

చంద్రుడి ఉపరితలంపై ఉండే ఖనిజాల రేణువుల్లో నీరు దాగి ఉంది. శాశ్వతంగా సూర్య కాంతి ప్రసరించని ప్రాంతాల్లో ఉండే మంచు దిబ్బల్లో మరింత అధికంగా నీళ్లు నిల్వ ఉండొచ్చని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.



చంద్రుడిపై అక్కడక్కడా కొద్ది మొత్తంలో నీరు విస్తరించి ఉందని పదకొండేళ్ల క్రితం జరిగిన పరిశోధనల్లో తేలింది. నిస్సందేహంగా చంద్రుడిపై నీరు ఉందని ఇప్పుడు శాస్త్రవేత్తల బృందం ఒకటి తేల్చి చెప్పింది.

చంద్రుడి ఉపరితలంపై నీటి అణువులు ఉన్నాయని వారు స్పష్టం చేశారు. మరో శాస్త్రవేత్తల బృందం చంద్రుడిపై నీటి లభ్యతకు సంబంధించి మరింత సమాచారాన్ని సేకరించింది.

వారి అంచనాల ప్రకారం.. చంద్రుడిపై 40 వేల చదరపు కిలోమీటర్ల మేర సూర్య కిరణాలు ప్రసరించవు. ఆ ప్రాంతం శాశ్వతంగా కాంతి ఛాయలోనే ఉంటుంది. అక్కడ గడ్డకట్టిన మంచు రూపంలో నీరు అపారంగా ఉందని ఈ శాస్త్రవేత్త బృందం తేల్చి చెప్పింది.

భవిష్యత్తులో వ్యోమగాములకు కీలక బాధ్యతలు :
భవిష్యత్తులో వ్యోమగాములకు కీలక బాధ్యతలు అప్పగించనునన్నారు. చంద్రుడిపై నీరుందని తేలాక భవిష్యత్తులో చంద్రుడిపైకి వెళ్లే వ్యోమగాములకు చాలా పెద్ద పనే ఉంటుంది అక్కడ. చంద్రుడిపై ఉన్న కాంతి ఛాయా ప్రాంతాల్లో అపారంగా జల వనరులు ఉన్నాయని శాస్త్రవేత్తలు ఇప్పటికే చెబుతున్నారు.

ఇప్పుడు ఆ నీటిని వెలికి తీసి తాగునీటిగా, ఇంధనంగా ఉపయోగించే పనులు వ్యోమగాములు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రయోగాలకే ముందు ముందు ప్రాధాన్యం లభించబోతోంది.



నాసాకు చెందిన గోడ్డర్డ్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ మేరీల్యాండ్‌లో ఉంది. అక్కడున్న శాస్త్రవేత్తల బృందం పలు ఆసక్తికర విషయాల్నివెల్లడించింది. చంద్రుడిపై సహజంగా ఉన్న గాజు పలకల్లో నీటి అణువులున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

అంతేకాదు చంద్రుడి ఉపరితలంపై ఉండే ఖనిజాల రేణువుల్లో కూడా నీటి అణువులు దాగి ఉన్నాయంటున్నారు . గతంలో దీనిపై అస్పష్టత ఉండేది.



నీటి అణువులకు, దానికి దగ్గరగా ఉండే హైడ్రాక్సిల్‌కు మధ్య తేడా తెలిసేది కాదు. కొత్తగా జరిపిన పరిశోధనల తరువాత అస్పష్టత తొలిగింది. ఇప్పుడు నిస్సందేహంగా చంద్రుడిపై ఉన్నది నీరేనని శాస్త్రవేత్తలు తేల్చారు.

చంద్రునిపై మనుగడ సాధ్యమేనా? :
చంద్రుడిపై సూర్య కాంతి ప్రసరించే ప్రాంతంలో మనుగడ సాధ్యమా అన్నది తేల్చాలి. ఈ ప్రాంతాల్లో ఖనిజాల రేణువుల్లో నీటి అణువులు దాగి ఉన్నాయని
శాస్త్రవేత్తలు తేల్చారు.



చంద్రుడి‌పై ఉండే స్తబ్దమైన పర్యావరణ అవాంతరాల నుంచి ఈ నీటిని రక్షించాల్సి ఉంటుంది. సోఫియా ఎయిర్ బోర్న్ అబ్సర్వేటరీ డేటా ఆధారంగా శాస్త్రవేత్తలు ఈ విషయాలు నిర్ధారించారు.

బోయింగ్ 747SP విమానానికి ఒక టెలిస్కోపు అమర్చారు. దాన్ని ఎయిర్ బోర్న్ అబ్జర్వేటరీ‌గా మార్చారు. దాన్నుంచి వచ్చిన డేటా ఆధారంగానే శాస్త్రవేత్తలు ఈ విషయాలు నిర్ధారించారు.



ఇప్పుడీ కొత్త సమాచారంపై కొందరు అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. చంద్రుడిపై నిజంగానే నీరుందా? లేక శాస్త్రవేత్తలు పొరబడ్డారా అనే వాదనను తెరపైకి తీసుకువచ్చారు.